పూణె టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో టీమిండియా విజయం: 2-0తో సిరిస్ కైవసం

0
1


హైదరాబాద్: సొంతగడ్డపై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. గత రెండేళ్లుగా స్వదేశంలో పర్యటించిన ఏ జట్టు కూడా కోహ్లీసేనకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఆదివారం ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది. పుణె టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇంకో టెస్టు మిగిలుండగానే సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో కోహ్లీసేన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఈ సిరిస్‌లో ఆఖరిదైన మూడో టెస్టు అక్టోబర్ 19 నుంచి రాంచీలో జరగనుంది. విశాఖ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

1
46114

ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ (3/22), రవీంజ్ర జడేజా (3/52) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 601/5 వద్ద డిక్లేర్డ్‌

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 601/5 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే దక్షిణాఫ్రికా జట్టు ఆలౌట్‌ కావడంతో ఫాలోఆన్‌ ఆడాల్సి వచ్చింది. దీంతో నాలుగో రోజైన ఆదివారం దక్షిణాఫ్రికా 189 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

21 పరుగుల వద్ద రెండో వికెట్

ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 21 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఉమేశ్‌యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతి లెగ్‌సైడ్‌ వెళ్లినా డిబ్రుయిన్‌(8) షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్‌కు తగిలిన బంతి వికెట్ల వెనుక నుంచి దూరంగా వెళుతున్న క్యాచ్‌ను సాహా తనదైన మార్కుతో అందుకున్నాడు.

సాహా అద్భుత క్యాచ్‌లు

డైవ్ చేసి మరీ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌తో వృద్ధిమాన్ సాహా అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో సైతం డిబ్రుయిన్‌ వికెట్ కీపర్ సాహాకే క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం విశేషం. తాజాగా రెండో ఇన్నింగ్స్‌‌లో కూడా డిబ్రుయిన్‌ మళ్లీ సాహా చేతికే చిక్కి పెవిలియన్‌కు చేరడం విశేషం. డిబ్రుయిన్‌ రెండు సార్లు ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

తొలి ఓవర్‌ రెండో బంతికే

అంతకముందు మ్యాచ్‌ మొదలైన రెండో బంతికే ఇషాంత్‌ శర్మ తొలి వికెట్‌ వికెట్‌ పడగొట్టాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన మార్కరమ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతికి మార్కరమ్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

మూడు వికెట్లతో చెలరేగిన ఉమేశ్, జడేజా

ఆ తర్వాత 24వ ఓవర్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌(5)ను పెవిలియన్‌కు పంపాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ డీన్ ఎల్గర్‌ 48(72), బవుమా 38(63), ఫిలాండర్‌ 37(72), కేశవ్‌ మహరాజ్‌ 22(65)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా, అశ్విన్‌ రెండు, ఇషాంత్‌ శర్మ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

స్కోరు వివరాలు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/5 డిక్లేర్డ్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 275 ఆలౌట్‌

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 189 ఆలౌట్‌(ఫాలోఆన్)

మ్యాచ్ ఫలితం: ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారత్ విజయంSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here