భగ్గుమంటున్న ఉల్లి..ఘాటెక్కిన వెల్లుల్లి

0
2


భగ్గుమంటున్న ఉల్లి..ఘాటెక్కిన వెల్లుల్లి

సామాన్యుల బెంబేలు

– న్యూస్‌టుడే, కామారెడ్డి వ్యవసాయం

ఉల్లిని కోస్తే కన్నీళ్లు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే… ప్రస్తుతం వాటిని కొనాలన్నా కంట తడే పెట్టిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు దిగుబడి తగ్గిపోగా పెరిగిన ధరలతో కొనుగోలుదారుల జేబుకు చిల్లు పడుతోంది. వెల్లుల్లి ధర సైతం రోజురోజుకూ పెరుగుతూ ఘాటెక్కుతోంది. వీటికి తోడు అల్లం సామాన్యుడికి అందనంత స్థాయికి చేరుతోంది.

 

వేసవికాలంలో ఉల్లి రూ.10కే కిలో లభించేవి. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.50-60కి చేరింది. ఈ మధ్యకాలంలో ఇంత ధర ఎప్పుడూ లేదని విక్రేతలే పేర్కొంటున్నారు. వెల్లుల్లి రూ.160-200 వరకు ఎగబాకింది. కామారెడ్డి మార్కెట్‌కు సాధారణంగా మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఇవి దిగుమతవుతుంటాయి. అక్కడ వరుస వర్షాలతో దిగుబడి తగ్గి డిమాండు పెరుగుతోంది. రవాణాపరమైన ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ఫలితంగా మన మార్కెట్‌లో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

అదేబాటలో అల్లం

ఉల్లి-వెల్లుల్లితో అల్లమూ పోటీపడుతోంది. సాధారణంగా కిలోకు రూ.80 ఉండేది. ఇటీవల కాలంలో రూ.120-160 చేరుకొంది. కొన్ని సందర్భాల్లో రూ.200 వరకూ విక్రయిస్తున్నారు.

ఉద్యానశాఖ ఏం చేస్తోంది..?

● జిల్లాలో జనాభాకు అనుగుణంగా రోజుకు కనీసం 25 టన్నుల ఉల్లి అవసరమవుతుంది. అంటే ఏటా సుమారుగా 9,125 టన్నులు కావాలని ఉద్యానశాఖ అధికారులే చెబుతున్నారు. అంతా బాగుంటే ఎకరానికి 6 టన్నుల దిగుబడులు వస్తాయి. అంటే కనీసం 1,550-1,600 ఎకరాల్లో సాగు చేయాలి. ప్రస్తుతం జిల్లాలో కేవలం 154 ఎకరాల్లో మాత్రమే చేస్తున్నారు. అంటే జిల్లా అవసరాల్లో కేవలం పదిశాతమే అన్నమాట.

● వెల్లుల్లి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. కేవలం ఎకరంలో మాత్రమే సాగు చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఒక వ్యక్తి నిత్యం 5 గ్రాముల వెల్లుల్లి వాడతాడనుకున్నా.. జిల్లాకు 4.5 టన్నుల మేర అవసరం. అంటే ఏడాదికి 1,642 టన్నులు. అధికారుల లెక్కల ప్రకారం ఎకరానికి రెండు టన్నుల దిగుబడి వస్తుందనుకుంటే సుమారు 900-1,000 ఎకరాల్లో పండించాల్సి ఉంటుంది.

● ఇక అల్లం సాగు ఆనవాళ్లు మన జిల్లాలో మచ్చుకైనా కానరావడం లేదు. వెల్లుల్లి స్థాయిలోనే అల్లం వాడకమూ ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి, అల్లం కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడటం వల్లనే ఈ దుస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఉద్యానశాఖ అధికారులు చొరవ తీసుకొని వీటి సాగు వైపు మళ్లిస్తే.. రైతులకు అధిక లాభాలను తెచ్చి పెట్టడంతో పాటు ప్రజల అవసరాలు తీర్చి ధరలను అదుపు చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఇంత ధర ఎప్పుడూ చూడలేదు

– రాజూరి స్రవంతి గృహిణి కామారెడ్డి

వెల్లుల్లి ధర ఇంత పెరగడం నేనెప్పుడూ చూడలేదు. మార్కెట్‌కు రూ.వంద తీసుకెళ్తే అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు పావు కిలో చొప్పునైనా రావడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఇంకెన్నాళ్లు? అధికారులు చొరవ తీసుకోవాలి.


కొనలేము..తినలేం..

– గందె స్వప్న, కామారెడ్డి

పెరిగిన ధరలతో ఉల్లి కొనేటట్టులేం. అల్లం.. వెల్లుల్లి తినే పరిస్థితి లేదు. ఏ కూర వండాలన్నా అవే కావాలి. అధికారులు చర్యలు తీసుకొని ధరలను కట్టడి చేయాలి. రేషన్‌ దుకాణాల ద్వారా రాయితీపై సరఫరా చేయాలి.


 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here