పెట్టుబడుల్లో భారత్ ఎక్కడ? ఆసియా దేశాలతో పోటీ లో గెలుపెవరిదో!

0
7


పెట్టుబడుల్లో భారత్ ఎక్కడ? ఆసియా దేశాలతో పోటీ లో గెలుపెవరిదో!

ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఆసియా దేశాలు మాత్రమే. చైనా, భారత్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఫిలిఫ్ఫీన్స్, వియాత్నం, తైవాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు మెరుగైన జీడీపీ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. 2010 వరకు జీడీపీ వృద్ధిలో 10% నికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిన చైనా….ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. అదే సమయంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జాబితా లో చేరిపోయింది. 2004-2014 మధ్య కాలంలో 8% వృద్ధి రేటును సాధించి 10% వృద్ధి రేటుపై గురి పెట్టింది. కానీ, అనేక పరిణామాల నేపథ్యంలో భారత్ ఆ స్థాయికి చేరుకోలేక పోయింది. అయినప్పటికీ 7-8% సగటుతో జీడీపీ లో ముందుకు సాగింది. ఈ రేటు కూడా ప్రపంచంలోనే అధికం కావడం విశేషం. కానీ గత 15 ఏళ్లలో తొలిసారి భారత్ జీడీపీ వృద్ధి విషయంలో ఆందోళనకు గురైంది.

ఇది కేవలం 5% నికి పడిపోవడంతో ఆర్థిక మందగమనం మొదలైపోయిందన్న అంచనాలు మొదలయ్యాయి. దీనిపై సీరియస్ గా ఆలోచించిన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేసింది. చివరకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కార్పొరేట్ టాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించటంతో మళ్ళీ ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో అసలు ఆసియా దేశాల్లో పెట్టుబడుల ఆకర్షణ విషయంలో భారత్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందొ చూడాల్సిన అవసరం ఏర్పడింది.

200 బిలియన్ డాలర్ల ఎఫ్ఢీఐ …

భారత దేశంలోకి 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు సుమారు 200 బిలియన్ డాలర్ల (సుమారు 14,00,000 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ఢీఐ) సమకూరాయి. ఇందులో ప్రధానంగా మారిషస్, సింగపూర్, జపాన్ దేశాల నుంచి అధిక మొత్తంలో పెట్టుబడులు అందాయి. మారిషస్ అత్యధికంగా 32 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 2,24,000 కోట్లు) పెట్టుబడులను పెట్టగా … సింగపూర్ 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ 1,40,000 కోట్ల ) పెట్టుబడిగా పెట్టింది. ఇక జపాన్ 7 బిలియన్ డాలర్లు (రూ 49,000 కోట్లు) మేరకు పెట్టుబడులు సమకూర్చింది. ఈ వివరాలను ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.

సేవల రంగమే టాప్…

మన దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో సేవల రంగమే తోలి స్థానంలో నిలిచింది. మొత్తం 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు గాను 77 బిలియన్ డాలర్ల (సుమారు రూ 5,39,000 కోట్లు) పెట్టుబడులతో అదరగొట్టింది. ఆ తర్వాతి స్థానంలో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ అండ్ హార్డ్ వేర్ రంగం నిలిచింది. ఈ రంగం దాదాపు 40 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 2,80,000 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. 37 బిలియన్ డాలర్ల (సుమారు రూ 2,59,000 కోట్లు ) తో టెలి కమ్యూనికేషన్స్ రంగం మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా… నిర్మాణం, టౌన్షిప్ డెవలప్మెంట్, హౌసింగ్ , మౌలిక సదుపాయాలు, వర్తకం, ఆటోమొబైల్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఫార్మస్యూటికల్స్, పవర్ వంటి రంగాలు మిగితా పెట్టుబడులను ఆకర్షించాయి.

కార్పొరేట్ టాక్సుల తీరుతెన్నులు…

ఆసియా దేశాల్లో మనతో పోటీ పడుతున్న దేశాల్లో కార్పొరేట్ పన్ను ఆకర్షణీయంగా ఉంది. ఈ అన్ని దేశాలకు ప్రధానంగా పెట్టుబడులు సమకూరుస్తోంది సింగపూర్, జపాన్, అమెరికా, యురోపియన్ దేశాలే. ఇటీవల చైనా కూడా తమ పెట్టుబడులను పెంచింది. అమెరికాతో కొనసాగుతున్న ట్రేడ్ వార్ లో భాగంగా ఆ దేశం కూడా ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది. ఇందులో భాగంగా భారత్ లోనూ పెట్టుబడులు పెడుతోంది. స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులు సహా తయారీ రంగంలో పెట్టుబడులను పెంచింది. మనతో పోటీ పడే దేశాలైన ఇండోనేషియా లో కార్పొరేట్ టాక్స్ 25%, మయాన్మార్ లో 25%, కంబోడియా లో 20%, బ్రూనై లో 18.5%, ఫిలిప్పీన్స్ లో 30%, వియాత్నం లో 20%, థాయిలాండ్ లో 20%, సింగపూర్ లో 17% మేరకు ఉన్నాయి.

పెట్టుబడులు పెరగాలంటే ఏంచేయాలి?

భారత్ లో కొత్త ప్రతిపాదిత కార్పొరేట్ పన్నుల రేటు ప్రకారం… పాత కంపెనీలకు 22% (సర్చార్జీలతో కలిపి 25%), తయారీ రంగంలో అక్టోబర్ 1 తర్వాత పెట్టె కొత్త కంపెనీలకు 15% (సెస్సులతో కలిపి 17%) పన్ను రేటు వర్తిస్తుంది. ఈ రెండు స్లాబులు కూడా మిగితా ఆసియా దేశాలతో పోటీ పడేందుకు సహకరించే స్థాయిలో ఉన్నప్పటికీ… భారత్ లోకి మరిన్ని విదేశి ప్రత్యక్ష పెట్టుబడులు తరలి రావాలంటే… ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం తగ్గాలి. భూముల కొనుగోలు, సేకరణ సమయం తగ్గాలి. కార్మిక చట్టాలు సులభతరం కావలి. మౌలిక సదుపాయాలు మెరుగవ్వాలి. పోర్టుల్లో టర్న్ఎరౌండ్ టైం గణనీయంగా తగ్గాలి. అప్పుడే, పూర్తి స్థాయిలో భారత్ ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు, మెరుగైన జీడీపీ వృద్ధిని నమోదు చేయగలదని నిపుణులు పేర్కొంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here