పెసరంతకొనుగోళ్లు

0
3


పెసరంతకొనుగోళ్లు

● పెసర దిగుబడులు తీసుకోని నిర్వాహకులు

రోజుల తరబడి నిరీక్షిస్తున్న కర్షకులు

● కొనుగోలు కేంద్రం ఉన్నా ఫలితం శూన్యం

న్యూస్‌టుడే, మద్నూర్‌

మార్కెట్‌ యార్డులో పెసర సంచుల వద్ద కాపలాగా ఉన్న రైతు

ఖరీఫ్‌ ఆరంభంలో అడపాదడపా పడ్డ వర్షాల ఆధారంగానే పెసర వేశారు. ఎకరానికి 7-9 క్వింటాళ్ల దిగుబడి రావల్సి ఉండగా సరైన సమయంలో నీటి తడులు అందక రెండు, మూడు క్వింటాళ్లకు పడిపోయింది. కోత దశలో వర్షాలు పడి మరింత నష్టం వాటిల్లింది. ఎంతో కొంత చేతికొచ్చిన దిగుబడులనూ ఇప్పుడు అమ్ముకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఇందుకు కారణం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేయడమే.

ఈ సీజన్‌లో జిల్లాలోనే అత్యధికంగా జుక్కల్‌ నియోజకవర్గంలో పెసర సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై వేల ఎకరాల్లో పంట వేస్తే అందులో సింహభాగం ఈ సెగ్మెంటులోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం మద్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సర్కారు మద్దతు ధర రూ.7,050 ఇస్తుండటంతో రైతులు దిగుబడులను కేంద్రానికి తరలిస్తున్నారు. నిర్వాహకులు మాత్రం కొనుగోలు చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందని, మిషన్లతో కోసిన పంట తీసుకోమని కొర్రీలు పెడుతూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ‘ఈనాడు-ఈటీవీ’ పరిశీలించగా కర్షకులు గోడును వెళ్లబోసుకున్నారు.


కొనుగోళ్లలో నిర్లక్ష్యం

– బాలకిషన్‌, మద్నూర్‌

ఈ నెల 19న పెసర కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే.. 24వ తేదీ వరకు మూసే ఉంచారు. పది రోజుల నుంచి యార్డులోనే పంటను ఆరబెడుతూ ఉంటున్నాం. అయినా తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ తీసుకోవడం లేదు. బయట ప్రైవేటుగా అమ్ముకొందామంటే రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.


యంత్రంతో కోస్తే వద్దంటున్నారు

– రమేష్‌, మద్నూర్‌

నేను పది ఎకరాల్లో పెసర సాగు చేశాను. 25 క్వింటాళ్లు వచ్చింది. కూలీల చేత కోయించిన పంటను మాత్రమే కొనుగోలు చేస్తామని, మిషన్లతో కోసింది తీసుకోమని అధికారులు చెబుతున్నారు. పంటను కోసేందుకు కూలీలే దొరకడం లేదు. తప్పని పరిస్థితుల్లో మిషన్లతో పంట కోయించాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటీ..?


ఎక్కువగా ఉందని..

బాబురావు, సహకార సంఘం కార్యదర్శి, మద్నూర్‌

తేమ శాతం 12కు మించొద్ధు రైతులు తీసుకొస్తున్న పంటలో 14 శాతం వరకు ఉంటోంది. అందుకే కొనుగోలు చేయడం లేదు. ఇప్పటి వరకు 24 మంది రైతుల నుంచి 220 క్వింటాళ్లు కొనుగోలు చేశాం. తేమశాతం సరిగా ఉంటే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కర్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకొంటున్నాం.


 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here