రక్త కల్లోలం

0
3


రక్త కల్లోలం

జిల్లాలో విజృంభిస్తున్న డెంగీ జ్వరాలు

రక్త ఫలకికలు నిల్వ చేసే బ్యాగుల కొరత

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

తగ్గని వర్షాలు.. తరగని దోమలు.. తాపీగా అధికారులు.. వెరసి జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒకవైపు రక్త ఫలకికల(ప్లేట్‌లేెట్ల) సంఖ్య తగ్గుతుంటే.. మరోవైపు రోగుల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్ల క్రితం జిల్లాలో 570 డెంగీ కేసులు నమోదైతే ఈ సంవత్సరం ఇప్పటి వరకే 406కు చేరింది. జిల్లాలో రక్త ఫలకికలు అందుబాటులో లేక వైద్యం ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇదే అదనుగా భావించిన వైద్యులు రోగులను భయభ్రాంతులకు గురి చేసి అందినకాడికి దండుకొంటున్నారు. శనివారం ఆస్పత్రుల్లో ‘ఈనాడు- ఈటీవీ’ పరిశీలన చేసింది.

ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచి దోమలు విపరీతంగా పెరుగుతుండటంతో డెంగీ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో జిల్లాలో రక్త ఫలకికలు నిల్వ చేసే బ్యాగుల కొరత ఉండటం ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో ఉన్న ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో, రెడ్‌క్రాస్‌, పలు ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత ఉంది. రక్త ఫలకికలు తయారు చేసేందుకు సరిపడా రక్తం ఉన్నా వాటిని నిల్వ చేసేందుకు ప్యాకెట్లు లేకపోవడంతో రోగులు ప్రాణభయంతో హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు.

 

అధికారులకు తెలుసా..?

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రెండు రోజులుగా రక్త ఫలకికలు వేరు చేయడం నిలిపివేశారు. రెడ్‌క్రాస్‌, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో వారం క్రితమే కొరత ఏర్పడింది. ఇంత జరుగుతున్నా ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ప్యాకెట్ల కొరత ఉన్న విషయం అధికారులకు తెలుసా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

జిల్లా కేంద్రంలోనే ఎక్కువ కేసులు

జిల్లా స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ అధికారులు ఉన్న జిల్లా కేంద్రంలోనే ఎక్కువ డెంగీ కేసులు నమోదవుతుండడం శోచనీయం. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 406 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో 250 కేసులు జిల్లా కేంద్రంలోనే గుర్తించడం గమనార్హం.

మొదటి నుంచి ఇదే పరిస్థితి

అధికారులు పరిశుభ్రత, ఆరోగ్యం పేరుతో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. జ్వరాల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరంలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక తీరిగ్గా మూడు రోజుల క్రితం ఇంటింటికి వెళ్లి డెంగీ కేసులు పరిశీలించడం, స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. వీటిని నెల రోజుల క్రితమే చేసి ఉంటే నగరంలో ఇన్ని జ్వరాల కేసులు ఉండేవి కాదు.

రక్తపరీక్షలకు బారులు

చిన్నాపెద్ద తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తుండడంతో రోగులకే డెంగీ అనుమానం ఆందోళనకు గురి చేస్తోంది. భయంతో రక్తపరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో రోజూ 65- 70 మంది పరీక్షల కోసం వస్తున్నారు. వారిలో 10- 12 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధరణ అవుతోంది. ఇక్కడ ఒక్కటే ఈ పరిస్థితి ఉంటే జిల్లా వ్యాప్తంగా జ్వరాలకు వైద్యం చేసే సుమారు 120 ఆస్పత్రుల్లో ఇంకెంత మరది ఉంటారో ఊహించవచ్ఛు.

న్యూస్‌టుడే, మోర్తాడ్‌ : మోర్తాడ్‌లో గోవిందరెడ్డి కాలనీకి చెందిన కృష్ణవేణి(27) అనే వివాహిత డెంగీ జ్వరంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… వారం రోజులుగా ఆర్మూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించిందన్నారు.


పెరుగుతున్న ఖర్చు

కుప్పలుతెప్పలుగా రోగులు డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతుండటంతో ఇదే అదనుగా భావించిన వైద్యులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ జ్వరంతో రక్త ఫలకికలు తగ్గినా రోగులను భయపెట్టి ఐసీయూలో ఉంచడం, గంటకోసారి రక్త పరీక్షలు చేస్తూ వేల రూపాయల బిల్లు వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేటు వైద్యాలయాలను పరిశీలించిన దాఖలాలు లేవు. ఆకస్మిక తనిఖీలు చేస్తే ఈ దోపిడీి వెలుగు చూసే అవకాశం ఉందని రోగులు చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here