రవితేజ త్యాగం.. శర్వానంద్‌కు ‘రణరంగం’ దానం!

0
0


యంగ్ హీరో శర్వానంద్ తన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రణరంగం’తో తన అభిమానులను, సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైపోయారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. శర్వా హిట్టుకొట్టడం ఖాయం అనిపించేలా ఉంది ట్రైలర్. శర్వానంద్ కెరీర్‌లోనే ఇది ఒక విభిన్న చిత్రంగా మిగిలిపోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే, ‘రణరంగం’ సినిమాపై తాజాగా బయటికివచ్చిన ఒక ఆసక్తికర విషయం హాట్ టాపిక్‌గా మారింది. మాస్ మహారాజా రవితేజ త్యాగం చేయడం వల్ల ‘రణరంగం’ స్క్రిప్ట్ శర్వానంద్ వద్దకు వచ్చిందని అంటున్నారు. మొదట సుధీర్ వర్మ ఒక స్క్రిప్ట్‌ను శర్వానంద్‌కు నెరేట్ చేశారట. ఆ స్క్రిప్ట్ శర్వానంద్‌ను బాగా ఆకట్టుకుందట. అయినప్పటికీ, మరో ప్లాట్ ఉంటే చెప్పగలరా అని సుధీర్ వర్మను శర్వానంద్ అడిగారట. అప్పుడు ఆయన ‘రణరంగం’ కథను శర్వాకు చెప్పారట. ఈ కథకు ముగ్దుడైపోయిన శర్వా ఇది చేద్దాం అని సుధీర్‌తో అన్నారట.

కానీ, ఈ కథను అప్పటికే రవితేజకు చెప్పేశానని, ఆయన కూడా ఓకే చేసేశారని శర్వాకు సుధీర్ వర్మ చెప్పారట. అయితే, రవితేజ నుంచి అనుమతి తీసుకుంటే తనతో ఈ సినిమా చేస్తారా అని సుధీర్‌ను శర్వా అడిగారని సమాచారం. రవితేజ ఒప్పుకుంటే నాకు ఇబ్బంది ఏమీలేదని సుధీర్ చెప్పారట. ఆ తరవాత రవితేజను శర్వానంద్ సంప్రదించడం, మాస్ మహారాజా మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగిపోయిందని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ టాక్. రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘రణరంగం’ కోసం శర్వానంద్, సుధీర్ వర్మ జతకట్టారని తెలిసింది.

ఇదిలా ఉంటే, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శర్వానంద్ రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 10 నిమిషాలు. మరోవైపు, ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here