ముస్లిం టీవీ జర్నలిస్టును చూడను: లైవ్ డిబేట్ లో కళ్లు మూసుకున్న హిందూ నేత

0
1


ముస్లిం టీవీ జర్నలిస్టును చూడను: లైవ్ డిబేట్ లో కళ్లు మూసుకున్న హిందూ నేత

న్యూఢిల్లీ: ఓ ముస్లిం జర్నలిస్ట్ కమ్ న్యూస్ యాంకర్ కు టీవీ లైవ్ డిబేట్ లో ఘోర అవమానం జరిగింది. ముస్లిం కావడం వల్ల తాను అతణ్ని చూడబోనని అంటూ తన కళ్లకు చేతులను అడ్డుగా పెట్టుకున్నారు ఓ హిందూ సంస్థ ప్రతినిధి. ఇదంతా లైవ్ డిబేట్ లోనే చోటు చేసుకుంది. జొమాటో ఫుడ్ యాప్‌ అన్ ఇన్ స్టాల్ చేయడం, ముస్లిం డెలివరీ బాయ్ వ్యవహారం రేపిన ప్రకంపలను సద్దు మణగక ముందే అదే తరహా ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది. జొమాటో అంశంపై ఓ హిందీ న్యూస్ టీవీ చానల్ శుక్రవారం ఉదయం లైవ్ డిబేట్ నిర్వహించింది. సచ్ యా ఝూట్ అనే శీర్షికన ఇది ప్రత్యక్ష ప్రసారమైంది.

మౌలానా అథర్ దెహ్లవీ, అశుతోష్, ఐపీఎస్ బావా, వినోద్ బన్సల్, అజయ్ గౌతమ్ ఈ డిబేట్ లో పాల్గొన్నారు. ఆ న్యూస్ ఛానల్ న్యూస్ ఎడిటర్ సందీప్ చౌదరి దీనికి సమన్వయకర్తగా వ్యవహరించారు. అదే ఛానల్ లో పనిచేస్తోన్న సవుద్ మహమ్మద్ ఖాలిద్ అనే ముస్లిం జర్నలిస్టు కూడా ఇందులో పాల్గొన్నారు. డిబేట్ చివరలో ఆయన బుల్లితెరపై కనిపించారు. ఆయన కనిపించిన వెంటనే అజయ్ గౌతమ్ తన కళ్లకు చేతులను అడ్డుగా పెట్టుకున్నారు. అదేమిటని సందీప్ చౌదరి ప్రశ్నించగా.. ముస్లిం యాంకర్ ను తాను తన కళ్లతో చూడబోనని స్పష్టం చేశారు. ఈ తతంగం అంతా ఆ న్యూస్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారమైంది. అజయ్ గౌతమ్ ‘హమ్ హిందూ’ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడు.

ఈ ఘటనపై ఆ ఛానల్ లో పనిచేస్తోన్న ముస్లిం జర్నలిస్టులు, ఇతర సిబ్బంది అజయ్ గౌతమ్ చర్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ కార్యాలయం నుంచి బయటికి వెళ్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అజయ్ గౌతమ్ చర్యలపై పలు మీడియా సంస్థలు తమ వ్యతిరేకతను ప్రకటిస్తున్నాయి. పలువురు సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అజయ్ గౌతమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎప్పుడూ అజయ్ గౌతమ్ ను తమ ఛానల్ లైవ్ డిబేట్లకు ఆహ్వానించబోమని సదరు న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ తెలిపారు. ఆయనను నిషేధిస్తున్నామని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here