‘రంగస్థలం’: ఇక్కడ బ్లాక్ బస్టర్.. అక్కడ మాత్రం ఫ్లాప్!

0
5


రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. కిందటేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. చెన్నైలో ఇప్పటి వరకు విడుదలైన తెలుగు సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగానూ ‘రంగస్థలం’ రికార్డుకెక్కింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే చిరకాలం గుర్తుండిపోయే చిత్రంగా ‘రంగస్థలం’ ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప చిత్రం కర్ణాటకలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

తెలుగులో విడుదలైన సుమారు ఏడాది తరవాత ‘రంగస్థలం’ను మలయాళం, కన్నడ భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేశారు. మలయాళంలో విడుదల చేసిన కొన్ని రోజులకే కన్నడ వర్షన్‌‌ను ‘రంగస్థల’ అనే టైటిల్‌తో జూలై 12న విడుదల చేశారు. దీంతో కన్నడలో ఆరు దశాబ్దాల తరవాత మరో తెలుగు చిత్రం విడుదలైనట్లు అయ్యింది. 1957లో ‘మాయాబజార్’ సినిమాను కన్నడలోకి అనువాదం చేసి విడుదల చేశారు. దాని తరవాత కన్నడలో విడుదలైన రెండో తెలుగు చిత్రంగా ‘రంగస్థలం’ నిలిచింది.

‘రంగస్థలం’ కన్నడ హక్కులను నిర్మాత జాక్ మంజు రూ.1.6 కోట్లకు కొనుగోలు చేశారు. జే మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కర్ణాటకలో 100కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. కానీ, ఈ చిత్రం పేలవ వసూళ్లతో వెనకబడిపోయింది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ‘రంగస్థల’ ఇప్పటి వరకు కేవలం రూ.60 లక్షలు మాత్రమే వసూలుచేసింది. సరైన ప్రచారం లేకపోవడం, తెలుగులో విడుదలైన ఏడాదికి కన్నడలోకి అనువాదం చేయడం వల్లే ఆ ప్రభావం వసూళ్లపై పడిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

వాస్తవానికి ‘రంగస్థలం’ ఇప్పటికే టీవీల్లో కూడా వచ్చేసింది. చాలా మంది కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పటికే తెలుగులో ‘రంగస్థలం’ సినిమాను చూసేసే ఉంటారు. అయినప్పటికీ జాక్ మంజు ధైర్యం చేసి కన్నడ హక్కులను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆయనకు తీవ్ర నష్టం వచ్చింది. ఈ సినిమాతో పాటు అజిత్ సూపర్ హిట్ తమిళ్ మూవీ ‘వివేగం’ను కూడా జాక్ మంజు కన్నడలో విడుదల చేశారు. ‘కమాండో’ అనే టైటిల్‌తో ఈ చిత్రం కన్నడలోకి అనువాదమైంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here