మెరుస్తున్న నైపుణ్యము

0
6


మెరుస్తున్న నైపుణ్యము

కోల్‌కతా కార్మికుల ఆదర్శం
న్యూస్‌టుడే, ఆర్మూర్‌

జిల్లాలో బంగారు ఆభరణాల తయారీలో కోల్‌కతా కార్మికులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆధునిక డిజైన్లతో పాటు చిన్న పరిమాణంలో, తక్కువ బరువులో ఉండే నగలు, సూక్ష్మమైన రాళ్లు పొదిగే పనులు చేయడంలో బెంగాలీలు తమ నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు.

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల జిల్లాల వ్యాపారులు, ఆభరణాల విక్రయదారులు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా రకరకాల డిజైన్లలో బంగారు నగలు తయారు చేసే బాధ్యతను చాలావరకు ఆర్మూర్‌లో ఉండే బెంగాలీ కార్మికులకు అప్పగించడం వారి నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు.

దాదాపు రెండు దశాబ్దాల కిందట కోల్‌కతాకు చెందిన రెండు, మూడు కుటుంబాల వారు ఆర్మూర్‌కు వచ్చారు. మొదట్లో వీరు బంగారు ఆభరణాలను మెరుగుపెట్టేవారు. గుండ్లు తయారు చేసేవారు. తర్వాతికాలంలో నిజామాబాద్‌, ఆర్మూర్‌కు మరికొందరు వచ్చి వర్క్‌షాపులు ఏర్పాటు చేసుకొని ఆభరణాల తయారీలో నిమగ్నమయ్యారు. వారి నైపుణ్యాన్ని గమనించిన వ్యాపారులు వారిచేత నగలు తయారు చేయిస్తూ వస్తున్నారు. ఆర్మూర్‌లో దాదాపు 1,500 మంది బెంగాలీ పనిమంతులు ఉన్నారు. వారు 300కు పైగా వర్క్‌షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిదాంట్లో 10-30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కొంతమంది ఇక్కడే ఇళ్లు కట్టుకొని స్థిరపడ్డారు. తమ పిల్లలను సైతం స్థానిక పాఠశాలల్లో చేర్పించి చదివిస్తున్నారు.

సూక్ష్మమైన పనుల్లో నేర్పరులు
సూక్ష్మమైన పనులు చేయడంలో బెంగాలీలు నేర్పరులు. సూక్ష్మమైన రాళ్లను పొదగడం, చిన్న పరిమాణం కలిగిన ముక్కుపుడక, కమ్మలు, ఇతర ఆభరణాలను వారు చక్కగా తయారు చేస్తారని పేరుంది. నెక్లెస్‌ల తయారీలోనూ తమదైన ప్రత్యేకతను కనబరుస్తారు. గాజులు, విభిన్న డిజైన్లలో గొలుసులు బాగా చేస్తారని గుర్తింపు పొందారు.

పదిశాతం డబ్బులిస్తే చాలు
బంగారు దుకాణాల వ్యాపారులు, ఆభరణాల విక్రయదారులు వినియోగదారుల అభీష్టానికి అనుగుణంగా రకరకాల డిజైన్లలో నగలను బెంగాలీ కార్మికులతో తయారు చేయిస్తారు. వారికి పదిశాతం డబ్బులిస్తే చాలు వారు సొంతంగా బంగారం తెచ్చి నగలు తయారు చేసి వ్యాపారులకు అందజేస్తారు.

కాళికామాత భక్తులు
బెంగాలీ కార్మికులు స్వతహాగా కాళికామాత భక్తులు. ఆర్మూర్‌లో ఉన్న వీరు గతంలో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా మూడేళ్లపాటు మాత ఉత్సవాలు నిర్వహించారు. వీరు వచ్చాక స్థానిక స్వర్ణకారుల ఉపాధి దెబ్బతిందనే విమర్శలు ఉన్నాయి.

మంచి ఆదరణ ఉంది
మావాళ్లు చాలా మంది ఆర్మూర్‌కు వచ్చి ఉంటూ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నగలకు మంచి ఆదరణ ఉంది. వీటి తయారీలో మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నేను ఏడాది కిందట ఇక్కడికి వచ్చాను. బంగారం మెరుగుపెట్టే (పాలిష్‌) పని చేస్తున్నా. – శైలేష్‌ హల్దార్‌, బంగారం పాలిష్‌ చేసే కార్మికుడు, కోల్‌కతా.

అన్నిరకాల డిజైన్లు చేస్తాం
– సంజయ్‌ చోంగ్దర్‌, కోల్‌కతా
కోల్‌కతాలో బంగారు నగలు తయారుచేసే వర్క్‌షాపులో పనిచేశారు. పదేళ్ల కిందట ఆర్మూర్‌కు వచ్చాను. ఇక్కడే ఉంటూ పనిచేస్తున్నాను. దుకాణదారులు, వ్యాపారులు సూచించిన ప్రకారం అన్నిరకాల డిజైన్లలో ఆభరణాలను తయారుచేసి ఇస్తాం. గొలుసులను ఎక్కువగా చేస్తుంటాను.

రాళ్లు చక్కగా పొదుగుతాం
– సుశీల్‌ పకీడా, నగలు తయారుచేసే కార్మికుడు, కోల్‌కతా
దాదాపు పదేళ్ల నుంచి వర్క్‌షాపులో పనిచేస్తున్నా. వినియోగదారులతో మాకు సంబంధం ఉండదు. దుకాణదారులు, వ్యాపారుల సూచన మేరకు ఆభరణాలను తయారు చేసి ఇస్తాం. సూక్ష్మమైన పనులు బాగా చేస్తాం. నగల్లో రాళ్లను చక్కగా పొదుగుతాం. నెక్లెస్‌ల తయారీలో మేం ప్రత్యేకం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here