పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి, 75 మందికి గాయాలు

0
2


పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఓ ట్రాక్‌పై నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం పాలవగా.. 80 మంది వరకు గాయపడ్డారు. అనధికారికంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని కొన్ని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ పంజాబ్‌కు చెందిన సాదిఖాబాద్‌లోని వాల్హర్‌ రైల్వేస్టేషన్‌లో గురువారం (జులై 11) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పట్టాలపై నిలిపి ఉంచిన గూడ్స్‌రైలును అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చే సిగ్నల్‌లో పొరపాటు జరగడంతో అది గూడ్స్‌ రైలు నిలిపి ఉంచిన లూప్‌ లైన్‌లోకి ప్రవేశించిందని.. దీంతో ఈ ఘోరం జరిగిందని అధికారులు చెప్పారు. గాయపడిన వారిని సహాయ సిబ్బంది సమీపంలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రయాణికుల మృతదేహాలు, బాధితుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. హైడ్రలిక్‌ కట్టర్‌లను ఉపయోగించి బోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. వరస రైలు ప్రమాదాల పట్ల విచారణ జరిపించాలని రైల్వే మంత్రిని ఆదేశించారు.

పాకిస్థాన్‌లో హైదరాబాద్‌లో జూన్‌ 20న కూడా ఇదే తరహా రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్‌ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించగా.. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here