బియ్యం గుట్టు ఇంటి దొంగలకు ఎరుక

0
4


బియ్యం గుట్టు ఇంటి దొంగలకు ఎరుక

బోధన్‌, న్యూస్‌టుడే: పౌర సరఫరాల శాఖకు చెందిన లారీ బియ్యం మాయమైన ఘటన పోలీసులను విస్తుగొల్పుతోంది. ఇంటి దొంగల పనిగా భావించి లోతుగా విచారణ చేస్తున్నారు. బీర్కూరు మండలంలోని సిద్ధివినాయక మిల్లు నుంచి 270 క్వింటాళ్ల బియ్యం లోడుతో వచ్చిన లారీని అర్ధరాత్రి అపహరించడం, అందులోని బస్తాలను మాయం చేయడం కట్టుకథను తలపిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లకు వెళ్లే ధాన్యం బియ్యంగా మార్చి పౌరసరఫరాల శాఖకు అందించాలి. అక్కడి నుంచి చౌకదుకాణాలకు సరఫరా అవుతాయి. దీనిని కస్టమ్‌ మిల్లింగ్‌గా పేర్కొంటారు. ధాన్యం మర పట్టినందుకు సర్కారు మిల్లర్‌కు నిర్ణీత ఛార్జీలు చెల్లిస్తుంది. క్వింటా ధాన్యానికి 68 కిలోల చొప్పున బియ్యం విధిగా అందించాలి. ఈ రకంగా వచ్చిన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నిల్వ కోసం ఎఫ్‌సీఐ గిడ్డంగులను ఉపయోగిస్తుంది. బీర్కూరు నుంచి వచ్చినట్టు చెబుతున్న బియ్యం లారీ ఉదంతం నమ్మశక్యంగా లేదు. బస్తాలు ఖాళీ చేయించడానికి లారీని వరుసలో పెట్టడం.. వర్షం కారణంగా డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోవడం, మరుసటి రోజు ఉదయం (ఆదివారం) వచ్చే సరికి లారీ కనబడకపోవడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. 270 బియ్యం బస్తాలు దింపడానికి కనీసం 10 మంది కూలీలు 3 గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. లారీ యజమాని చెబుతున్న దాని ప్రకారం వారు వాహనం నిలిపిన చోట నుంచి అపహరించాక కిలోమీటర్‌ దూరంలో ఖాళీ అయింది. రోడ్డుపై ఒక వాగు వద్ద బస్తాలు ఖాళీ చేశారని చెబుతున్న తీరును పోలీసులు విశ్వసించడం లేదు. నాటకీయంగా కథ నడిపారని భావిస్తున్నారు. బీర్కూరు మండలం కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నందున అక్కడి నుంచి బయలుదేరిన లారీ వివరాలను ఆరా తీస్తున్నారు. మూడు రోజుల్లో నిజాలను వెల్లడిస్తామని సీఐ నాగార్జున్‌గౌడ్‌ సోమవారం రాత్రి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here