వన్డేల్లో కోహ్లీ బాదే సెంచరీలు ఎన్నో తెలుసా?: ఇది వసీం జాఫర్ అంచనా

0
3


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కనీసం 75-80 సెంచరీలు చేస్తాడని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 120 పరుగులతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ కావడం విశేషం.

విరాట్ కోహ్లీ 42వ సెంచరీపై వసీం జాఫర్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించాడు. “11 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ మళ్లీ బ్యాట్ ఝళిపించాడు, నా అంచనా ప్రకారం.. విరాట్ కోహ్లీ తన కెరిర్‌లో వన్డేల్లో 75-80 సెంచరీలు నమోదు చేస్తాడు” అంటూ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు.

మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, దినేశ్ కార్తీక్ లాంటి ఆటగాళ్లతో కలిసి వసీం జాఫర్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌లు ఆరంభించాడు. భారత్ తరపున 31 టెస్టులు ఆడిన వసీం జాఫర్ 34.11 యావరేజితో 1944 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించడంతో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేయడంతో.. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ గంగూలీ (11,363)ని వెనక్కి నెట్టాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ 11,406 పరుగులతో రెండో స్థానానికి ఎగబాకాడు. గంగూలీ 311 మ్యాచ్‌ల్లో సాధించిన పరుగులను కోహ్లీ 238వ వన్డేలోనే అధిగమించడం విశేషం. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కోహ్లీకి ఇది విండిస్ జట్టుపై 8వ సెంచరీ. అంతకముందు ఆస్ట్రేలియా, శ్రీలంకపై కూడా కోహ్లీ ఎనిమిదేసి సెంచరీలు చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు జట్లపై 8 సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ప్రత్యర్థిపై సచిన్ (9, ఆస్ట్రేలియాపై) తర్వాత ఎక్కువ సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

వెస్టిండిస్ జట్టుపై కోహ్లీ సాధించిన 8 సెంచరీల్లో ఆరు సెంచరీలు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసినవే కావడం విశేషం. ఒక ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో పాటు విండిస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు (2031) చేసిన బ్యాట్స్‌మన్‌గా 26 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ (1930)నెలకొల్పిన రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ విండీస్‌పై 64 మ్యాచ్‌లాడి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే దానిని అధిగమించాడు. ఇక, ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ మార్క్‌వా 47 మ్యాచ్‌ల్లో 1708 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here