ముడుపుల పదోన్నతులపై ఆరా

0
3


ముడుపుల పదోన్నతులపై ఆరా

రహస్యంగా విచారణ చేయిస్తున్న వీసీ

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల పొరుగు సేవల సిబ్బందికి ఇచ్చిన పదోన్నతుల్ని ఇన్‌ఛార్జి ఉపకులపతి అనిల్‌కుమార్‌ రద్దు చేయడంపై వర్సిటీలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. పదోన్నతులు పొందిన వారిలో కొందరు ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ అధికారి సహాయకుడు, ఇద్దరు విద్యార్థి సంఘాల నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించి డబ్బులు వసూలు చేశారని తెలుస్తోంది. ఈ విషయం వీసీ దృష్టికి వెళ్లడంతో ఆయన రహస్య విచారణ చేయిస్తున్నారు. రిజిస్ట్రార్‌ బలరాములు అత్యుత్సాహంపై వీసీ అనిల్‌కుమార్‌ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మాజీ ఉపకులపతి సాంబయ్య పదవీ విరమణ అనంతరం వర్సిటీలో జరిగిన వ్యవహారాలపై ఇన్‌ఛార్జి వీసీ దృష్టి కేంద్రీకరించి.. అక్రమాలపై కొరడా ఝులిపిస్తున్నారు.

కమిటీ సమావేశం

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివిలో పొరుగు సేవల సిబ్బంది సమస్యలు, న్యాయపరమైన డిమాండ్లపై వీసీ అనిల్‌కుమార్‌ నియమించిన కమిటీ శుక్రవారం పరిపాలన భవనంలో సమావేశమైంది. ఏ విభాగాల్లో ఎంత మంది సిబ్బంది ఏయే విభాగాల్లో పనిచేస్తున్నారు? వారి అవసరం ఇంకెక్కడైనా ఉందా? అనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. దసరా సెలవుల అనంతరం పూర్తి స్థాయి నివేదికను వీసీకి అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

వాలంటీర్ల ఎంపిక

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివిలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రీ-రిపబ్లిక్‌ పరేడ్‌ కోసం వాలంటీర్ల ఎంపిక చేపట్టారు. వర్సిటీ అనుబంధ కళాశాలల వాలంటీర్లకు శుక్రవారం పరుగు పందెం పోటీ నిర్వహించారు. పరేడ్‌ టెస్ట్‌, శారీరక ధారుడ్యం, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన వారిని త్వరలో గుజరాత్‌లో జరిగే ప్రీ-రిపబ్లిక్‌ పరేడ్‌కు పంపిస్తామని ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త ప్రవీణాబాయి తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, ప్రోగ్రాం అధికారులు ఉన్నారు.

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతిగా పున్నయ్య

తెవివి క్యాంపస్‌ (డిచ్‌పల్లి): తెవివిలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతిగా ఎకనామిక్స్‌ సహాయ ఆచార్యుడు ఏ.పున్నయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ బలరాములు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన గతంలో బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌గా, కాంపిటేటివ్‌ సెల్‌ డైరెక్టర్‌గా, పాఠ్య ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా పని చేశారు.

అపాయిడ్‌ ఎకనామిక్స్‌ విభాగాధిపతి నియామకం

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివిలో అపాయిడ్‌ ఎకనామిక్స్‌ విభాగాధిపతిగా బి.వెంకటేశ్వర్లను రిజిస్ట్రార్‌ బలరాములు శుక్రవారం నియమించారు. ఆయన గతంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారిగా, వసతి గృహాల చీఫ్‌ వార్డెన్‌గా పని చేశారు.

కెమిస్ట్రీ విభాగంలో కార్యశాల

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివి కెమిస్ట్రీ విభాగంలో శుక్రవారం ‘ఫిజికల్‌ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌’ అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. ప్రాక్టికల్స్‌ ప్రాధాన్యత, అందులోని ఇబ్బందులను ముఖ్య అతిథి సంజీవరెడ్డి వివరించారు. పరిశోధనలు పెంచాలని సూచించారు. అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ కనకయ్య, విభాగం ఆచార్యులు నాగరాజుతో పాటు పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వర్సిటీకి దసరా సెలవులు

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివికి ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబరు 9 వరకు దసరా సెలవులు ప్రకటించారు. వచ్చే నెల 10న వర్సిటీ పునఃప్రారంభం అవుతుంది. అప్పటి వరకు వసతి గృహాలు మూసేయనున్నారు. అయితే పరిపాలనపరమైన కార్యకలాపాలు కొనసాగుతాయి.

సమస్యల పరిష్కారానికి పోరాటం

భిక్కనూరు, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన తంగళ్లపల్లి సంతోష్‌గౌడ్‌ను దక్షిణ ప్రాంగణంలో విద్యార్థి ఐకాస నేతలు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్యాంపస్‌ సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్న సంతోష్‌గౌడ్‌ పరిశోధన విద్యార్థుల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులోనూ ఇదే పంథాను కొనసాగిస్తానని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి ఐకాస నేతలు స్వర్గం సందీప్‌, రమేశ్‌, సుధాకర్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here