ప్రభుత్వం పని అయిపోయింది. ఇక కంపెనీల వంతు!

0
3


ప్రభుత్వం పని అయిపోయింది. ఇక కంపెనీల వంతు!

దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఇప్పుడు ఇండియా ఇంక్ పై పడింది. కొన్నేళ్లుగా, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా భారత కార్పొరేట్ కంపెనీల లాబీ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ ) భారత ప్రభుత్వానికి చేస్తున్న విన్నపం కార్పొరేట్ టాక్స్ తగ్గించాలని. ప్రపంచమంతా దూసుకుపోతున్న తరుణంలో మన దేశంలో కార్పొరేట్ టాక్స్ చాలా అధికంగా ఉందని, గ్లోబల్ కంపెనీలతో పోటీ పడి ముందుకు సాగాలంటే పన్ను రేటును సవరించాలని డిమాండ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పై ఇండియన్ కార్పొరేట్ కంపెనీలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన, సంస్కరణల్లో ఆయన దూకుడు చూసిన ఇండియన్ ఇంక్ …. ఇక ఆయనే స్వయాన భారత ప్రధాని అయితే, తిరుగులేదు అని భావించింది. అనుకొన్నట్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. కానీ కార్పొరేట్ కంపెనీలు కోరుకొన్నది జరగలేదు. పైగా నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో హడలెత్తించారు. దీంతో, తోలి సారి మోడీ ప్రధాని ఐన ఏడాది లోనే కార్పొరేట్ కంపెనీలు ఆయన విధానాలపై పెదవి విరిచాయి.

ఆయనకు నచ్చింది చేస్తారు కానీ మన గోడు వినిపించుకోరు అని బడా పారిశ్రామికవేత్తలు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందుకే, భారత కార్పొరేట్ కంపెనీలకు రెండో సారి నరేంద్ర మోడీ ప్రధాని ఐన తర్వాత కూడా పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తోలి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలతో కొంత పాజిటివ్ గా అనిపించినా… క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలతో ఆశలు ఆవిరి అయ్యాయి. అదే సమయంలో ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చింది. జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడి పోయి వారిని మరింత నిరుత్సాహపరిచింది.

సీఐఐ కోరిక తీరినట్లే…

దేశంలోనే అత్యంత బలమైన కార్పొరేట్ లాబీ బాడీ ఐన సీఐఐ డిమాండ్ ను ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం నెరవేర్చింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కార్పొరేట్ టాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పుడు ఆశ్చర్యపోవటం కార్పొరేట్ కంపెనీల వంతు ఐంది. ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలంటే భారత్ లో కార్పొరేట్ టాక్స్ 20% లోపు ఉండాలని ఎప్పటి నుంచో సీఐఐ ప్రతిపాదిస్తోంది. ఇందుకు బలమైన కారణాలను కూడా చూపిస్తోంది. మనతో దాదాపు అన్ని రంగాల్లోనూ పోటీ పడే పొరుగు దేశం చైనా లో కార్పొరేట్ టాక్స్ 25% మాత్రమే. ఇంకా చిన్న తరహా కంపెనీలకు స్లాబుల వారీగా 10% నుంచి 20% లోపే పన్ను వసూలు చేస్తుంది. కానీ భారత్ లో సగటు కార్పొరేట్ పన్ను 34% గా ఉండటంతో చైనాతో పోటీ పడటం మన కంపెనీలకు సాధ్యం కావటం లేదని తన ప్రతిపాదనల్లో పేర్కొంది. అదే సమయంలో అమెరికా లో పన్ను రేటు 21% ఉండగా… సింగపూర్ లో అత్యంత ఆకర్షణీయంగా 17% మాత్రమే. అందుకే, సీఐఐ సగటున 18% కార్పొరేట్ పన్ను ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది.

మరింత తక్కువ పన్ను...

మరింత తక్కువ పన్ను…

సీఐఐ ప్రతిపాదించిన కార్పొరేట్ టాక్స్ 18% కంటే కూడా తక్కువగా ప్రభుత్వం కొత్త కంపెనీలకు కేవలం 15% పన్ను రేటును నిర్ణయించింది. ఇది ప్రస్తుతం కేవలం తయారీ రంగంలోని కంపెనీలకు, అది కూడా అక్టోబర్ 1 తర్వాత నెలకొల్పే కంపెనీలకే వర్తించనుంది. అయినా… ముందు ముందు చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఈ పన్ను రేటును ఖాయం చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే, మొత్తం కంపెనీల్లో 80% నికి పైగా ఉన్న చిన్న, మధ్య తరహా కంపెనీలకు 15% (సెస్సులతో కలిపి 17.01%) మాత్రమే కార్పోరేట్ పన్ను ఉంటుంది. అంటే ఆయా కంపెనీలకు దాదాపు 50% పన్ను మిగులు లభిస్తుంది. అప్పుడు సింగపూర్ కంపెనీలతో సమానంగా పోటీ పడే అవకాశం భారత కంపెనీలకు లభిస్తుంది.

జీఎస్టీ తగ్గింపు...

జీఎస్టీ తగ్గింపు…

పూర్తిస్థాయి సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం అనేక రంగాల్లో విధిస్తున్న జీఎస్టీ ని సవరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పిటికే చాలా రంగాల్లో జీఎస్టీ ని 28% నుంచి 18% నికి, 18% నుంచి 12% నికి తగ్గించింది. 12% నుంచి 5% నికి, 5% నుంచి సున్నా శాతానికి కూడా కుదించింది. తాజాగా చింత పండు వంటి కొన్ని రకాల ఉత్పత్తుల ను పూర్తిగా పన్ను జాబితా నుంచి తొలగించింది. ఇలాగె, ఇతర రంగాల్లోనూ అధికంగా ఉన్న పన్ను రేటును తగ్గిస్తే… అప్పుడు దేశీయ కంపెనీలకు డబల్ బొనాంజా లభించినట్లే అవుతుంది.

మీ వంతు వచ్చింది..

మీ వంతు వచ్చింది..

మీరు అడిగినట్లుగా ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్ ను తగ్గించింది. ఇక ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు పోవాల్సింది మీరేనని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. కంపెనీలకు మేలు చేసే మరిన్నిసంస్కరణలు తెచ్చేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కంపెనీలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని కోరారు. అదే సమయంలో ఉద్యోగుల వేతనాలు పెంచాలని, బోనస్ వంటి ప్రోత్సహాకాలు ప్రకటించాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చేయాల్సింది చేసింది. ఇక కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తాయో చూడాలని వారు అంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here