రైతుబంధువు కాదేమి..

0
7


రైతుబంధువు కాదేమి..

ఇంకా అందని సాయం

అయోమయంలో కర్షకులు

ఖరీఫ్‌ మొదలై రెండు నెలలు గడుస్తున్నా రైతుబంధు సాయం నేటికీ అందలేదు. వరుసగా కురుస్తున్న వర్షాలకు సాగు పనులు ముమ్మరమయ్యాయి. పెట్టుబడి సాయానికి కర్షకులు వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

రైతు బంధు పథకం ద్వారా ఈసారి సీజన్‌కు రూ.5 వేల చొప్పున అందించాల్సి ఉంది. ఈ మేరకు మొదటగా అయిదు ఎకరాల లోపు సన్న, చిన్నకారు రైతుల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఖజానా శాఖకు పంపించగా.. వీరి బ్యాంకు ఖాతాల్లో మే నెల చివరి వారం నుంచి జూన్‌ నెలాఖరు లోగా నగదు జమైంది. తర్వాత అయిదు ఎకరాలకు పైన ఉన్నవారి వివరాలు పంపించినప్పటికీ కొందరికి మాత్రమే డబ్బులు అందాయి. ఇంకా మరికొందరికి సాయం అందలేదు. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు నవీకరణ చేసుకొనేందుకు రైతులు వెనుకాడుతున్నారు. కొత్త రుణాల మంజూరులో బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. ఇటు పెట్టుబడి సాయం అందక, అటు బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వక అనేక మంది రైతులు ప్రైవేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఇదీ పరిస్థితి

జిల్లాలో మొత్తం 2,41,175 మంది రైతులుండగా ఇందులో 2,21,336 మంది నుంచి వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకు ఖాతాలను సేకరించారు. ఇందులో 2,13,261 మంది వివరాలను మాత్రమే ఖజానా శాఖకు పంపించారు. మరో 8,075 మంది వివరాలు పంపించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఖజానాకు పంపించిన వారిలో 1,78,754 మంది ఖాతాల్లో మాత్రమే రూ.169.93 కోట్లు జమ అయ్యాయి. మిగతా 34,501 మందికి ఇంకా రూ.63.05 కోట్లు జమ కావల్సి ఉంది.

డిజిటల్‌ చిక్కులు

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో 19,839 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హత పొందలేకపోయారు. జూన్‌ 10 వరకు పాసుపుస్తకాలపై తహసీల్దారు డిజిటల్‌ సంతకం పూర్తయిన వారినే అర్హులుగా గుర్తించి వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తహసీల్దారు రైతు వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసి వేలిముద్రతో డిజిటల్‌ సంతకం చేస్తేనే పాసుపుస్తకం ఇస్తారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.

రబీలో అసంపూర్ణమే..

గతేడాది రబీలోనూ రైతుబంధు సాయం అందరికీ అందలేదు. 2,08,630 మంది రైతులకు గాను 2,05,236 మంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. సాంకేతిక కారణాలతో 3,394 మందికి సాయం అందకుండా పోయింది. బ్యాంకు ఖాతాల వివరాలు తప్పుగా ఇవ్వడం వల్లనే నగదు జమ కాలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నిరక్షరాస్యత మూలంగా జుక్కల్‌, మద్నూర్‌ మండలాలకు చెందిన కొందరు రైతులు ఇప్పటికీ అధికారులకు బ్యాంకు ఖాతాలు సమర్పించలేదు.

అందరికీ సాయం

– నాగేంద్రయ్య, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, కామారెడ్డి

రైతుబంధు ద్వారా అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుంది. జూన్‌ 10 లోపు డిజిటల్‌ సంతకాలు పూర్తయిన వారి వివరాలను ఖజానా శాఖకు పంపించాం. వీరందరికి నగదు జమ అవుతుంది. ఆ తర్వాత పాసుపుస్తకాలు వచ్చిన వారికి వచ్చే రబీలో అందనుంది.

రైతుబంధు వివరాలు

మొత్తం రైతులు 2,41,175

జమ కావల్సిన నగదు రూ. 251.87 కోట్లు
సాయం అందిన రైతులు 1,78,754

అందిన సాయం రూ. 169.93 కోట్లుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here