బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఇంట విషాదం

0
11

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి, ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగణ్ ముంబైలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న వీరు దేవగణ్.. సోమవారం ఉదయం ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన శాంతాక్రూజ్‌లోని సూర్య హాస్పిటల్‌లో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలో గుండె పోటు కూడా రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు.
వీరు దేవగణ్ సుమారు 80 హిందీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 1999లో వచ్చిన ‘హిందుస్థాన్ కి కసమ్’ సినిమాకు వీరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన కుమారుడు అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించారు. యాక్షన్ డైరెక్టర్‌గా వీరు కెరీర్‌లో చెప్పుకోదగిన మంచి చిత్రాలు ‘దిల్‌వాలే’ (1994), ‘హిమ్మత్‌వాలా’ (1983), ‘షాహెన్షా’ (1988). వీటితో పాటు మరికొన్ని చిత్రాలు వీరుకు యాక్షన్ డైరెక్టర్‌గా మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇదిలా ఉంటే, వీరు దేవగణ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. విలే పార్లే వెస్ట్ శ్మశానవాటికలో వీరు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
కాగా, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో తన కొత్త సినిమా ‘దే దే ప్యార్ దే’ ప్రచార కార్యక్రమాలకు గత 15 రోజులుగా అజయ్ దేవగణ్ దూరంగా ఉన్నారు. తన తండ్రితోనే ఎక్కువ సమయాన్ని గడిపారు. మరోవైపు, వీరు దేవగణ్‌ను ఆఖరిసారిగా ‘టోటల్ ఢమాల్’ స్పెషల్ షో ప్రదర్శనప్పుడు కనిపించారు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమాను శాంతాక్రూజ్‌లోని ఓ థియేటర్‌లో వీరు దేవగణ్ చూశారు.
Original Article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here