మనసారా వదిలేసారు

0
2


మనసారా వదిలేసారు

గాంధీజీ కలల సాకారానికి అడుగులు

ఆదర్శం జుక్కల్‌ పల్లెలు

న్యూస్‌టుడే, జుక్కల్‌

మద్యం నిషేధిస్తున్నట్లు తీర్మానప్రతిని అప్పటి ఎస్సై అభిలాష్‌కు అందిస్తున్న జుక్కల్‌ గ్రామస్థులు

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ప్రాంతంలో ప్రజలు వివిధ రకాల భాషలు మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతి సంప్రదాయాలతో వినూత్నంగా కనిపిస్తారు. జిల్లాకు సుదూరంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూతవేటు దూరంలో ఉన్న వీరు అన్నింట్లోనూ భిన్నంగా ఉంటారు. మండలంలో 30   పంచాయతీలు ఉండగా సుమారు 45వేల జనాభా నివసిస్తోంది. 15 పంచాయతీల్లో సంపూర్ణ మద్యపానం నిషేధిస్తూ గ్రామస్థులు తీర్మానించారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేసే దిశగా అడుగులేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జుక్కల్‌ త్రిభాష సంగమంగా పేరుగాంచింది. ఇక్కడ కొన్ని గ్రామాల్లో కన్నడ, మరాఠీ, తెలుగు మాతృభాషగా చలామణి అవుతోంది. మూడు భాషలను అనర్గళంగా మాట్లాడే ప్రజలు భక్తిమార్గంలో, దైవ చింతనతోనే కాలం గడుపుతుంటారు. మహారాష్ట్రలోని పండరీపూర్‌ విఠలేశ్వరుని మాల ధరించిన ప్రజలు ప్రతి గ్రామంలో ఉన్నారు. వారిని వార్‌కారీలుగా పిలుస్తుంటారు. వీరు మద్యం, మాంసం ముట్టుకోరు. కర్ణాటకలోని మొఘల్‌ఖోడ్‌లోని మృగేంద్రప్ప, మహారాష్ట్రలోని నరేంద్ర చార్యజీ మహరాజ్‌ భక్తులు కూడా మద్యపానానికి దూరంగా ఉంటారు. ఇలా 50 శాతం మంది ప్రజలు మద్యం ముందు నుంచే ముట్టుకోరు.

యువత చొరవ

జుక్కల్‌ మండలంలో సంపూర్ణ మద్యపానం అమలు విషయంలో మొట్టమొదటిగా యువతనే పావులు కదిపింది. ఖండేబల్లూర్‌లో మద్యం కారణంగా కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. ఇక లాభం లేదనుకున్నా ఆ గ్రామ యువకులు ‘గావ్‌ బచావ్‌’ పేరిట ఏకమయ్యారు. ఆబ్కారీ, పోలీసు శాఖ అధికారులను గ్రామాలకు పిలిపించారు. అధికారులను సహకరించాలని కోరారు. సీఐ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, మద్యం తాగడంతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. అంతకు ముందు కౌలాస్‌లో మద్యపానం అమలులో ఉంది. ఖండేబల్లూర్‌తో మొదలైన మద్యపాన నిషేధం కొద్ది కాలంలోనే మండలమంతా పాకింది.

పెద్దఏడ్గిలో మద్యపాన నిషేధమని ఏర్పాటు చేసిన బోర్డు వద్ద గ్రామస్థులు

ఇచ్చట మద్యం విక్రయించరు

ఖండేబల్లూర్‌, బంగారుపల్లి, కౌలాస్‌, పెద్దఏడ్గి, దోసుపల్లి, పడంపల్లి, చిన్నగుల్లా, కేమ్‌రాజ్‌కల్లాలి, వజ్రఖండి, మైలార్‌, మాధాపూర్‌, బిజ్జల్‌వాడి, నాగల్‌గావ్‌, జుక్కల్‌, గుండూర్‌ గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. ఈ గ్రామాల్లో గొలుసు దుకాణాలు కనిపించవు. ఎవరైనా దొంగతనంగా అమ్మితే కఠిన చర్యలు తప్పవు. బంధువులు, శుభకార్యాలు నిర్వహిస్తే మద్యం కోసం వేరే గ్రామానికి వెళ్లి అక్కడే తాగి రావాలి. దాదాపు 15 గ్రామాల్లో ఎక్కడా మద్యం లభించకపోవడంతో మద్యం ప్రియుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

జుక్కల్‌లోనే ‘కిక్కు’

వార్‌కారీ సంప్రదాయం, ఆయా స్వామీజీల భక్తులు మద్యం తాగరు. 15 గ్రామాల్లో మద్యపాన నిషేధం అమలవుతున్నా... ఇటీవల జరిగిన మద్యం దుకాణాల టెండర్లలో మండల కేంద్రంలో ఎక్కువ దరఖాస్తులు రావడం విశేషం. ఇక్కడ దుకాణం నిర్వహించేందుకు జిల్లా, రాష్ట్రాల నుంచి ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే కూత వేటు దూరంలో ఉన్న పొరుగు రాష్ట్రాలకు పంపించే మద్యమే ఎక్కువ లాభాలు చేకూరుస్తోంది.

సర్పంచులు సాహసం చేశారు  - లక్ష్మణ్‌, సర్పంచి, బంగారుపల్లి

సర్పంచుల్లో ఎక్కువ మంది మూడు పదుల వయసున్న వారే. గ్రామానికి ఏదో చేయాలనే తపన ఉంది. మద్యం ప్రియులతో ఇబ్బందికరంగా మారేది. సర్పంచులు సాహసం చేసి, తీర్మానించాం. గతంలో మా గ్రామంలో రెండు గొలుసు దుకాణాలు ఉండేవి. ప్రస్తుతం లేవు. దొంగతనంగా మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

యువకుల కృషి అవసరం

పల్లెల ప్రగతికి యువత కృషి అవసరం. గ్రామాల్లో సేవాభావంతో కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి. మా ఊర్లో గొలుసు దుకాణాలు నిర్వహించే సమయంలో రోజుకో గొడవ జరిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి గ్రామ పెద్దలు సహకరించారు.

- రాజు, ఖండేబల్లూర్‌

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here