వాట్సప్‌తో పోలీసులకు ఫిర్యాదు.. నిర్మల్ జిల్లా ముందడుగు..!

0
1


వాట్సప్‌తో పోలీసులకు ఫిర్యాదు.. నిర్మల్ జిల్లా ముందడుగు..!

నిర్మల్ : నేరాల నియంత్రణకు టెక్నాలజీ వాడేస్తున్నారు తెలంగాణ పోలీసులు. గతంలో నేరస్థులను పట్టుకోవాలంటే తలకు మించిన భారంగా ఉండేది. కానీ, సాంకేతికతను అందిపుచ్చుకుని గంటలు, రోజుల వ్యవధిలో నేరస్థులను పట్టుకుంటున్నారు. ఆ క్రమంలో నిర్మల్ జిల్లా పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ప్రజల నుంచి వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా.. ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేస్తే వెంటనే స్పందిస్తామన్నారు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు.

టెక్నాలజీతో దూసుకెళుతున్న నిర్మల్ పోలీసులు

నిర్మల్ జిల్లా పోలీసులు టెక్నాలజీ పరంగా దూసుకెళుతున్నారు. అందులోభాగంగా నేరాల నియంత్రణకు మరో అడుగు ముందుకేశారు. ఆ క్రమంలో వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు గానీ.. ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు గానీ.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు రాకుండా వాట్సప్ నంబర్‌కు సదరు సమస్య తెలియజేస్తే చాలు.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు వాట్సప్ నెంబర్ 8333986939 ఆవిష్కరించారు. శనివారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాట్సాప్ నంబర్‌ను ప్రజోపయోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరుగా ఫిర్యాదు చేయలేనివారు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు.. వాట్సాప్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తే చాలు.. యాక్షన్..!

వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తే చాలు.. యాక్షన్..!

నేరాలు జరిగినప్పుడు ఎవరైనా సరే ఈ వాట్సప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్, రోడ్డు ప్రమాదాలపై వెంటనే స్పందించి ఫోటోలు, వీడియోలు తీసి వాట్సాప్ నంబరుకు పంపిస్తే బాధితులకు సహాయం చేసే వీలుంటుందని తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

సామాజిక బాధ్యతగా మెలగాలి : ఎస్పీ

సామాజిక బాధ్యతగా మెలగాలి : ఎస్పీ

మారుతున్న కాలానికి తగ్గట్లుగా టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వచ్చిందని.. అయితే దాన్ని సద్వినియోగ పరుచుకోవాలని పిలుపునిచ్చారు ఎస్పీ. ఏదైనా ఘటన జరిగినప్పుడు తమకెందుకులే అని వెళ్లిపోకుండా.. పోలీసుల వాట్సప్ నంబరుకు వివరాలు పంపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియా బాగా యాక్టివ్‌గా మారిన తరుణంలో ప్రతి ఒక్కరు దీన్ని తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంలో వాట్సప్ నంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ నంబర్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తుందని ఎస్పీ వివరించారు.

వివరాలు గోప్యంగా ఉంచుతాం : ఎస్పీ

వివరాలు గోప్యంగా ఉంచుతాం : ఎస్పీ

పోలీసుల వాట్సప్ నంబరుకు ఫిర్యాదులు చేసినవారు, సమాచారం అందించిన వారి వివరాలు బయటకు వెల్లడించే ప్రసక్తి లేదని తెలిపారు. వాట్సప్ నంబర్‌కు వివరాలు పంపితే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వెల్లడించారు. అన్ని సమయాల్లో వాట్సప్ సేవలు అందుబాటులో ఉండే విధంగా ఐటీ కోర్ టీమ్‌కు అనుబంధంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాట్సప్ ద్వారా ఫిర్యాదులకు, సమాచారానికి సంబధించి వెంటనే ఆ పరిధిలోని డీఎస్పీలను, ఇన్‌స్పెక్టర్లను అలర్ట్ చేస్తామన్నారు. ఆ రకంగా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకునే వీలుంటుందని చెప్పారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here