పేదింటి పైలెట్‌

0
3


పేదింటి పైలెట్‌

తెలంగాణ నుంచి పైలెట్‌ శిక్షణకు ఎంపికైన శ్రావ్య

నాన్న ప్లంబర్‌.. అమ్మ బీడీ కార్మికురాలు

ధర్పల్లి, న్యూస్‌టుడే

‘‘పిల్లలను ఒక లక్ష్యంతో చదివిస్తే ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. గ్రామీణ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు పేదింటి అమ్మాయిలే అందుకు ఉదాహరణ. వారిలో ఒకరు ఎవరెస్టు అధిరోహకురాలు మాలవత్‌ పూర్ణ కాగా.. మరొకరు హోన్నాజీపేట్‌ నుంచి పైలెట్‌ శిక్షణకు ఎంపికైన శ్రావ్య.’’

– మంగళవారం గోవింద్‌పల్లిలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ వ్యాఖ్యలు ఇవి.

కుటుంబానిది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అటువంటి ఇంట్లో పుట్టిన ఆమె తమ స్తోమతకు మించిన విద్యను అభ్యసించాలని కలలుకంది. ఎంత కష్టమైనా లక్ష్యం చేరాలని భావించింది. చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే సాగినా ఖరీదైన పైలట్‌ కోర్సును ఎంచుకుంది. మన వల్ల కాదని నిరుత్సాహపరిచినా తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. జూన్‌లో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్‌ అకాడమి నిర్వహించిన కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ పరీక్షలో ప్రతిభ చాటి శిక్షణకు ఎంపికైంది. రాష్ట్రం నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఎంపిక కాగా.. అందులో ఒకరు ధర్పల్లి మండలం హోన్నాజీపేట్‌కు చెందిన గౌరీ శ్రావ్య.
 

తల్లిదండ్రుల ప్రోత్సాహం

గౌరీ సుభాష్‌, శశికళ దంపతులకు ముగ్గురు సంతానం. శ్రావ్య చిన్న కూతురు. సుభాష్‌ గల్ఫ్‌లో తొమ్మిదేళ్లు చాలీచాలని వేతనంతో ప్లంబర్‌గా పని చేసి గతేడాది తిరిగి వచ్చారు. అమ్మ బీడీ కార్మికురాలు. శ్రావ్య చిన్ననాటి నుంచి చదువులో ముందుండేది. తల్లిదండ్రులు అన్నింట్లో ఆమెకు ప్రోత్సాహం అందించేవారు. పైలెట్‌ శిక్షణ ప్రవేశ రుసుము కోసం సుమారు రూ.2.25 లక్షలు అప్పు చేసి పంపించారు.

ఉపకారవేతనంతో ఎంపికైన ఏకైక విద్యార్థిని

పైలెట్‌ శిక్షణకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 15 మంది విద్యార్థులను ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు సొంత ఖర్చులతో చదవడానికి ఎంపిక కాగా.. శ్రావ్య మాత్రమే ప్రభుత్వ ఉపకారవేతనానికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేట తెలంగాణ ఏవియేషన్‌ అకాడమీలో ఆగస్టు నుంచి ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. 18 నెలలు కొనసాగనుంది.

డిగ్రీ చదువుతూనే సాధన

ఇంటర్మీడియెట్‌ పూర్తయిన తర్వాత పైలెట్‌ కావాలని కోరుకున్నా. నాన్నకు చెబితే తమ ఆర్థిక పరిస్థితి సరిపోదని నచ్చజెప్పారు. ఏవియేషన్‌ అకాడమి ప్రవేశ పరీక్ష గురించి తెలుసుకుని డిగ్రీ చదువుతూనే కష్టపడి సాధన చేశాను. మా గురువుల సహకారంతో ఈ శిక్షణకు ఎంపికయ్యాను. నైపుణ్యం సాధించి మంచి పైలెట్‌ని అవుతాను.

– గౌరీ శ్రావ్య

చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే..

గౌరీ శ్రావ్య 10వ తరగతి వరకు హోన్నాజీపేట్‌లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివారు. ● 2014లో తాడ్కోల్‌ బాలికల గురుకుల ఇంటర్మీడియెట్‌ కళాశాలలో చేరారు. ● నిజామాబాద్‌ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కోర్సును 2019లో పూర్తి చేశారు. ● ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ ఏవియేషన్‌ అకాడమి నిర్వహించిన పైలెట్‌ శిక్షణ ప్రవేశ పరీక్షకు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here