మా రాజు..మా కూలీ

0
4


మా రాజు..మా కూలీ

వరినాట్లకు డిమాండు

దినసరి కూలి రూ.800 పైనే

అల్పాహారం, ఛాయ్‌తో మర్యాదలు

న్యూస్‌టుడే, వేల్పూర్‌

నాట్లు వేస్తున్న కూలీలు

‘మా రాజు..మా కూలీ..’ ఇది ప్రస్తుత ఖరీఫ్‌ వరినాట్ల సీజన్‌లో దక్కిన గౌరవం. వారం ముందు రూ.800-900 వేతనం చెల్లింపు.. ఆపై రవాణా ఖర్చులు.. టిఫిన్‌, ఛాయ్‌.. ఇంతటి మర్యాద గతంలో ఎన్నడూ చూడలేదు.

భీమ్‌గల్‌ మండలంలో ప్రస్తుత సీజన్‌లో 11,855 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా చేశారు. ఇప్పటి వరకు 8,950 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ అత్యధికంగా వరినే సాగు చేయడం.. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు ఒకేసారి నాట్ల పనులు చేపట్టడంతో కూలీల కొరత ఏర్పడింది. పోటీతత్వంతో రైతులు కూలి రేట్లను పెంచేస్తూ పోతున్నారు. ఫలితంగా వ్యవసాయ కూలీలకు గరిష్ఠంగా రూ.900 వరకు కూలి లభిస్తోంది. నిర్ణీత సమయం దాటినా నాట్లు మిగిలిపోతే అదనంగా చెల్లిస్తూ పని పూర్తి చేయించుకోవడంతో..కర్షకుల మాటేమో గానీ కూలీల పంట పండుతోంది.

నల్గొండ, నిర్మల్‌ ఉంచి రాక

వరినాట్లకు ఉన్న డిమాండు నేపథ్యంలో నల్గొండ జిల్లా నుంచి భారీగా కూలీలు ఆర్మూర్‌ ప్రాంతానికి వచ్చారు. మిర్దాపల్లి, మంథని, ఖానాపూర్‌, పిప్రి తదితర గ్రామాల్లో ఎకరానికి రూ.4 వేల వరకు తీసుకొని నాట్లు వేశారు. నిర్మల్‌ కూలీలు నిత్యం ఆటోల్లో వచ్చిపోతున్నారు.

వ్యయం తడిసి మోపెడు

ఎకరంలో నాట్లు వేయడానికి ఆరు నుంచి ఏడుగురు కూలీలు అవసరం. గతంలో కూలి(రూ.300-350) ప్రకారం రూ.2,500 మించేదికాదు. ప్రస్తుత వేతనం, టిఫిన్‌, రవాణా ఖర్చులతో రూ.6 వేలు దాటుతోంది. నాట్ల సమయంలోనే ఈ స్థాయిలో ఉంటే కలుపు, మందులు, యంత్రాల వినియోగం.. ఇలా మొత్తానికి గతంలో పోలిస్తే ఎకరానికి రూ.10 వేల అదనపు వ్యయం తప్పేట్టు లేదని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బదిలీలతో పూర్తి

వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో పెరిగిన కూలి ధరలు చూసి రైతులు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలతో నాట్లు పూర్తి చేస్తున్నారు.

ఆరుతడి పంటలకూ..

ఒకవైపు వరినాట్లకు ఉన్న డిమాండుతో అందరూ అటువైపు మళ్లడంతో.. మొక్కజొన్న, పసుపు, సోయాబీన్‌ వంటి ఆరుతడి పంటల్లో కలుపు తీయడానికి కూలీల కొరత ఏర్పడుతోంది. మొన్నటి వరకు దినసరి కూలి రూ.150 ఉండగా.. ప్రస్తుతం రూ.300 కు చేరింది. అయినా సకాలంలో కలుపు తీయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న, సోయాబీన్‌లో కలుపు మందులను పిచికారీ చేస్తున్నా.. పసుపు పంటకు కూలీలు తప్పనిసరి. ఆర్మూర్‌ డివిజన్‌లోని నందిపేట్‌, జక్రాన్‌పల్లి, వేల్పూర్‌, మోర్తాడ్‌, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మెండోరా, ఏర్గట్ల మండలాల్లో అత్యధికంగా పసుపు సాగు చేస్తున్నారు.

హరితహారం ఎలా..?

గతంలో ఉపాధిహామీ పనుల వల్ల పంటల సాగుకు కూలీల కొరత ఏర్పడేది. ప్రస్తుతం ఉపాధి పథకం వైపు కన్నెత్తి చూడటంలేదు. వేల్పూర్‌ మండలం 18 పంచాయతీల పరిధిలో హరితహారం మొక్కలు నాటడానికి 200 మించి కూలీలు రావడంలేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో హరితహారం లక్ష్యాలను ఛేదించడానికి అధికారులు తలలు పట్టుకొంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here