పచ్చనిదందా

0
2


పచ్చనిదందా

 భారీ వృక్షాలకు గొడ్డలి వేటు
 బొగ్గుగా మార్చి..కాసులు కాజేసి
 నాగిరెడ్డిపేట మండలం
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి,
న్యూస్‌టుడే, నాగిరెడ్డిపేట

నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరు శివారులో (నిజాంసాగర్‌ జలాశయం బ్యాక్‌వాటర్‌ నిలిచే ప్రాంతం) బొగ్గు వ్యాపారం కాసులు కురిపిస్తోంది. రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా పచ్చనిచెట్లను పెకిలించి  బొగ్గుగా మార్చి విక్రయిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కొందరు వ్యాపారులు స్థానిక అధికారులను మచ్చిక చేసుకొని   అక్రమ వ్యాపారానికి తెర తీశారు. ప్రశ్నిస్తే అటవీశాఖ అనుమతులున్నాయని నమ్మబలుకుతున్నారు. కలపను కాల్చి బొగ్గుగా మార్చేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అనుమతి ఇవ్వలేదు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి
చీకిపోయిన వృథాగా ఉన్న కలపను బొగ్గుకు వినియోగించాలి. ఇందుకు అటవీ శాఖ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒక వేళ పచ్చని  చెట్లను బొగ్గుగా మార్చాలంటే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు పొందాలి.

పచ్చని చెట్లను మసి చేస్తున్నారిలా
* నిజాంసాగర్‌ జలాశయం నిండిన   సమయంలో వరదనీరు గ్రామాల్లోకి రాకుండా   అదనంగా భూసేకరణ చేశారు. నాగిరెడ్డిపేట మండలం చిన్నఆత్మకూరు, పెద్దఆత్మకూరు,  మెదక్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇలాంటి భూములున్నాయి.
* ఆ భూములు పడావుగా మారడంతో వివిధ రకాల చెట్లు పెరిగాయి. ప్రధానంగా తుమ్మ, పట్నం తుమ్మ, మర్రి, వేపతోపాటు నీడనిచ్చే చెట్లు పెద్దసంఖ్యలో ఉన్నాయి. వీటితో మంజీర నది ఒడ్డు దట్టమైన అడవిలా మారింది.
* దట్టంగా పెరిగిన చెట్లపై మహారాష్ట్ర బొగ్గు వ్యాపారులు కన్నేశారు. గ్రామస్థులను మచ్చిక చేసుకొని యంత్రాల సాయంతో నరికేస్తున్నారు. ప్రత్యేక రసాయనాలు చల్లి అగ్గి పెట్టి బొగ్గుగా మార్చుతున్నారు.
* ఈ దందా రెండేళ్ల నుంచి సాగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో చెట్లను నేలమట్టం చేశారు.

ఉదయం నరికి.. రాత్రి మసి చేసి
* బొగ్గు వ్యాపారుల కూలీలు ఉదయం  నదీ ఒడ్డున వృక్షాలను నేలమట్టం చేస్తారు. రాత్రి వేళ బొగ్గుగా మార్చుతున్నారు.
* బొగ్గును ఆత్మకూరు గ్రామ శివారులో నిల్వచేసి లారీల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ముచేసుకొంటున్నారు.

పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం
– గంగాధర్‌, రేంజ్‌  అధికారి, అటవీశాఖ , నాగిరెడ్డిపేట
అనుమతి పత్రాలు ఉన్నట్లు రెండేళ్ల కిందట చూపారు. గత ఏడాది తాండూర్‌ డివిజన్‌లో బొగ్గు తయారీ చేశారు. ఈ ఏడాది  ఆత్మకూరు  డివిజన్‌లో బొగ్గు తయారు  చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాలు ప్రారంభమైన నాటి నుంచి పనులు నిలిపివేశారు. అనుమతి  పత్రాలు మరో మారు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

ఆత్మకూర్‌ కేంద్రంగా వ్యాపారం
అడవుల సంరక్షణ.. విస్తరణకు  రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. హరితహారం పేరుతో విస్తృతంగా మొక్కలు నాటుతోంది.పచ్చదనం పెంపుపై ప్రభుత్వం ఇంతలా దృష్టి సారిస్తే అక్రమార్కులు అనుమతుల పేరుతో చెట్లను అడ్డంగా నరికేస్తున్నారు. వాటిని బొగ్గుగా మార్చి జేబులు నింపుకొంటున్నారు. నిజాంసాగర్‌ వెనక జలాల గ్రామాల్లో ఈ దందా  కొనసాగుతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here