లెక్క తేల్చారు శిక్ష మరిచారు

0
2


లెక్క తేల్చారు శిక్ష మరిచారు

తాడ్వాయి పంచాయతీలో నకిలీ రశీదుల కలకలం

స్వాహా మొత్తం రూ.30 లక్షలకు పైనే

నకిలీ రశీదులతో ప్రజలు చెల్లించిన పన్నులు స్వాహా చేసిన ఘటన తాడ్వాయి పంచాయతీలో వెలుగులోకి వచ్చి నెలరోజులు గడుస్తోంది. అవినీతి దందా బయట పడిన వెంటనే అధికారులు హడావుడి చేశారు. వారం రోజుల పాటు గ్రామంలో మకాం వేసి ఆధారాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టి ఎంత మేర దుర్వినియోగం జరిగిందో లెక్కలు తీశారు. ఇంత వరకు బాగానే ఉన్నా కారకులపై చర్యలకు ఉపక్రమించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

తాడ్వాయి పంచాయతీలో జూన్‌ 28న జరిగిన గ్రామసభలో కారోబార్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు అధికారుల దృష్టికి తెచ్చారు. పన్నులను కాజేస్తున్న తీరును ఆధారాలతో సహా నిరూపించారు. రంగంలోకి దిగిన అధికారులు వివరాలు సేకరించారు. నకిలీ రశీదు పుస్తకాలతో పన్నుల సొమ్మును స్వాహా చేసిన తీరును చూసి నివ్వెరపోయారు. రూ.8 లక్షల స్వాహాకు సంబంధించిన ఆధారాలు విచారణ బృందానికి లభించాయి. ఇదే విధంగా మరో రూ.23 లక్షల వరకు నిధులు కాజేసినట్లు ప్రాథమిక ఆధారాలు దొరికాయి. నిబంధనల ప్రకారం విచారణ ముగిసిన వెంటనే పంచాయతీ అధికారులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసి చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఇంత వరకు అడుగులు పడలేదు. అవినీతి దందాను తారుమారు చేసేందుకు రాజకీయ నేతలు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. రూ.30 లక్షలకు పైగా దుర్వినియోగం జరిగినప్పటికీ ఎంతో కొంత పంచాయతీకి కట్టించి మమ అనిపించేందుకు యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తీగ లాగితే డొంక కదులుతుందనే భయంతో ఉన్నతాధికారులు కారోబార్‌పై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

పంచాయతీలో దస్త్రాలను పరిశీలిస్తున్న అధికారులు (పాతచిత్రం)

నిబంధనల ప్రకారం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసి వ్యక్తుల మీద రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి స్వాహా చేసిన మొత్తాన్ని రాబట్టాల్సి ఉంది. నిధుల దుర్వినియోగానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. గత ఎనిమిదేళ్లుగా పంచాయతీలో నకిలీ రశీదులతో పన్నుల మొత్తాన్ని కాజేస్తున్నా పర్యవేక్షణ అధికారులు ఏం చేశారనే దానిపై విమర్ళలు వెల్లువెత్తుతున్నాయి.

కారోబార్లదే పెత్తనం

గతంలో పంచాయతీ కార్యదర్శుల కొరత నేపథ్యంలో పల్లెల్లో కారోబార్లే పెత్తనం చెలాయించేవారు. అయిదారు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. వీరు కేవలం మండల కార్యాలయాలకే పరిమితమయ్యేవారు. ఇంటి, కుళాయి పన్నుల వసూళ్లను పూర్తిగా కారోబార్ల మీదనే వదిలేశారు. అరకొర వేతనాలతో పనిచేసే వీరు పలు పంచాయతీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ రశీదులతో స్వాహా పర్వం ఇతర చోట్ల ఏమైనా ఉందా.. అనేదానిపై విచారణ చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here