మావాణి వినాలి .. చొరవ చూపాలి

0
2


మావాణి వినాలి .. చొరవ చూపాలి

ప్రజావాణికి తరలొచ్చిన ఫిర్యాదుదారులు

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న జేసీ యాదిరెడ్డి

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు కలెక్టరేట్‌కు సోమవారం తరలి వచ్చారు. సంయుక్త కలెక్టర్‌ యాదిరెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎప్పటి మాదిరిగానే రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వచ్చాయి. పాసు పుస్తకాలు రాలేదని, భూవిస్తీర్ణం తక్కువగా నమోదైందంటూ బాధితులు గోడు వెల్లబోసుకున్నారు.

నిర్వాసితులను ఆదుకోండి

…నర్సింగ్‌రావుపల్లి గ్రామస్థులు

మా భూముల నుంచి 161 జాతీయ రహదారి వెళ్తుంది. సర్వే నంబరు 20లో సుమారు 40 ఎకరాల భూమిని రోడ్డు కోసం తీసుకున్నారు. కానీ మాకు పరిహారం ఇంత వరకు రాలేదు. సదరు భూములను ప్రభుత్వమే మాకు ఇచ్చింది. ఆ భూములనే సాగు చేసుకొని బతుకుతున్నాం.. మాకు ఇచ్చిన భూములు అటవీశాఖకు చెందినవని వారు పేర్కొంటున్నారు. దీంతో మాకు రావాల్సిన పరిహారం ఆగిపోయింది. గతంలోనూ కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశాం.

13 గుంటల భూమి తక్కువగా వచ్చింది

…రాజిరెడ్డి(క్యాసంపల్లి)

నాకు ఇచ్చిన పాసు పుస్తకాల్లో 13గుంటల భూమి విస్తీర్ణం తక్కువగా వచ్చింది. మా నాన్న గంగారెడ్డి పేరిట 2.03 ఎకరాల పట్టా భూమి ఉంది. కానీ అధికారులు 1.30 ఎకరాల భూమి ఉన్నట్లే నమోదు చేశారు. మాకు చెందాల్సిన భూమిని మరొకరి పేరిట నమోదు చేసినట్లు తెలిసింది.

​​​​​​​
కలెక్టరేట్‌కు వచ్చిన నర్సింగ్‌రావుపల్లి బాధితులు

మా భూమి మరొకరి పేరిట

దశరధ్‌ (భిక్కనూరు)

నేను 1981లో కొనుగోలు చేసిన భూమి ఇప్పుడు మరొకరి పేరుపై ఉంది. సర్వే నంబరు 530లో 2.18 ఎకరాల భూమిని సాగు చేసుకొని జీవిస్తున్నాను. మా గ్రామానికి చెందిన వీఆర్వో నా భూమిని బస్వాపూర్‌కు చెందిన మరొకరి పేరు మీదికి మార్చారు. నా వద్ద అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయని చూపినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

న్యాయవాదుల వినతి

కామారెడ్డి కలెక్టరేట్‌ : కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. 41 సీఆర్‌పీని రద్దు చేయాలంటూ జేసీ యాదిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్‌ అధ్యక్షులు లక్ష్మణ్‌రావు, ఉపాధ్యక్షులు శ్రీధర్‌, సురేందర్‌రెడ్డి, జగన్నాథం, వెంకట్రాంరెడ్డి, శంకర్‌రెడ్డి, సిద్ధిరాములు, నరేందర్‌రెడ్డి, దేవరాజ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరాగాంధీ స్టేడియం ఎదుట ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు

కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా కార్యకర్తలు

కామారెడ్డి కలెక్టరేట్‌ : న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆశా కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉదయం 10గంటలకే కలెక్టరేట్‌ ప్రధాన గేటు బయట బైఠాయించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాదిరిగా కార్యకర్తలకు నెలకు రూ. 10,800 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఉద్యోగులెవరిని కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో ప్రజావాణిలో పాల్గొనడానికి వచ్చిన జేసీ యాదిరెడ్డిని కూడా అడ్డుకొని తమ గోడును వినిపించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జేసీ పేర్కొనడంతో ఆందోళన విరమించారు.

స్టేడియం ఎదుట ఆందోళన

కామారెడ్డి కలెక్టరేట్‌ : ఇందిరాగాంధీ స్టేడియం ఎదుట ఆశా కార్యకర్తలు సోమవారం ఆందోళన నిర్వహించారు. స్టేడియంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఉన్నారని తెలుసుకున్న వారు కలెక్టరేట్‌ నుంచి స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టడానికి ప్రయత్నించారు. కార్యకర్తలు, సీఐటీయూ నాయకులతో విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడారు. సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆశలు ఆందోళన విరమించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here