ప్రపంచకప్‌ ఫైనల్.. కివీస్‌పై పందెం కాసిన వారి డబ్బు రిఫండ్‌

0
4


ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఆదివారం ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌ టై కావడంతో సూపర్ ఓవర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసారు. ఉత్కంఠ సమరంలో సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది.

ఈ ఫైనల్ మ్యాచ్‌పై భారీ రేంజ్‌లోనే బెట్టింగ్ జ‌రిగింది. సూపర్ ఓవర్ కారణంగా చాలా నమ్మకంగా కివీస్‌పై పందెంకాసిన వారు డబ్బులు కోల్పోయారు. అయితే బౌండ‌రీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఆస్ట్రేలియాకు చెందిన బుక్‌మేక‌ర్ స్పోర్ట్స్‌బెట్‌ సంస్థ త‌న అస‌హ‌నాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కివీస్‌పై పందెం కాసిన వారి డ‌బ్బుల్ని తిరిగి ఇవ్వాలని సదరు సంస్థ నిర్ణయించుకుంది.

వివాదాస్ప‌ద బౌండ‌రీ రూల్ ఆధారంగా ఫ‌లితం నిర్ణయించడాన్ని స్పోర్ట్స్‌బెట్ వ్య‌తిరేకించింది. టెక్నిక‌ల్‌గా న్యూజిలాండ్ ఓడిపోలేదు. కాబట్టి కివీస్ అభిమానుల నుంచి బెట్టింగ్ డ‌బ్బులు తీసుకోవ‌డం స‌రికాదు. కివీస్‌ గెలుస్తుంద‌ని పందెం కాసిన సుమారు 11 వేల 458 మందికి చెందిన 4.26 ల‌క్ష‌ల డాల‌ర్ల మొత్తాన్ని రిఫండ్ చేస్తున్నాం అని స్పోర్ట్స్‌బెట్ ప్ర‌తినిధి రిచ్ హ‌మ్మ‌ర్‌స్ట‌న్ పేర్కొన్నాడు. దీంతో కివీస్ ఓడినా.. ఆ దేశ అభిమానులకు మాత్రం కొంత ఊరట లభించింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. నీకోల్స్ (55), లాతమ్ (47) రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు వోక్స్, ప్లంకెట్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (84నాటౌట్‌; 98బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటం చేశాడు. మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. బట్లర్, స్టోక్స్ చెరో బౌండరీ బాదారు. ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. నీశమ్ ఒక సిక్స్ బాదాడు. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here