మీకు బంగారం లాంటి అవకాశం, భారత్ రండి: అమెరికాలో మోడీ పిలుపు

0
3


మీకు బంగారం లాంటి అవకాశం, భారత్ రండి: అమెరికాలో మోడీ పిలుపు

భారత ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించిందని, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రపంచ వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు అనేది అద్భుత అవకాశమని, ఈ గోల్డెన్ ఆపర్చ్యునిటీని ఉపయోగించుకోవాలన్నారు. న్యూయార్క్‌లోని బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాపార అవకాశాలను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపారు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 40కి పైగా గ్లోబల్ సంస్థల సీఈవోలతో మోడీ సమావేశమయ్యారు.

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు కేవలం ప్రారంభం మాత్రమే అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకర సంస్కరణలు ఉంటాయన్నారు. కార్పొరేట్లు, సంపద సృష్టికర్తలకు తమ ప్రభుత్వం చాలా గౌరవం ఇస్తోందన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యం, జనాభా, ఆదరణ, నిర్ణయాత్మక శక్తి వంటి 4 అంశాలే భారత వృద్ధిరేటుకు కీలకమన్నారు. రాజకీయ సుస్థిరత, ఆమోదయోగ్యమైన విధానాలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థలు పెట్టుబడులకు భద్రతను ఇస్తాయని చెప్పారు.

పెట్టుబడులకు అనుకూలమైన మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారా… అయితే భారత్ రావాలని, అతిపెద్ద మార్కెట్ కలిగిన స్టార్టప్స్ పెట్టుబడులు పెట్టాలనుకున్నా.. తమ దేశం రావాలని కోరారు. ఎక్కువ మౌలిక సదుపాయాలుకలిగిన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తమ దేశం మంచి ఆప్షన్ అని చెప్పారు. సులభతర వాణిజ్యం కోసం 50 చట్టాలను రద్దుచేశామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే అయిందని, ఇది కేవలం ఆరంభమే అన్నారు.

భారత్ 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రస్తుతం 1 ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థను జోడించామని చెప్పారు. గత ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్ల ఫారన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయన్నారు. అంతకుముందు రెండు దశాబ్దాలతో పోలిస్తే ఇది దాదాపు సగం అన్నారు. భారత్ రావాలని, ఎక్కడైనా గ్యాప్ ఉంటే తాను ఓ బ్రిడ్జిలా వ్యవహరిస్తానని వ్యాపారవేత్తలకు హామీ ఇచ్చారు.

దాదాపు మూడు దశాబ్దాల్లోనే కనిష్ఠ స్థాయికి దేశంలో కార్పొరేట్ పన్ను రేటును గత వారం నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గించింది. 30 శాతానికి పైగా ఉన్న కార్పోరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారత మార్కెట్లలో కార్పోరేట్ తగ్గింపు జోష్ కనిపించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here