ప్రాణం ఖరీదు.. రూ.5 లక్షలు

0
5


ప్రాణం ఖరీదు.. రూ.5 లక్షలు

 యమ పాశాలుగా విద్యుత్తు తీగలు

● ఏటా 50 మందికి పైగానే మృతులు

● మూడేళ్లలో రూ. 5 కోట్ల పరిహారం చెల్లింపు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి


దుబ్బా శ్మశానవాటిక ప్రాంతంలో రోడ్డు పక్కన పడిపోయిన విద్యుత్తు స్తంభం

విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు మొదలుకొని లైన్‌మెన్‌ వరకు అడుగడుగునా నిర్లక్ష్యం ఆవహించింది. అధికారులు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండడంతో ఏ లైను ఎటు పోతుందో తెలియని దుస్థితిలో ఉన్నారు. సీఎండీ స్థాయి అధికారులు స్థానికంగా ఉండాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు.

పర్యవేక్షణ కొరవడి…

ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా వేలాడుతున్న విద్యుత్తు తీగలు, ఒరిగిన స్తంభాలు, ఎత్తు తక్కువలో ఉన్నవి, కంచెలేని నియంత్రికలు, పంట పొలాల్లో పడిపోయిన విద్యుత్తు స్తంభాలు ఇలా ఒక్కటేమిటి ప్రతీది నిర్లక్ష్యమే. ఆదాయం వచ్చే పనులు క్షణాల్లో చేస్తారు. మిగతావి ఏళ్ల తరబడి పట్టించుకోవట్లేదు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఇలాంటి పనులు చేయించాల్సి ఉంది. విచిత్రమేమిటంటే కొందరు ఏఈలకు ఏ నియంత్రిక ఎక్కడ ఉందో తెలియదు.

ఆదాయానికి గండి

అసలే అక్రమ కనెక్షన్లతో విద్యుత్తు శాఖకు ఏటా రూ. లక్షల్లో నష్టం వస్తోంది. దీనికితోడు ఏటా 50 మందికి తగ్గకుండా విద్యుదాఘాతంతో మృతి చెందుతుండడంతో సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. ఒక్క వ్యక్తి మృతి చెందితే రూ. 5 లక్షలు, పశువు మృతి చెందితే రూ. 40 వేలు చెల్లిస్తున్నారు. ఇలా ఉభయ జిల్లాల్లో మూడేళ్లలో రూ. 5 కోట్లకు పైగా పరిహారం చెల్లించారు.

ప్రైవేటు వ్యక్తులే లైన్‌మెన్లు…

విద్యుత్తు శాఖలో అడిగేవారు లేరు. చూసేవారు అంతకంటే లేరు. ఇంకేముంది కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయిస్తున్నారు. ఇలా అనేక ఘటనల్లో విద్యుదాఘాతంతో ప్రైవేటు వ్యక్తులు మృతి చెందారు. వారి కుటుంబానికి విద్యుత్తు శాఖ రూ. 5 లక్షలు పరిహారం చెల్లిస్తోంది. కానీ, ప్రమాదాలు జరగకుండా నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

గాలిలో కలుస్తున్న ప్రాణాలు

విద్యుత్తు అధికారులు మనిషి ప్రాణాలు లెక్కచేయని పరిస్థితి ఉంది. కళ్లముందే ఆశాఖ సిబ్బంది, బయట వ్యక్తులు, పశువులు పిట్టాల్లా రాలుతుంటే వీరి పద్ధతిలో మార్పు రావడం లేదు. వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులు ఇళ్లల్లో కూర్చొని ప్రైవేటు వ్యక్తులకు పనిచెప్పడం వ్యవస్థ అధ్వానంగా మారిందనడానికి నిదర్శనం. ఉభయ జిల్లాల్లో 2018లో 59 మంది, 2019లో 57, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 33 మంది మృతి చెందారు. ఏటా 25 నుంచి 30 మంది గాయాల పాలవుతున్నారు.

కారణాలు ఇవే..

*● విద్యుత్తు స్తంభం ఎక్కే ముందు లైన్‌ క్లీయర్‌(ఎల్‌సీ) తీసుకోవాలి. దీనికి ఒక ప్రత్యేక పత్రం ఉంటుంది. ఎల్‌సీ తీసుకొనే వ్యక్తి ఎల్‌సీ ఇచ్చే వ్యక్తి ఇద్దరూ సంతకాలు చేయాలి. కానీ, ప్రస్తుతం ఫోన్లోనే ఎల్‌సీ తీసుకుంటున్నారు.

*● విద్యుత్తు తీగలు మరమ్మతు చేసే సమయంలో, నియంత్రికల వద్ద ఫీజులు మార్చేటపుడు తప్పనిసరిగా చేతికి ప్లాస్టిక్‌ గ్లౌజ్‌ వేసుకోవాలి. కానీ, ఎక్కడా పాటించడం లేదు.

*● ప్రతి ఉద్యోగి ఓల్టేజ్‌ టెస్టర్‌ వెంట ఉంచుకోవాలి. ఇది పెన్నులా ఉండి విద్యుత్తు స్తంభం వద్దకు వెళ్లగానే కరెంటు సరఫరా ఉంటే చిన్న సైరన్‌ ఇస్తుంది. దీనిని ఎవరూ వాడడం లేదు.

* ఎర్త్‌రాడ్స్‌ ఉపయోగించడం వల్ల పొరపాటున ఇతర తీగల నుంచి విద్యుత్తు ఇటువైపు సరఫరా కాకుండా ఇది కాపాడుతుంది. దీనిని ఉపయోగించడం లేదు.

*● విద్యుత్తు పనులు చేసే సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్‌, చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు రబ్బర్‌ షూలు వేసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.

*ఈ నెల 16న డిచ్‌పల్లిలో ఒక లైన్‌కు సరఫరా తీసి పైనుంచి వెళ్తున్న మరో లైన్‌కు అలాగే వదిలేశారు. అంతకు నాలుగు రోజుల ముందు ఉద్యోగంలో చేరిన జేఎల్‌ఎం కౌరాజ్‌ అధికారి ఆదేశాల మేరకు పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

రక్షణ చర్యలు తీసుకోవాలని ఎప్పుడూ చెబుతున్నా సిబ్బంది వినిపించుకోవడం లేదు. పరిస్థితి చేయిదాటుతోందనే ఈ నెల 23న ముగ్గురు లైన్‌ఇన్‌స్పెక్టర్లు, ఒక లైన్‌మెన్‌ను సస్పెండ్‌ చేశాం. రెండు నెలల్లో ఏడుగురు విద్యుత్తు ప్రమాదాల్లో మృతి చెందారు. ఎవరు విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డీఈలను ఆదేశించాం. విచారణ చేసి సిబ్బంది తప్పిదం ఉందంటే వెంటనే విధుల నుంచి తప్పిస్తాం

నలుగురిని సస్పెండ్‌ చేశాం

– సుదర్శన్‌, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ

ఈ నెల 20న మోర్తాడ్‌ మండలం పాలెం గ్రామంలో విద్యుత్తు తీగ తెగిపడడంతో సరి చేసేందుకు లైన్‌ఇన్‌స్పెక్టర్‌ లైన్‌ క్లీయర్‌(ఎల్‌సీ) తీసుకున్నాడు. ఒక లైన్‌కు బదులు మరో దానికి సరఫరా నిలిపివేశారు. లైన్‌మెన్‌ రవీందర్‌ మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

ఆగస్టు 31న మైలారంలో పొలానికి రక్షణ కంచె ఏర్పాటు చేసి విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చారు. ఆ విషయం మరచిన రైతు భూమన్న తీగకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఇలా ఈ రెండు నెలల్లో ఏడుగురు మృతి చెందారు.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here