వంతెన.. వంచన

0
2


వంతెన.. వంచన

వారధి దాటని నేతల మాటలు

ఏళ్లుగా ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

ఇప్పటి వరకు ఉమ్మడి సర్వేనే చేయలేదు

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

ప్రధాన మార్గం… నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ దారిలో 50 సార్లు రైల్వే గేటు పడుతోంది.. అంటే ఒక రోజులో దాదాపు ఐదు గంటలు గేటు మూసివేస్తున్నారు. ప్రతిసారి వందలాది వాహనాలు బారులు తీరుతున్నాయి. అత్యవసర పని ఉన్నా.. కొనఊపిరితో కొట్టు మిట్టాడుతూ అంబులెన్సులో ఉన్నా ఆగిపోవాల్సిందే.

– ఇవి మాధవనగర్‌ వద్ద వాహనదారుల అవస్థలు!!


నిజామాబాద్‌ జంక్షన్‌కు రైళ్ల తాకిడి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్‌ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లు కేవలం పదిలోపే ఉండేవి. ఇప్పుడు 50కి పైగా తిరుగుతున్నాయి. ప్రధాన రహదారిగా ఉన్న మాధవనగర్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. ఏళ్లుగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రయాణికుల విన్నపాలు పట్టించుకొనే వారే కరవయ్యారు. రోజురోజుకూ సమస్య తీవ్రరూపం దాల్చుతున్నా వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చడం లేదు. గేట్ల మరమ్మతు కారణంగా శుక్రవారం మూసి వేస్తున్నారు. దాదాపుగా 34 గంటలు బైపాస్‌ రోడ్డుగుండా ప్రయాణించక తప్పని పరిస్థితి కల్పించారు.

మార్పులు.. చేర్పులు

* మాధవనగర్‌ రైల్వేక్రాసింగ్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌వోబీ) నిర్మాణానికి 2013లో అనుమతి లభించింది. రెండు లైన్లతో కూడిన వంతెన నిర్మాణానికి అనుమతులొచ్చాయి. నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగలేదు.

* 2014లో ఆర్‌వోబీ ప్రతిపాదనలను మార్చారు. నాలుగు లైన్ల ఆర్‌వోబీను మంజూరు చేశారు. తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు అతీగతీ లేదు.

* ఈ ఏడాది ఆగస్టులో గేటు వద్ద ట్రాఫిక్‌ పరిస్థితిపై విశ్లేషణ నివేదిక సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఆ తర్వాతి ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రోడ్లు, భవనాల శాఖ మంత్రికి లేఖ కూడా రాశారు.

ఇప్పటి వరకు సర్వేనే చేయలేదు

* 2013లో ఇక్కడ వంతెన మంజూరైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటాతో వంతెనను పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పూర్తి చేసి అందులో సగం మొత్తాన్ని జమ చేయాలి. అప్పుడే కేంద్రం తన వాటాను విడుదల చేసి పనులు పూర్తి చేస్తుంది. ● ఇదంతా జరగాలంటే ఆర్‌ఆండ్‌బీ, రైల్వే, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనలు పూర్తి చేస్తే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఈ సర్వేనే పూర్తికాలేదు.

* గతంలో రెండు లైన్ల వంతెన కోసం సర్వే పూర్తయ్యింది. ప్రస్తుతం నాలుగు లైన్ల వంతెన నిర్మాణానికి ఈ ప్రక్రియ పూర్తయితే గానీ పనులు ప్రారంభానికి నోచుకోవు.

* పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంపై ఎలాంటి ప్రభావం లేకుండా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని, అందువల్లే జాప్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రూ.120 కోట్లు

* నాలుగు లైన్ల వంతెన నిర్మాణం కోసం సుమారుగా రూ.120 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా సర్వే పూర్తయితే స్పష్టత వస్తుంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా సగం నిధులను విడుదల చేస్తే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మిగిలిన నిధుల్ని విడుదల చేసి పనులను ప్రారంభిస్తుంది.

* సంయుక్త సర్వే పూర్తి చేసేందుకు మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసేందుకు మరో 2 నెలలు, పనులు అప్పగించేందుకు నెల ఇలా.. మరో ఆరు నెలలు గడిస్తే గానీ పనులు ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదు.

ట్రాఫిక్‌ సమస్య తీవ్రం

మాధవనగర్‌ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ట్రాఫిక్‌ ఎనాలిసిస్‌ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకసారి గేటు పడడంతో 5-15 నిమిషాలు ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రెండువైపులా సుమారు 200-300 వాహనాలు నిలుస్తుంటాయి. హైదరాబాద్‌కు నిత్యం పదుల సంఖ్యలో అంబులెన్సులు వెళ్తుంటాయి. గేటు పడిన ప్రతిసారి ఈ అంబులెన్సులన్నీ మధ్యలోనే నిలుస్తాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here