మాన్యం మాయం

0
3


మాన్యం మాయం

ఆలయ భూముల లెక్కలు గల్లంతు

జిల్లాలో వెయ్యి ఎకరాలకు పైగా అన్యాక్రాంతం

నోటీసులు జారీ చేసేందుకు వెనుకాడుతున్న దేవదాయశాఖ అధికారులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

మూలవిరాట్టు పేరు మీద ఉండాల్సిన భూములు అక్రమార్కుల చేతుల్లో నలుగుతున్నాయి. జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా ఆలయాల భూములు ఆక్రమణకు గురైనట్లు ఇటీవల రెవెన్యూ శాఖ నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళనలో దేవదాయ శాఖ అధికారులే గుర్తించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్ఛు

ఆక్రమణలు గుర్తించిన అధికారులు వాటిని ఎవరు అన్యాక్రాంతం చేశారు? ఎవరు సహకరించారనే వివరాలను సమగ్రంగా సేకరించారు. ఇప్పటికే కొన్ని ఉదంతాల్లో ఆక్రమణదారులను గుర్తించారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు మాత్రం వెనుకాడుతున్నారు.

జిల్లాలో చిన్న, మధ్య, పెద్దవన్నీ కలిపి సుమారు 607కు పైగా ఆలయాలున్నాయి. వీటిలో 156 దేవాలయాలకు దాతలిచ్చిన, మాన్యాలు, మఠాల భూములన్నీ కలిపి 1,887-27 ఎకరాలకు పైగా ఉన్నాయి. ఇందులో 82 ఆలయాలకు చెందిన మాన్యం 1023-17 ఎకరాలు అన్యాక్రాంతమైందని అధికారులు గుర్తించారు. కబ్జాకు భూములన్నింటిని వెంటనే స్వాధీనం చేసుకొని దేవాలయాల మూలవిరాట్టు పేరిట పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు మాత్రం ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసేందుకు మీనమేషాలు లెక్కపెడుతుండటం విమర్శలకు దారితీస్తోంది.

పరాధీనమైన మరికొన్ని..

* జిల్లా సరిహద్దు మండలమైన మద్నూర్‌లో 11 ఆలయాల పేరిట 111.13 ఎకరాలు ఉన్నాయి. ఇందులో కేవలం 13 ఎకరాలు మాత్రమే దేవుడి పేరిట ఉన్నాయి. అన్యాక్రాంతమైన భూముల విషయంలో కబ్జాదారులు న్యాయస్థానంలో కేసు వేయగా ఇటీవల వెలువడిన తీర్పు దేవదాయ శాఖకు అనుకూలంగా వచ్చినట్లు తెలిసింది. ఆయా భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు శాఖ అధికారులు చర్యలు  తీసుకోకపోవడం గమనార్హం.

* భిక్కనూరు సిద్దిరామేశ్వరాలయానికి 195.25 ఎకరాలు ఉండగా ఇక్కడ అత్యధిక విస్తీర్ణం ఇతరుల చేతుల్లో ఉండిపోయింది. కనీసం కౌలైనా చెల్లించడం లేదు.

 

* భిక్కనూరు మండలం తిప్పాపూర్‌లో లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 88.36 ఎకరాలు ఉండగా.. అత్యధిక భాగం అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించారు. తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

* జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయం, విఠలేశ్వరాలయాలకు 25 ఎకరాలకు పైగా భూములుండగా ఎక్కువగా ఇతరుల చేతుల్లోనే ఉన్నాయి.

* సదాశివనగర్‌లోని విశ్వేశ్వరాలయానికి సంబంధించిన 528.24 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. భూ దస్త్రాల ప్రక్షాళనలో ఆయా భూములను దేవస్థానం పేరిట మార్పుచేశారు. గ్రామానికి చెందిన 150 మంది రైతులు వీటిని సాగు చేసుకొంటున్నట్లు దేవదాయ శాఖ అధికారులు గుర్తించారు. సిబ్బంది లేరనే సాకుతో రెండు నెలలు గడిచినా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయలేదు.

ఇదీ సమస్య

జిల్లాలోని దేవాలయాలకు చెందిన వెయ్యి ఎకరాలకు పైగా ఆక్రమణదారులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ దర్జాగా అనుభవిస్తున్నారు. దేవుడి మాన్యాలు కబ్జాకు గురవ్వటంతో ఆదాయం లేక పలు ఆలయాల్లో దూప, దీప నైవేద్యాలు లేవు. రెవెన్యూ, దేవదాయ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా భూ దస్త్రాల ప్రక్షాళన తుది దశకు చేరుకొన్నప్పటికీ కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవడం లేదు. ఈ విషయమై దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ సోమయ్యను ‘ఈనాడు’ వివరణ కోరగా.. అన్యాక్రాంతమైన ఆలయాల భూములను స్వాధీనం చేసుకొనేందుకు త్వరలో ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here