బిల్లు..లొల్లి

0
2


బిల్లు..లొల్లి

గందరగోళంగా విద్యుత్తు బిల్లు

ఉమ్మడి జిల్లాల్లో ఇదీ పరిస్థితి

కారణమేదైనా భారం వినియోగదారుడికే

న్యూస్‌టుడే, కామారెడ్డి సంక్షేమం

‘ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యుత్తు బిల్లులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవోస్‌ కాలనీలో ఓ ఇంటికి వచ్చినవి. రెండు రోజులు ఆలస్యంగా ఇవ్వడంతో 2 యూనిట్లు పెరిగి (102 యూనిట్లకు) వినియోగదారుడికి రూ. 169 అదనపు భారం పడింది. మరో వినియోగదారుడికి 4 యూనిట్లు అధికంగా పెరగడంతో రూ.409 బిల్లు రావడం విశేషం. దీనిపై బాధితులు 48 రోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదు.’


* కామారెడ్డి పట్టణంలో విద్యుత్తు బిల్లులు ఆలస్యంగా ఇస్తుండటంతో వినియోగదారుల శ్లాబ్‌ మారిపోతుంది. ఈ విషయంపై వినియోగదారులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

* బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో అధికంగా వస్తున్నట్లు వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

* నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లోనూ ఇలాంటి సమస్యే నెలకొంది

గృహావసరాల విద్యుత్తు బిల్లులు వినియోగదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆలస్యంగా బిల్లింగ్‌ చేస్తుండడంతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. వాస్తవానికి నెల రోజులకో మారు రీడింగ్‌ నమోదు చేసి రశీదును వినియోగదారునికి అందజేయాలి. ఇందుకోసం విద్యుత్తు శాఖ పొరుగు సేవల ఉద్యోగులపైనే ఆధారపడుతోంది.

స్పాట్‌ బిల్లింగ్‌ కోసం ఉభయ జిల్లాల్లో 75శాతం మందిని పొరుగుసేవల పైనే నియామకం చేసుకున్నారు. మరో 25శాతం మంది విద్యుత్తుశాఖ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 6.30 లక్షల గృహావసరాల కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రతినెలా ఎక్కువ బిల్లులు వస్తున్నాయని వాపోయే వారి సంఖ్య రెండు జిల్లాల్లోనూ రోజురోజుకు పెరుగుతోంది. ఆలస్యంగా లేదా ముందస్తుగా నమోదు చేస్తుండడంతో సామాన్య కుటుంబాలకు పెనుభారమవుతోంది.

ఆన్‌లైన్‌లో పంపిన ఫిర్యాదు

30 రోజులకోమారు ఇవ్వాలి

గృహావసరాల విద్యుత్తు బిల్లులను 30 రోజులకో మారు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగుల్లో కొందరు ఆలస్యంగా రావడంతో వినియోగదారులు నష్టపోతున్నారు. రెండు రోజులు అటుఇటుగా వస్తే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కొందరు వారం నుంచి పది రోజులు ఆలస్యంగా వచ్చి నమోదు చేస్తున్నారు.వినియోగదారుల శ్లాబ్‌ పరిధి దాటిపోతోంది. ఉదాహరణకు ఒక కుటుంబానికి నెలకు 90 నుంచి 95 యూనిట్ల విద్యుత్తు ఖర్చయితే రూ.250 వరకు బిల్లు వచ్చే అవకాశముంది. వారం రోజులు ఆలస్యంగా నమోదు చేయడం వల్ల అదనంగా మరో 15 – 20 యూనిట్లు ఎక్కువ ఖర్చయి రూ.490 అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. అంటే వినియోదారుడు సుమారు రూ.240 సంస్థకు అధికంగా చెల్లించాలి. ఇలా చాలా గ్రామాల్లో కొనసాగుతోంది. దీనిపై వినియోగదారులు సదరు ఉద్యోగిని ప్రశ్నించినప్పుడు తక్కువగా బిల్లు నమోదు చేసి ఇస్తున్నారు. ఇక కొందరు ఉద్యోగులు 26 రోజులకే వచ్చి రీడింగ్‌ తీస్తున్నారు. కాని సరాసరిగా నెలకు ఎన్ని యూనిట్లు ఖర్చు చేస్తున్నారో అన్ని యూనిట్లను ముందుగానే నమోదు చేసి వెళ్తున్నారు. ఇవేం అర్థం కాకపోవడంతో సామన్యులు వచ్చినంత బిల్లు చెల్లిస్తున్నారు.

తేడా ఉండదు – శేషారావు, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో, కామారెడ్డి

వినియోగదారులకు బిల్లింగ్‌ విషయంలో తేడా రాదు. స్పాట్‌ బిల్లింగ్‌ యంత్రంలో 30 రోజులకే బిల్లింగ్‌ వచ్చేలా సర్దుబాటు ఉంటుంది. బిల్లులో 30 రోజుల కంటే అధికంగా చూపించినప్పటికి వినియోగదారునికి 30 రోజులకే బిల్లు వస్తుంది. ఆలస్యంగా బిల్లులు తీయడం వల్ల వినియోగదారులకు నష్టం ఉండదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here