పురాల్లోహరీతహారం

0
2


పురాల్లోహరీతహారం

పచ్చదనానికి అవరోధాలెన్నో
మొక్కదశలోనే చచ్చిపోతున్నాయి

పట్టణాల్లో వాయుకాలుష్యం నానాటికీ పెరుగుతోందని ఇటీవల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పురవాసులు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేక శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అసలే పోషణ భారంతో బతుకీడుస్తున్న ప్రజలకు కలుషిత గాలి   గుదిబండగా మారుతోంది. చిన్నస్థాయి పట్టణాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. ఉభయ జిల్లాల్లోని పట్టణాలు ఇందుకు అతీతమేమీ కాదు. ఈ సమస్యకు   హరితహారం పరిష్కారం చూపుతుందని భావించినా.. క్షేత్రస్థాయిలో విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇప్పటి వరకు నాలుగు విడతల్లో పెరిగి నాటిన లక్షల మొక్కలు    పచ్చదనం నిండుగా కనిపించాలి.   కానీ క్షేత్రస్థాయిలో వేరేలా ఉంది. నాటిన మొక్కల్లో అధికారులు చెబుతున్న  లెక్కలకు… కనిపించేవాటికి పొంతన కుదరడంలేదు. కనీసం అయిదో విడతలోనైనా కార్యక్రమాన్ని విజయవంతం చేసి పుర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే ప్రయత్నం చేయాలి. అందుకు గత అనుభవ  పాఠాలను ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

పట్టణాలు, నగరాల్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. వాహనాల వినియోగం, పరిశ్రమల కాలుష్యమూ ఎక్కువే. సేకరించే చెత్తను తగలబెట్టడం వంటి హరిత నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలు ఉంటాయి. వీటి ద్వారా ఏర్పడే వాయు కాలుష్యం కారణంగా ప్రజలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ అడవులు సృష్టించాలన్నది సర్కారు లక్ష్యం. ప్రతి ఇంటి ఆవరణలో, ఖాళీ ప్రదేశాలు, డంపింగ్‌యార్డులు, రహదారులు… ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని మున్సిపాలిటీలకు లక్ష్యం విధించింది. అది లక్షల్లో ఉండటం గమనార్హం.

మొక్కలకు జాగా ఏదీ?
ప్రణాళిక లేని పట్టణాలు హరితహారానికి ప్రధాన అవరోధంగా తయారయ్యాయి. ఇష్టారీతిన వెలుస్తున్న కాలనీల్లో రహదారులు, డ్రైనేజీలు, మంచినీటి పైపులైను, విద్యుత్తు తీగలకు స్థలం వదలకుండానే ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారు. ప్రజలు సైతం సెంటు భూమి వదలకుండా రహదారి వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక రహదారిపై మట్టి కనిపించకుండా సీసీ రోడ్ల నిర్మాణం, వాటి పక్కనే సీసీ డ్రైన్లు ఉంటున్నాయి. ఏమైనా స్థలం ఉందా అంటే భూగర్భంలో మంచినీటి పైపులైను వ్యవస్థ. నింగివైపు మొక్క ఎదగనీయకుండా విద్యుత్తు తీగలు. ఇలా ఎక్కడికక్కడ సిమెంటు వనాలుగా మారుతుండటంతో మొక్కల పెంపకం ప్రహసనంగా మారింది.

వ్యయ, ప్రయాస వృథా..
విత్తు విత్తి పెంచడం దగ్గరి నుంచి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి నాటే వరకు ఒక్కోదానికి రూ.10-25 వరకు వ్యయం అవుతుందని అంచనా. ఇంత ఖర్చు పెట్టినా ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. వ్యయ, ప్రయాసలు వృథా అవుతున్నాయి. ప్రభుత్వం బల్దియాలకు హరితహారం కింద నిధులు ప్రత్యేకంగా కేటాయించదు. స్థానిక సాధారణ నిధుల నుంచే కార్యక్రమానికి వెచ్చిస్తున్నారు. ఇక్కడి కార్మికులనే వినియోగిస్తున్నారు. బోధన్‌ పట్టణంలో మొక్కల కోసం గుంతలు తవ్వడానికి రూ.2 లక్షలు వెచ్చించి రెండు యంత్రాలను కొనుగోలు చేశారు. కేవలం ట్రీగార్డుల కోసమే గతేడాది రూ.2 లక్షలు కేటాయించినా పూర్తిస్థాయిలో వినియోగించలేదు.

ఈసారీ లక్ష్యం ఎక్కువే….
ఉభయ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అయిదో విడత హరితహారంలో మొక్కల పెంపకానికి భారీ లక్ష్యాలు విధించారు. గతేడాది నాటినవే అతీగతీ లేకుండా ఉన్నాయంటే.. ఈసారి విధించిన లక్ష్యం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. విలీన పంచాయతీలు ఉండటంతో ఖాళీ స్థలాలే లక్ష్యంగా ఈసారి సంఖ్యను పెంచారు. వాటి సంరక్షణే ప్రధాన సమస్యగా మారనుంది. పల్లెల్లో ఉపాధి హామీ పథకం కూలీలతో సంరక్షణ చర్యలు చేపట్టొచ్చు. ఇక్కడ కూలీలను నియమిస్తే బల్దియా సాధారణ నిధుల నుంచి చెల్లించాలి. అందుకు నిబంధనలు అనుకూలించవు. అలా అరకొర సంరక్షణ చర్యలతో బతుకుతున్న మొక్కల సంఖ్య 20-30 శాతం కూడా ఉండదు. కానీ అధికారులు 40 శాతానికి పైగా లెక్కలు చూపిస్తున్నారు.

సంరక్షణకు చర్యలేవి?
లక్షలాది మొక్కల లక్ష్యంతో హరితహారం కార్యక్రమం చేపడుతున్న అధికారులు వాటిని నాటే వరకే పరిమితమవుతున్నారు. ఆ తర్వాత సంరక్షణ తూతూ మంత్రంగా సాగుతోంది.
* ఇంటింటికి అయిదేసి మొక్కలు పంపిణీ చేస్తున్నారు. వాటిని నాటారా? లేదా? అన్న విషయాలు పరిగణనలోకి తీసుకోవడంలేదు. దీంతో పంపిణీ చేసిన వాటిలో సగానికి పైగా వృథా అవుతున్నాయి.
* రహదారుల వెంట నాటిన మొక్కలు ఎదగడానికి ఆస్కారమున్నా వాటికి వర్షాకాలం తర్వాత నీరు పోసి రక్షించడంలో విఫలమవుతున్నారు. ఈ బాధ్యత ఇక్కడ మున్సిపల్‌ కార్మికులకు అప్పగిస్తున్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యే వీరు మొక్కల బాధ్యతను పట్టించుకోవడంలేదు. దీంతో వానాకాలంలో అంతో ఇంతో బతికినా.. ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి.
* నాటినవాటికి రక్షణ కవచాలు ఏర్పాటు చేయడంలేదు. నాటిన రోజే పశువులకు మేతగా మారే పరిస్థితి ఉంటోంది.
* మంచినీటి పైపులైను ఉన్న చోట వేర్లు వాటిని ధ్వంసం చేస్తాయని అధికారులు ఆ వైపు మొక్కలు నాటడంలేదు. మరోవైపు విద్యుత్తు తీగల కిందనే నాటక తప్పని పరిస్థితి. వాటిని రెండేళ్లు కాపాడితే… తీగలకు తగులుతున్నాయని విద్యుత్తు అధికారులు నరికేసి మోడుగా మారుస్తున్నారు.
* డంపింగ్‌యార్డు, ఇతర ఖాళీ ప్రదేశాల్లోనూ ఇదే పరిస్థితి.
* కేవలం పాఠశాలలు, లేదా ప్రహరీలు ఉన్న సంస్థల ప్రాంగణాల్లో మాత్రమే బతుకుతున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here