మెరుగుపడితే మేలు

0
1


మెరుగుపడితే మేలు

తగ్గనున్న ఇబ్బందులు

జిల్లా కేంద్ర ఆస్పత్రి నిర్మాణ ప్రతిపాదనలు ఫలించేనా

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే

జిల్లాకేంద్ర ఆస్పత్రి

సర్కారు వైద్యాన్ని మెరుగుపరిచే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. జిల్లా కేంద్రంగా మారిన కామారెడ్డిలో అధునాత వసతులు కల్పించే దిశగా చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైంది. ప్రస్తుతం 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్ర నిర్మాణ పనులు సాగుతున్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిని పూర్తిగా వేరే చోటకు తరలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నూతన నిర్మాణాలు జరిగే చోట భవిష్యత్‌లో మరిన్ని వసతుల కల్పనకు అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రం నడిబొడ్డున గర్భిణులకు పూర్తి స్థాయి సేవలందించేందుకు ఆస్కారం కలగనుంది. ప్రస్తుతం మరో చోట స్థలాన్ని పరిశీలన చేయాలనే ఆలోచన ఉంది. ఈ విషయమై వైద్యశాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రణాళిక ఎప్పుడు కార్యరూపం దాల్చేనా అనే సందిగ్ధం నెలకొంది.

ప్రాంతీయాస్పత్రికి జిల్లా కేంద్ర ఆస్పత్రి స్థాయి హోదా దక్కింది. నిత్యం 900-970 మంది వివిధ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ పూర్తి స్థాయిలో సేవలందించడానికి కష్టతరమవుతోంది. రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు 100 -120 మంది దాకా ఉంటారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి చేసిన కృషి ఆశించిన మేర ఫలించడం లేదు. జిల్లా ఆస్పత్రి స్థాయి పెంచినా మెరుగైన వైద్యసేవలందక అగచాట్లు తప్పడం లేదు.

300 పడకలకు పెంచినా

* ప్రాంతీయాస్పత్రిలో 100 పడకలు మాత్రమే ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి స్థాయికి పెంచాలంటే 300 పడకలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి ఇరుకుగా ఉంది. ఏళ్ల నాటి నుంచి తక్కువ పడకలతో కాలం వెళ్లదీస్తున్నారు. 16 ఏళ్ల కిందట 100 పడకలకు స్థాయిని పెంచారు.

* గతంలో 130 నుంచి 150 మంది ఓపీ రోగులు రాగా రాను రాను తాకిడి పెరిగింది. ప్రస్తుతం 900 మంది ఓపీ రోగులు వచ్చి పరీక్ష చేయించుకొని వెళుతున్నారు.

* ఇరుకు గదుల్లో వైద్య సేవలందించడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రికి స్థాయి పెంచితే నాలుగు జిల్లాల కూడలి కామారెడ్డిలో మెరుగైన వైద్య సేవలందించడానికి ఆస్కారముంది.

ట్రామాకేర్‌ ఉన్నా లేనట్టే

* జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ట్రామాకేర్‌ కేంద్రం ఉన్నా ఇక్కడ వైద్యులను నియమించలేదు.

* ప్రమాదాల బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందడం లేదు.

* ప్రస్తుత వైద్యులకు అదనంగా ట్రామా కేంద్రానికి వేరుగా సిబ్బందిని నియమించాల్సి ఉంది.

* ఇక్కడ నెలకు 300-370 ప్రమాద కేసులు వస్తుంటాయి. వీటిలో 60 కేసులు తీవ్రంగా ఉండటంతో రాజధానికి సిఫారసు చేస్తున్నారు.

ఆధునిక వసతులు కల్పించినా అరకొరే

* ఆస్పత్రిలో కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ కేంద్రం, ఐసీయూ, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

* కిడ్నీ సమస్యలతో బాధపడే వారు నెలకు 350-400 మంది వరకు వస్తుంటారు. ఇందులో 5 పడకలు మాత్రమే ఉండడంతో బాధితులకు కష్టతరమవుతోంది.

* ఐసీయూలో 10 పడకలున్నాయి. ఇందులో నిత్యం 6-8 మంది చికిత్స పొందుతుంటారు. తాకిడికి అనుగుణంగా ఇక్కడ మరో 15 పడకల ఆవశ్యకత ఉంది.

శరవేగంగా పనులు..

ప్రస్తుతం మాతాశిశు సంరక్షణ కేంద్రం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పలు విభాగాలకు గదులను నిర్మిస్తున్నారు. మరిన్ని బ్లాక్‌లు ఫిల్లర్ల దశలో ఉన్నాయి. గతంలో ఉన్న ఆస్పత్రిని ప్రసూతి విభాగానికి అప్పగించి నూతనంగా నిర్మించే చోట జిల్లా ఆస్పత్రిని తరలిస్తే సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి. ఆ దిశగా పాలక, అధికార యంత్రాంగం చర్యలు చేపడితే బాగుంటుంది.

నివాసాల మధ్య శవ పరీక్ష గది

* జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నివాసాల మధ్య శవ పరీక్ష గది ఉంది. ఇక్కడ నిత్యం 3- 4 శవాలకు పరీక్షలు చేస్తుంటారు.

* సమీప గృహాల్లో ఉన్న వారికి దుర్వాసన వెదజల్లుతోంది. పలుమార్లు నివాసాల మధ్య నుంచి శవ పరీక్ష గదిని తొలగించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది.

* కొత్తగా నిర్మించే ఆస్పత్రిలోనే శవ పరీక్ష గది ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నూతనంగా నిర్మిస్తున్న ఎంసీహెచ్‌ కేంద్రం

ప్రతిపాదనలు పంపాం

డా. అజయ్‌కుమార్‌, జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షణాధికారి

జిల్లా కేంద్ర ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తొలుత జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఇక్కడికి తరలిస్తే బాగుంటుందనే విషయం తెరపైకి వచ్చింది. కొత్త ఆస్పత్రిని పూర్తిగా ఎంసీహెచ్‌కు కేటాయించాలని వైద్యశాఖ నిర్ణయించింది.మరో చోట ప్రధాన మార్గంలోనే జిల్లా కేంద్ర ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here