ప్రగతి వేగంగా.. సంక్షేమం సమృద్ధిగా..

0
0


ప్రగతి వేగంగా.. సంక్షేమం సమృద్ధిగా..

పథకాల అమల్లో జిల్లా ముందంజ
వెల్లడించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఈనాడు, నిజామాబాద్‌

సమున్నత లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం.. బృహత్తర ప్రణాళికల అమలులో జిల్లా ప్రగతి వేగంగా ముందుకు వెళ్తుంది.. పేదరికం నిర్మూలించడానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం..త్వరలోనే శ్రీరాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు తీసుకొస్తాం.

-స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
 

జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో పంద్రాగస్టు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా శాఖలకు చెందిన అభివృద్ధిని వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు.
జలయజ్ఞం సాఫీగా
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు తరలొచ్చే సమయం ఆసన్నమైంది. కొద్దిరోజుల్లో ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. సాగునీటి రంగానికి దిక్సూచిగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టులో 20, 21, 21ఎ ప్యాకేజీలతో ఇందూరు జిల్లా సస్యశ్యామలం కానుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవానికి రూ.1751 కోట్లు, కాళేశ్వరం పనులకు రూ.2800 కోట్లు కేటాయించాం. చెక్‌ డ్యాముల నిర్మాణానికి రూ.32.67 కోట్లు మంజూరు చేశాం.
పల్లెకు చేరిన గంగ  
మిషన్‌ భగీరథతో పల్లెకు స్వచ్ఛ జలం వచ్చింది. 25 మండలాలకు తాగునీరు అందిస్తున్నాం. ఎక్కడా అపరిశుభ్రత లేకుండా మేలిరకం తాగునీటికి ఇస్తున్నాం. ఈ పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి మదిలో మెదిలిన బృహత్తర ఆలోచన..ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
అభివృద్ధి చకచకా
అభివృద్ధి వేగం పుంజుకుంది. ప్రగతి పనులు భారీ ఎత్తున సాగుతున్నాయి..పంచాయతీరాజ్‌ శాఖలో వంతెనలకు రూ.43.43 కోట్లు, రోడ్లకు రూ.183 కోట్లు వెచ్చించాం. ఆర్‌అండ్‌బీలో రూ.686 కోట్లు మంజూరు చేశాం.
రైతులకు మేలు కలిగేలా
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. రైతుబంధు పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 1.34 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.147.43 కోట్లు జమ చేశాం. 561 రైతు కుటుంబాలకు రైతు బీమాలో రూ.28.5 కోట్లు అందిస్తున్నాం. విత్తన రాయితీకి రూ.11.08 కోట్లు, మత్స్యకారుల చేయూతకు రూ.23 కోట్లు ఇస్తున్నాం.
సంక్షేమం లక్ష్యంగా
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కేసీఆర్‌ కిట్ల పంపిణీకి నాలుగు విడతల్లో రూ.39.53 కోట్లు ఖర్చు చేశాం. గొల్లకురుమలకు రూ.13.75 కోట్లతో గొర్రెల పంపిణీ చేశాం..పేద అమ్మాయిల పెళ్లికి చేయూత ఇస్తున్నాం.. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాల్లో రూ.25 కోట్లు మంజూరు ఇచ్చాం. ఆసరా పింఛన్లు 2.40 లక్షల మందికి రూ.2016 చొప్పున.., 19,605 మంది దివ్యాంగులకు రూ.3016 చొప్పున అందిస్తున్నాం.
వైద్యంలోనూ
జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌, లిక్విడ్‌ ఆక్సిజన్‌ కేంద్రం, డిజిటల్‌ ఎక్స్‌రే, ఐసీయూ పడకలు అందుబాటులోకి తెచ్చాం. కంటి వెలుగుతో 7.11 లక్షల మందికి పరీక్షలు, 1.54 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చాం.
రుణాల పంపిణీ  
డీఆర్‌డీఏ నుంచి బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశాం..పొదుపు సంఘాలకు రూ.68 కోట్లు, స్త్రీనిధిలో 657 సంఘాలకు రూ.28 కోట్లు, గిరిజన సంక్షేమంలో 17 యూనిట్లకు రూ.88.28లక్షలు, ఎస్సీ కార్పొరేషన్‌ పది యూనిట్లకు రూ.45 లక్షలు మంజూరు చేశాం. మెప్మాలో 226 సంఘాలకు రూ.12 కోట్లు అందించాం.
శాఖల శకటాలు
వ్యవసాయశాఖ, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్‌-మిషన్‌భగీరథ, మహిళా శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య, పశు వైద్య-పశుసంవర్ధక,  నీటిపారుదల, ఉద్యాన-పట్టుపరిశ్రమ, నగర పాలక సంస్థ, 108, ఉచిత సేవ 102 అంబులెన్సు శకటాలు ఆకట్టుకున్నాయి. ఇందులో సందేశాత్మకంగా నిలిచిన వాటికి బహుమతులు ప్రకటించారు. వాటిలో ప్రథమ స్థానంలో నీటిపారుదలశాఖ, రెండో స్థానంలో డీఆర్‌డీఏ, తృతీయ ఉద్యానవన శాఖకు చెందిన శకటాలు నిలిచాయి. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించారు. కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు, సీపీ కార్తికేయ, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, శాసనసభ్యులు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీ ఛైౖర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌, రాజేశ్వర్‌, డీసీసీబీ ఛైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారి, ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ సాంబయ్య, వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
రంగ్‌దే బసంతి.. జయహో జననీ.. నీకు వందనమమ్మా.. అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు. తమ ప్రదర్శనలతో రైతన్న గొప్పదనాన్ని, దేశభక్తిని, జానపద కళారూపాలతో అలరించారు. నవీపేట్‌ ఆదర్శ పాఠశాల చిన్నారులు బండిగట్టవోయ్‌..రామన్న..రైతే రాజు అంటూ సందేశమిచ్చారు. నాగారంలోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు దేశభక్తిని చాటారు. డిచ్‌పల్లి మానవతా సదన్‌ బాలబాలికలు డప్పునృత్యంతో ఆధ్యంతం ఆకట్టుకున్నారు. కంజర సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల బాలికలు త్రివర్ణ పతాక వేషధారణలతో పాటు బృందనృత్యం ఆహుతులను కట్టిపడేసింది. వారిని మంత్రి ప్రశాంత్‌రెడ్డి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో అభినందించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here