వాటాలు అమ్మి రూ.90,000 కోట్ల సమీకరణ, అమ్మకానికి ఆస్తులివే..!

0
2


వాటాలు అమ్మి రూ.90,000 కోట్ల సమీకరణ, అమ్మకానికి ఆస్తులివే..!

ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.90,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమైంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు సహా వివిధ ఉద్దీపన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులను సమీకరించనుంది.

ఓ వైపు కార్పోరేట్ పన్ను తగ్గింపుతో పాటు వివిధ ఉద్దీపనలు, మరోవైపు నిరాశాజనక జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో రెవెన్యూ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ రంగాల్లోని ఆస్తుల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల వరకు సమకూర్చుకునేందుకు ప్రణాళికను రూపొందించింది. విమానయాన రంగంలో రూ.15,000 కోట్లు, విద్యుత్ రంగంలో రూ.20,000 కోట్లు, షిప్పింగ్ రూ.7,500 కోట్లు, రహదారుల రంగంలో రూ.25,000 కోట్లు, రైల్వే రంగంలో రూ.22,000 కోట్ల విలువైన ఆస్తులు విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో కేబినెట్ ఆమోదం కోసం పంపించనుందని సమాచారం.

షెడ్యూల్ ప్రకారం అసెట్స్ సేల్ జరగాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అధ్యక్షత ఏర్పాటైన కమిటీ ఆయా మంత్రిత్వ శాఖలను నిర్దేశించినట్లుగా తెలుస్తోంది. ఈ అసెట్ సేల్ ప్రణాళికకు కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా సారథ్యం వహిస్తున్నారని సమాచారం.

వాటాల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ సెప్టెంబర్ నాటికి రూ.12,357 కోట్లు మాత్రమే సమీకరించింది.

BPCL, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI), THDC, NEEPCలో వాటా విక్రయించనుంది. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌)లో సైతం ముప్పై శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, కాంకర్‌లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.66 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరవచ్చని అంచనా.

విక్రయానికి పెట్టనున్న ఆస్తులు ఇవే…

– ఏవియేషన్ రంగంలో తిరుచ్చి, ఇండోర్, భువనేశ్వర్, వారణాసి, అమృత్‌సర్, రాయపూర్‌లోని విమానాశ్రయాలు.

– విద్యుత్ రంగంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్‌కు చెందిన విద్యుత్ సరఫరా లైన్లు.

– నౌక రవాణా రంగంలో పోర్ట్ ట్రస్ట్ నిర్వహణలో ఉన్న బెర్తులతో సహా మొత్తం 11 షిప్పింగ్ ఆస్తులు.

– జాతీయ రహదారుల విషయానికి వస్తే మొత్తం 25,000 కిలో మీటర్ల రోడ్డు ప్రాజెక్టులు.

– రైల్వేలో 150 పాసింజర్ రైళ్ల ప్రయాణ నిర్వహణ ప్రైవేటు వర్గాలకు అప్పగింత.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here