రుణాలు సరే… మొండి బాకీల సంగతేమిటి?

0
2


రుణాలు సరే… మొండి బాకీల సంగతేమిటి?

మందగమనం లోకి జారుకొంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేలా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చర్యలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే దేశంలోని 400 జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహించి పెద్ద ఎత్తున వ్యక్తిగత, గృహ, వాహన రుణాలతో పాటు, బిజినెస్ లోన్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదేశించారు. దీనికి ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి కూడా స్పందన లభిస్తోంది. ఆటోమొబైల్ రంగంతో పాటు, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాలు క్షీణించిన వేల అన్ని రకాల రుణాలు ఉదారంగా ఇవ్వాలన్నది ఆర్థిక మంత్రి ఉద్దేశం. ఈ నిర్ణయం స్వల్ప కాలానికి బాగానే ఉన్నప్పటికీ… మధ్యకాలిక, దీర్ఘకాలంలో మాత్రం పరిణామాలు విపరీతంగా ఉంటాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ఏ చిన్న, మధ్య తరహా కంపెనీని కూడా ఎన్ పీ ఏ గా ప్రకటించ కూడదు అన్న ఆర్థిక మంత్రి ధోరణి ఇందుకు మరింత ఊతమిస్తోంది విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పేరుకుపోయిన బ్యాంకుల నిరర్థక ఆస్తులు మరింతగా పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు.

ఇంకా కోలుకొని ప్రభుత్వ బ్యాంకులు…

కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ సహా కొన్ని కార్పొరేట్ కంపెనీల ఎగవేతలు ప్రభుత్వ రంగంలోని దాదాపు అన్ని బ్యాంకులను ఇబ్బందులకు గురి చేసాయి. నిరర్థక ఆస్తులు పెరిగిపోవటంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలు మూటకట్టుకున్నాయి. అయితే, ఇప్పుడిప్పుడే కోలుకొని మళ్ళీ బ్యాంకులు లాభాల బాట పడుతున్న సమయంలో తొందరపాటు రుణాలు ఇవ్వడం భారత ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మేలు చేయదని నిపుణులు యోచిస్తున్నారు.

వినియోగం పెరుగుతుంది…

అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వరంగ బ్యాంకులు గత కొంత కాలంగా అసలు రుణాల మంజూరుకు ఆసక్తి చూపటం లేదు. దీంతో వ్యవస్థలోకి ద్రవ్య లభ్యత సరిపడినంత ప్రవేశించటం లేదు. దీంతో ఆటోమొబైల్ సహా అన్ని రంగాల్లోనూ అమ్మకాలపై ఒత్తిడి కనిపిస్తోంది. వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో కొంత సులభంగా ఎక్కువ మొత్తంలో రుణాలు లభిస్తే మళ్ళీ వినియోగం పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగు అవుతుందని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు. రుణ మేళ సందర్భంగా ఇచ్చే రుణాల సగటు కార్పొరేట్ రుణాలతో పోల్చితే తక్కువగా ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా తక్కువేనని ఆశిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ఏకీభవిస్తున్నాయి.

సెంటిమెంట్ మారింది…

కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీసుకొన్న సంచలన నిర్ణయంతో దేశంలో ఒక్క సారిగా సెంటిమెంట్ మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏ రంగంలోని కంపెనీ ఐన… సగటున 8% మేరకు లబ్ది పొందుతుందని, తద్వారా కార్పొరేట్ కంపెనీలు మార్కెటింగ్, ప్రకటనలు, డివిడెండ్లు, ఉద్యోగులకు బోనస్ లు ప్రకటించే అవకాశం అధికమైందని పేర్కొంటున్నారు. దీంతో కూడా వినియోగదారుల్లో సానుకూల ధోరణి ఏర్పడుతుందని, నిన్న మొన్నటి వరకు ఉద్యోగం ఉంటుందో పోతుందో అని భయపడిన వారు, ఇప్పుడు బోనస్ గురించి చర్చించుకొంటారని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ కంపెనీ యజమాని ఒకరి వెల్లడించారు.

చిన్న కంపెనీలకు ఊరట…

నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో చితికి పోయిన చిన్న వర్తకులు, మధ్య తరహా కంపెనీలకు రుణ మేళా పెద్ద ఊరటగా చెప్పవచ్చు. కొన్ని కారణాలతో వాయిదాలు చెల్లించని కంపెనీలు సైతం వర్కింగ్ కాపిటల్ లోన్స్ తీసుకొని వాటిని సర్దుబాటు చేసుకొనే అవకాశం లభిస్తుందని ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజర్ ఒకరు వ్యాఖ్యానించారు. చాలా కాలంగా మంచి ట్రాక్ రికార్డు ఉంది, కొన్ని స్వల్పకాలిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇలాంటి వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయన్నారు. దీంతో నిరర్థ ఆస్తులు పెరగకుండా చూసుకునేందుకు ఒక అవకాశం వారికి లభిస్తుందని చెప్పారు. అదే సమయంలో అమ్మకాలను పెంచుకునేందుకు సంస్థలకు ఇదొక అద్భుత అవకాశం అని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here