పృథ్వీ షాకు దగ్గు, జలుబు లేదు.. డోప్‌ టెస్ట్‌లో కొత్త కోణం

0
0


న్యూఢిల్లీ: టీమిండియా యువ టెస్ట్ ఓపెనర్‌ పృథ్వీ షా డోప్‌ టెస్ట్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దగ్గు, జలుబుకు పృథ్వీ వాడిన సిరప్‌లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉందని తేలడంతో అతడిపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఎనిమిది నెలల నిషేధం విధించింది. అయితే తాజాగా ముంబై జట్టు కోచ్‌ వినాయక్‌ సామంత్‌, ఫిజియో దీప్‌ తోమర్‌ చెప్పిన విషయాలు ఈ డోపింగ్‌ టెస్ట్‌పై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఆగస్టు 15 తర్వాతే టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ సమయంలో పృథ్వీ షా దగ్గు, జలుబుతో బాధపడలేదని వినాయక్‌, దీప్‌ వెల్లడించారు. ‘సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ సమయంలో షాకు స్వల్ప జ్వరం వచ్చింది. అతను దగ్గు, జలుబుతో మాత్రం బాధపడలేదు. దగ్గు నివారణ కోసం మందు ఇవ్వాలని షా మమ్మల్ని అడగలేదు. మేం పూర్తి సమయం అందుబాటులో ఉన్నాం’ అని సామంత్‌, తోమర్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, బీసీసీఐ యాంటీ డోపింగ్‌ మేనేజర్‌ అభిజత్‌ సాల్వి చెప్పిన వివరాలు మరోలా ఉన్నాయి. ‘దగ్గు, జలుబు కోసం షా తన తండ్రిని సలహా కోరగా.. ఫార్మసీకి వెళ్లి మెడిసిన్‌ తీసుకోమన్నాడని, దాంతో ఇండోర్‌లోని బస చేసిన హోటల్‌కు దగ్గరగా ఉన్న మెడికల్‌ షాపుకు వెళ్లి షా సిరప్‌ తీసుకున్నాడు. సిరప్‌ వాడిన కారణంగానే షా డోపింగ్‌ టెస్టులో విఫలమయ్యాడు’ అని సాల్వి పేర్కొన్నారు. హోటల్‌లో ఉన్న వైద్యుడిని కాకుండా.. తండ్రిని సంప్రదించడమేమిటనే అనుమానం కలుగుతోంది.

షా మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలినా.. తేలికైన శిక్షతో వదిలేశారన్న ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. షా డోపింగ్ నిషేధానికి దారితీసిన సంఘటనల కాలపరిమితిని బీసీసీఐ విడుదల చేసింది. పృథ్వీ షా నమూనాలను సేకరించడానికి, తుది నివేదికను అందించడానికి మధ్య నేషనల్‌ డోప్‌ టెస్టింగ్‌ లేబరేటరీ (ఎన్‌డీటీఎల్‌) రెండు నెలల సమయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు షా డోపింగ్‌ విషయంలో మా తప్పేమీ లేదని కూడా పేర్కొందట.

టీ20 కలల జట్టులో ధోనీకి చోటు.. కోహ్లీకి మొండిచేయి

మరోవైపు షా డోపింగ్‌ కేసును ప్రపంచ డోపింగ్‌ నిరోధ సంస్థ (వాడా) మళ్లీ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఈ కేసు జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (నాడా) పరిధిలోకి వచ్చేందుకు బోర్డు తిరస్కరిస్తోంది. అయితే ముంబై టీ20 లీగ్‌, ఐపీఎల్‌లో ఆడేందుకు వీలుగా షా డోప్‌ పరీక్షా ఫలితాన్ని బీసీసీఐ ఆలస్యం చేసిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here