రక్షణ స్తంభాలుంటే.. ప్రాణం నిలిచేది..

0
0


రక్షణ స్తంభాలుంటే.. ప్రాణం నిలిచేది..

ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకొని ఉంటే అర్జున్‌రావు బతికేవారు..

ఆలస్యమే ప్రమాదానికి కారణమైంది..


రహదారి పక్కనే లేని రక్షణ స్తంభాలు

సారంగాపూర్‌, న్యూస్‌టుడే : రహదారి నిర్వహణ లోపం, ప్రయాణికుల నిర్లక్ష్యంగా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యా పిల్లలతో చక్కగా సాగిపోయే వారి కుటుంబంలో చీకటి నింపింది. విధుల్లో భాగంగా సమావేశానికి హాజరై వస్తూ బ్యాంకు ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు. శుక్రవారం రాత్రి సారంగాపూర్‌ మండలం నిర్మల్‌-ఆదిలాబాద్‌ రహదారిపై మహబూబ్‌ఘాట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో చిన్నపాటి పొరపాట్లకు విలువైన ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ప్రమాదంలో నిర్మల్‌ పట్టణం శివాజీ ఛౌక్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న కె.అర్జున్‌రావు(41) మృతి చెందగా, ఫీల్డ్‌ ఆఫీసర్లు పెండ్యాల మహేష్‌(28)కు తీవ్ర గాయాలుకాగా, చుండ్రు వివేక్‌(28) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బోధన్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన అర్జున్‌రావు 2008లో ఉద్యోగంలో చేరారు. ముథోల్‌లో బ్రాంచ్‌లో పనిచేసిన ఆయన ఇటీవలే నిర్మల్‌కు బదిలీపై వచ్చి ఇలా ప్రమాదంలో మృతి చెందడం వారి కుటుంబాన్ని దుఃఖసారగంలో ముంచివేసింది. మృతుడు అర్జున్‌రావుకు భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్నికి చెందిన వివేక్‌ నిర్మల్‌లోనే నివాసముంటూ ఉద్యోగం చేస్తుండగా మహేష్‌ది నల్గొండ జిల్లా నర్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌ గ్రామం. మూడు వేర్వేరు బ్రాంచ్‌లలో పనిచేస్తున్న వీరు విధి నిర్వణలో భాగంగా ముగ్గురు కలిసి శుక్రవారం ఉదయం ఆదిలాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలంలో ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ ఆఫీసర్ల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది.

సమావేశ ఆలయస్యమే ప్రాణాలు తీసింది

ఆదిలాబాద్‌ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం చాలా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8.45కు ముగిసినట్లు సహ ఉద్యోగులు చెబుతున్నారు. రాత్రి సమయంలో బయలుదేరడం, త్వరగా ఇంటికి వెళ్లాలనే ఆత్రుత, చీకటిలో చేసిన ప్రయాణమే ప్రమాదానికి కారణంగా సన్నిహితులు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటలకు సమావేశం ముగిసి ఉంటే 6 గంటలకు నిర్మల్‌కు చేరేవారని, వెలుతురులో ప్రయాణం సురక్షితంగా సాగేదని అంటున్నారు.

భార్య, పిల్లలతో అర్జున్‌రావు (పాత చిత్రం)

రక్షణ స్తంభాలుంటే ప్రాణాలు పోయేవికావు..

మహబూబ్‌ఘాట్‌ మూడు ప్రధాన మలుపులు దిగుతూ వీరు ప్రయాణిస్తున్న కారు చివరకు చేరుకుంది. చిన్నపాటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఎడమకు మలపడంతో ఒక్కసారిగా కారు రహదారిపై బోల్తాపడింది. తిరిగి యథాస్థితికి చేరి రహదారి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి 20 అడుగుల లోయలో బలంగా పడిపోయింది. సీటుబెల్టు పెట్టుకోక పోవడంతో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోక ముందు సీటులో కూర్చున్న అర్జున్‌రావు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మూల మలుపు వద్ద రహదారికి పక్కన రక్షణ స్తంభాలు ఏర్పాటు చేసుంటే వాహనం లోయలో పడేదికాదని అక్కడి పరిస్థితిని చూస్తే స్పష్టమవుతుంది. విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనకపోయినా.. వాహనం మరింత ముందుకు వెళ్లి నిలిచి ప్రాణాపాయం తప్పేదని స్థానికులు అంటున్నారు. వీరి వాహనం వెనక ఉన్నవారు చూస్తుండగానే కారు లోయలో పడిపోయింది. వెంటనే వారు క్షతగాత్రులను బయటకు తీశారు. మలుపుల వద్ద సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మూడో ప్రమాదంలో మృతి

అర్జున్‌రావును గతంలోనూ రోడ్డు ప్రమాదాలు వెంటాడాయి. కుటుంబ సభ్యులతో వస్తుండగా వానల్‌పాడ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిర్మల్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలైనా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలను కాపాడుకోలేక పోయారు. ఆయన మృతి కుటుంబ సభ్యుల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. శనివారం పోస్టుమార్టం అనంతరం అర్జున్‌రావు మృతదేహాన్ని స్వగ్రామం ఖాజాపూర్‌కు తరలించ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here