బాపూ బాట.. మనకదే బాసట

0
2


బాపూ బాట.. మనకదే బాసట

ఆయన సూత్రాలు.. నిత్య నూతనం
తరాలు మారినా.. అనుసరణీయం
ఉభయ రాష్ట్రాల్లో మహాత్ముడి అడుగుజాడలు

సత్యమేవ జయతే
అహింసా పరమో ధర్మః
150వ జయంతి

 

జాతిపిత కాలంతో ప్రయాణించే మహనీయుడు. తరాలు మారినా ఇప్పటికీ ఆయన నడిచిన మార్గాన్ని ప్రపంచం అనుసరిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై మహాత్ముడిని స్మరించకుండా కార్యక్రమాలను ప్రారంభించరు. మనిషిలో నిద్రాణమైన శక్తులను వెలికితీసి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దార్శనికుడు.  ఆయన వ్యక్తి కాదు ఓ ఆలోచన. సత్యం, అహింసల మార్గజ్యోతిగా సమాజానికి వెలుగులు పంచిన మానవతావాది. ప్రతిమనిషిలోని భావోద్వేగాలను అంచనావేసి దిశానిర్దేశం చేయడం అంత తేలిక కాదు. అటువంటిది భారతీయులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఆంగ్లేయులపై స్వాతంత్య్ర సంగ్రామం సాగించారు. ఇప్పటి భాషలో చెప్పాలంటే.. వ్యక్తిగా ఎలా మెలగాలి. వ్యవస్థలో ఎలా భాగస్వామ్యం కావాలి. గెలుపోటములను తట్టుకుని ఎంచుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా చేరాలో చెప్పే అసలు సిసలైన వ్యక్తిత్వ వికాస నిపుణుడు గాంధీజీ. ఉభయ రాష్ట్ర్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన అడుగుజాడలు ఉన్నాయి. ఆనాడు పర్యటనల సందర్భంగా ఆయన పాదం మోపిన ప్రాంతాలకు చెందినవారు.. చిన్నతనంలో మహాత్ముని ప్రత్యక్షంగా చూసిన వారు నేటికీ ఆ జ్ఞాపకాలతో పులకిస్తుంటారు. ఆయన మన మధ్యనుంచి దూరమై ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఆయనను ఆరాధిస్తున్న వారు.. స్ఫూర్తి పొందుతున్న వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది ఉన్నారు. గుడి కట్టి ఆర్చించేవారు కొందరైతే.. బాపు భావజాలాన్ని ఒంటపట్టించుకున్న వారు.. ఆయన సూత్రాలను పాటిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు మరికొందరు.. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా వారి గురించి ప్రత్యేక కథనం…

– ఈనాడు, హైదరాబాద్‌
 
 
 

ఆంధ్రా గాంధీ.. ఆశల సౌధం 
– జీవితపర్యంతం అంకితమైన మూర్తిరాజు
నిడమర్రు న్యూస్‌టుడే: సర్వోదయ నాయకుడు, గాంధేయవాది, మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు పశ్చిమగోదావరి జిల్లా పెదనిండ్రకొలనులో పార్లమెంట్‌ నమూనాలో గాంధీ భవనాన్ని నిర్మించారు. 1969లో అప్పటి ఉప ప్రధాని మొరార్జీదేశాయ్‌ శంకుస్థాపన చేశారు. భవనం మధ్యలో ధ్యానముద్రలో ఉన్న గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. సత్యం, అహింస, స్వదేశీ విధానాలపై మూర్తిరాజు ఎల్లప్పుడు కృషి చేసేవారు. ఆంధ్రా గాంధీగా ఆయనను అభివర్ణించే వారు. మూర్తిరాజు జీవించి ఉన్నంత కాలం గాంధీ భవనంలో పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటికి విదేశీయులు వచ్చేవారు. ప్రస్తుతం సర్వోదయ మండలి భవనం ఆలనాపాలనా చూస్తోంది. 

స్ఫూర్తికి  ప్రతీక.. గాంధీ గ్రామం

చోడవరం, న్యూస్‌టుడే: అప్పట్లో స్వాతంత్య్ర పోరాట ఉద్యమం జోరుగా సాగుతోంది.  విశాఖ జిల్లా చోడవరం మండలంలో నర్సయ్యపేట పంచాయతీలో నివసించే ఓ జాతికి చెందిన 65 కుటుంబాలు 15 ఎకరాల భూమిలో ఒక్కొక్కరు సెంటున్నర నుంచి పదిసెంట్ల లోపు స్థలాలను కొనుగోలు చేసుకున్నారు. ఈ ప్రక్రియ అంతా 1946లో ప్రారంభమైంది. గ్రామ స్వరూపం ఏర్పటయ్యే నాటికి స్వాత్రంత్యం సిద్ధించింది. గాంధీని ఆదర్శంగా తీసుకుని తమ నివాసిత ప్రాంతానికి గాంధీగ్రామం అని పేరు పెట్టారు. 1947లో పుట్టిన బిడ్డలందరికీ గాంధీ అని పేరు పెట్టారు. తరవాత నర్సయ్యపేట పంచాయతీ నుంచి అంకుపాలెం పంచాయతీలోకి మారింది. 1998-99లో కొత్త పంచాయతీల ఏర్పాటులో భాగంగా గాంధీగ్రామంను అంకుపాలెం నుంచి విడదీసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేశారు. 

గీతాల రూపంలో బోధనలు

విజయవాడ సాంస్కృతికం : వయోలిన్‌ వాసుదేవన్‌గా సంగీత రంగంలో ప్రసిద్ధి పొందిన వాసుదేవన్‌ స్వస్థలం విజయవాడ. దేశ, విదేశాల్లో వేలాది కచేరీలు చేశారు. పెడదోవపడుతున్న యువతను సన్మార్గంలోకి తేవటానికి మహాత్ముడి బోధనలు ఉపయోగిస్తాయని గట్టిగా నమ్మేవారు. శాంతి, సహనం, అహింస, సత్యం తదితర ఉన్నత భావాలు నిరంతరం ఆయనలో కొత్త ఆలోచనలు కలిగించేవి. ఈ అంతర్మథనం ఫలితంగా ఏర్పడిందే ‘సబర్మతి సంగీత్‌’. మహాత్ముడి బోధనల్ని సంగీత రూపంలో ప్రతి ఒక్కరికీ చేరువ చేసే కార్యక్రమమే ఇది. మహాత్ముడి  ఆశయాల ఆధారంగా తయారుచేసిన మరెన్నో గీతాలు ఇందులో ఉన్నాయి. వీటిని తెలుగు రాష్ట్రాల్లోని ఖైదీలు, బాలనేరస్థులకు వినిపించి వారిలో మార్పు తేవడానికి కృషి చేస్తున్నారు. ఐ.ఐ.టి, విశ్వవిద్యాలయాల్లోని యువతకు తరగతులు నిర్వహించారు. అనాథ శరణాలయాలు, బాలనేరస్తుల కారాగారాల్లో వందకు పైగా కార్యశాలలు నిర్వహించారు.జవహర్‌ బాలభవన్‌లలో వాసుదేవన్‌ రూపొందించిన కార్యక్రమాన్ని అక్కడి విద్యాప్రణాళికలో భాగం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

భాగ్యనగరాన మహాత్ముడి విడిది.. ‘గోల్డెన్‌ త్రెషోల్డ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరంతో మహాత్ముడికి ప్రత్యేక అనుబంధం ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నగరానికి వచ్చిన రెండు పర్యాయాల్లో ఆయన ఆబిడ్స్‌లోని గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో విడిది చేశారు. ఇది ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడు, గోవిందరాజు దంపతుల నివాసం. గాంధీజీ ఎప్పుడు నగరానికి వచ్చినా గోల్డెన్‌ త్రెషోల్డ్‌లోనే బస చేసేందుకు ఇష్టపడేవారు. 1929 ఏప్రిల్‌ 6న, 1934 మార్చి 9న రెండు సార్లు గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో ఉన్నారు. రెండో సారి వచ్చినప్పుడు కోఠిలోని వివేకవర్ధిని పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. గాంధీజీ సూచనమేరకు సరోజినీనాయుడు తన నివాసం వెనుక భాగంలో హోమియో క్లినిక్‌ నడపాలని నిర్ణయించారు. అందుకే ఆయన చేతుల మీదుగా ‘గోపాల్‌ క్లినిక్‌’ భవనానికి శంకుస్థాపన చేయించారు. అదే సమయంలో గోల్డెన్‌ త్రెషోల్డ్‌ ప్రాంగణంలో బాపూజీ ఓ మామిడిచెట్టు నాటారు. ఎరవాడ జైలులో నిరాహార దీక్షలో ఉన్నప్పుడు మామిడిచెట్టు కింద ఎక్కువగా గాంధీజీ గడిపేవారు. ఆ చెట్టుకు చెందిన విత్తు నుంచి మొలిచిన మొక్కను తనతోపాటు తీసుకువచ్చి గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో నాటారు. అనంతరం తెగులు సోకి చనిపోయింది. ఆ తర్వాత మహాత్ముడు నాటిన మొక్కకు గుర్తుగా మళ్లీ ఎరవాడ జైలు నుంచి  మొక్కను మరోసారి తీసుకువచ్చి సరోజినీనాయుడు కుటుంబసభ్యులు నాటారు.

ఖరీఫ్‌కు ముందు నైవేద్యాలు

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని కేదారిపురం గ్రామస్థులు గాంధీజీని దైవంగా భావించి పూజలు చేస్తారు. ఏటా ఖరీఫ్‌ పనులు ప్రారంభానికి ముందు ఆగస్టులో ఒకరోజు అందరూ ఉపవాసాలు ఉంటారు. ఆయన చిత్రపటాన్ని గ్రామం మధ్యలో ఉంచి పూజలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం సంప్రదాయం. 

సన్మార్గానికి గాంధీ దీక్షలు

విజయవాడ, సాంస్కృతికం: ‘ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ఈ భూమ్మీద నడిచారంటే కొంతకాలం తర్వాత ఎవరూ నమ్మలేరంటూ’ మహాత్ముడి గురించి ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలు విజయవాడకు చెందిన రాంపిళ్ల జయప్రకాష్‌ను కదిలించాయి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడికి ఆలయం నిర్మించాలని నిశ్చయించుకున్నారు. విజయవాడ పాతబస్తీలోని సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో దీనిని నిర్మించారు. విజయవాడకు చెందిన వితరణశీలి గోళ్ల నారాయణరావు, మరికొందరి సహకారంతో ఆలయంలో ధ్యానభంగిమలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత ఏడాది గాంధీజయంతి రోజున అప్పటి శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ఉప్పులూరి మల్లికార్జునశర్మ  దీనిని ప్రారంభించారు. 

ఆయన నడిచిన మార్గంలో..
కాకినాడలో రెండుసార్లు పర్యటించిన గాంధీజీ

కాకినాడ (గాంధీనగర్‌): మహాత్ముడు ఇచ్చిన పిలుపునకు స్పందించి బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు తూర్పుగోదావరి జిల్లావాసులంతా సిద్ధమయ్యారు. సహాయ నిరాకరణోద్యమంలో అనేక మంది మహిళలు లాఠీ దెబ్బలు తిన్నారు. బాపూజీ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా 1921లో కాకినాడ వచ్చారు. నేటి టౌన్‌ రైల్వేస్టేషన్‌లో రైలు దిగి, ప్రస్తుత గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మహాత్ముడి హిందీ ప్రసంగాన్ని పన్నెండేళ్ల వయసున్న దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ తెలుగులోకి అనువాదం చేశారు. రెండో దఫా 1929 మేలో గాంధీజీ కాకినాడ వచ్చి దేవాలయం వీధిలోని పైడా వెంకట నారాయణ నివాసంలో బస చేశారు. గాంధీజీ ప్రసంగాన్ని వినేందుకు వందలాది ఎడ్లబండ్లపై జనం కాకినాడకు వరుస కట్టారు.  జగన్నాథపురంలోని చర్చి   స్వ్కేర్‌ సెంటర్‌ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.. గాంధీజీని కలవాలని ఆశించిన దేవదాసీలు, ముస్లిం మహిళల కోసం దుర్గాబాయిదేశ్‌ముఖ్‌ ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేయించారు.

చిత్తూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం..
– పలుమార్లు పర్యటించిన బాపు

ఈనాడు, తిరుపతి, న్యూస్‌టుడే బృందం: మహాత్ముడు పలుమార్లు చిత్తూరు జిల్లాకు వచ్చారు. చెన్నైకు వెళుతూ మార్గమధ్యంలో చిత్తూరు ఆర్టీసీ ప్రాంగణం సమీపంలోని థియోసోఫికల్‌ సొసైటీ భవనంలో విడిది చేశారు. మరో పర్యాయం హరిజనోద్ధరణలో భాగంగా విరాళాల సేకరణకు ఇక్కడకు వచ్చి ప్రస్తుత పాత బస్టాండ్‌ ప్రాంతంలో ప్రజలతో మాట్లాడారు. సొసైటీలో పనిచేసిన సయ్యద్‌ ఇషాక్‌ ఆయన్ను చూసినట్లు గుర్తుచేసుకున్నారు. 1930 దశాబ్దంలో చెన్నైకి వెళ్తుండగా మధ్యలో పలమనేరులో ఆగారు. పట్టణంలో ప్రస్తుతం ఉమెన్స్‌ ఇండస్ట్రియల్‌ స్కూలు ఉన్న ఆవరణలో మర్రి చెట్టు కింద సేదతీరారు. దాని దగ్గర ఏర్పాటు చేసిన ఉద్యానమే నేటి బాపూజీ పార్కు. 1931లో రేణిగుంట బస్టాండ్‌ సమీపంలో ఓ చోట కూర్చొని ప్రజలను పలకరించారు. అందుకు గుర్తుగా  1949లో గ్రామస్థులు ఆయన కూచున్న చోటే విగ్రహాన్ని, మండపాన్ని నిర్మించారు. 

ముమ్మార్లు బాపూజీని చూడగలిగా..
– యడ్లపాటి వెంకట్రావ్‌, రాజ్యసభ మాజీ సభ్యులు
తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: గాంధీజీ ఆలోచనలు నేటికీ ఆచరణీయమని ఇటీవల నూరో పుట్టిన రోజు జరుపుకొన్న రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావ్‌ పేర్కొన్నారు. బాపూజీని దగ్గరి నుంచి చూసిన తన అనుభవాలను  ఇలా జ్ఞాపకం చేసుకున్నారు.‘‘స్వాతంత్య్ర ఉద్యమం  సాగుతున్న వేళ గాంధీజీ గురించి విన్నాం. నేను నాలుగో తరగతి చదువుతున్నపుడు ఆయన పిలుపు మేరకు పాఠశాలకని కుట్టించుకున్న దుస్తులను మంటల్లో పడేశాను. 1932లో బాపూజీ  మోపర్రు వచ్చారు.నాకు అప్పడు 13ఏళ్లు.  ఆయన జోలె పడితే మా బంధువులు, స్థానిక మహిళలు తమ బంగారమంతా అందులో వేశారు. 1933లో కావూరు వినయాశ్రమానికి వచ్చారు. అప్పుడు ఆయన వెంట ఎన్జీ రంగా ఉన్నారు.  1946లో నేను తెనాలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన రోజుల్లో మహాత్ముడు మద్రాస్‌కు రైలులో వెళుతున్నారని తెలుసుకుని వలివేరు వద్ద రైలు ఆపి మేమంతా ఆయనను కలిసి తోడుగా ఉంటామని మాట ఇచ్చాం. మా వెంట వచ్చిన తాపీ మేస్త్రీ గాంధీ కాళ్లకు మొక్కి ఆయన చెప్పులు తీసుకున్నారు. వాటిని తెచ్చి చూపిస్తే జనం కళ్లకు అద్దుకున్నారు. 
గాంధేయవాదంపై పుస్తకాలు
– ఆచార్య కె.రామకృష్ణారావు, ఛాన్సలర్‌, గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
విశాఖపట్నం:  గాంధీజీ చనిపోయే సమయానికి నేను కృష్ణా జిల్లా పునాదిపాడులో ఏడో తరగతి చదువుతున్నాను. గాంధీజీని హత్యచేశారని గ్రామస్తులందరూ విలపించారు. ఆంధ్ర వర్సిటీ ఆచార్యునిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు, ఉన్నతవిద్యకు అమెరికా వెళ్లిన తరువాత కూడా గాంధీజీ సిద్ధాంతాలపై అధ్యయనం చేశాను. ‘గాంధీస్‌ ధర్మ’ పేరిట పుస్తకాన్ని రాశాను. ‘ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌’  దాన్ని ప్రచురించి ప్రపంచంలోని పలుదేశాల్లో విక్రయాలు చేసింది. ‘గాంధీ అండ్‌ అప్లైడ్‌ స్పిరిట్యువాలిటీ’ అనే మరో పుస్తకాన్ని రచించాను. 
భగవత్‌ స్వరూపం కనిపించింది… 
– కఠారు పార్థసారథి, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి, కృష్ణా జిల్లా గంపలగూడెం
గంపలగూడెం: జాతిపితను చూసినపుడు ఆయనలో నాకు భగవత్‌ స్వరూపం కనిపించింది. ఇపుడు నా వయసు 86 ఏళ్లు. నాకు సుమారు 15 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన్ను చూశాను. 1947లో రైల్లో విజయవాడ వెళుతూ ఖమ్మం జిల్లా మధిర రైల్వేస్టేషన్‌లో కొన్ని నిమిషాలు ఆగి, అక్కడి ఫ్లాట్‌ఫారం నుంచి  మాట్లాడారు. గాంధీజీ వస్తున్నారని తెలిసి మా బావ దివంగత సువారపు కృష్ణమూర్తితో కలిసి గంపలగూడెం నుంచి మధిరకు 25కి.మీ నడిచివెళ్లాను. ఆరోజు సాయంత్రం ..మధిరలో ఆయన రైలుదిగగానే దగ్గరనుంచి  చూశాను.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here