వామ్మో ఏం స్కెచ్.. విశాఖ భారీ దోపిడీ కేసులో ట్విస్ట్.. బాధితుడే అలా..!

0
2


వామ్మో ఏం స్కెచ్.. విశాఖ భారీ దోపిడీ కేసులో ట్విస్ట్.. బాధితుడే అలా..!

విశాఖ : బుధవారం మధ్యాహ్నం గాజువాకలో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. పోర్టు రోడ్డులో పట్టపగలే దుండగులు రెచ్చిపోయి తనపై దాడి చేసి 20 లక్షల రూపాయలు దోచుకెళ్లారని బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను అనుసరించిన ఇద్దరు దుండగులు పోర్టు రోడ్డుకు చేరుకోగానే అటాక్ చేశారని తెలిపాడు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో నిందితుడిని పట్టుకోవడం హాట్ టాపికయింది. అయితే ఈ కేసులో పోలీసులు ముందుగా ఊహించినట్లే జరగడం కొసమెరుపు.

పనిచేస్తున్న సంస్థకే ఎసరు

నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ రావు.. గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాలోని సిరి ట్రాన్స్‌పోర్టులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కంపెనీ పని నిమిత్తం బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి 19 లక్షల రూపాయల క్యాష్ తీసుకుని మంగళవారం నాడు విశాఖపట్నం చేరుకున్నారు. ఆ డబ్బులతో పాటు మరో లక్ష రూపాయలు గాజువాక ఎస్‌బీఐ బ్యాంకు నుంచి బుధవారం నాడు డ్రా చేశారు. ఆ 19 లక్షలకు తోడు ఈ లక్ష రూపాయలు కలిపి మొత్తం 20 లక్షల రూపాయలను కంపెనీ ఖాతాలో జమ చేసేందుకు స్కూటీ మీద బ్యాంకుకు బయలుదేరారు.

20 లక్షల రూపాయల నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని బయలుదేరిన శ్రీనివాస్‌ను ఇద్దరు దుండగులు అనుసరించారని.. ఆ క్రమంలో పోర్టు రోడ్డుకు చేరుకోగానే జన సంచారం తక్కువగా ఉండటంతో తనపై దాడి చేశారని పోలీసులకు తెలిపాడు బాధితుడు. కత్తితో బెదిరింపులకు పాల్పడుతూ స్కూటీ డిక్కీ తెరిచి 20 లక్షలు దోచుకెళ్లినట్లు కంప్లైంట్ చేశాడు. తనపై దాడిచేసి, పిడిగుద్దులు కురిపించి 20 లక్షల రూపాయలతో పరారయ్యారని పేర్కొన్నాడు.

పట్టపగలే చోరీ.. కేసులో ట్విస్ట్

పట్టపగలే చోరీ.. కేసులో ట్విస్ట్

అదలావుంటే ఈ కేసులో ట్విస్ట్ వెలుగుచూసింది. పనిచేసే సంస్థకే కన్నం పెట్టాడు శ్రీనివాస్ రావు. దోపిడీ దొంగలు తనపై అటాక్ చేసి 20 లక్షలు ఎత్తుకెళ్లారని సంస్థను నమ్మించి ఆ సొమ్ము కొట్టేద్దామని ప్లాన్ వేశాడు. అయితే పోలీసులు తమదైన స్టైల్‌లో దర్యాప్తు చేసేసరికి అసలు విషయం బయటపడింది. పట్టపగలే నగరంలో భారీ దోపిడీ జరగడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే చిక్కుముడి విప్పడం విశేషం. ఈ కేసులో బాధితుడే నిందితుడని తేల్చారు పోలీసులు.

బుధవారం మధ్యాహ్నం భారీ దోపిడీ జరగడంతో పోలీస్ కమిషనర్ సహా ఉన్నతాధికారులు పరుగులు పెట్టారు. సంఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అయితే కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు బాధితుడు శ్రీనివాస్ రావు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. చివరకు తమదైన స్టైల్లో ఆరా తీసేసరికి శ్రీనివాస్ రావు కపట నాటకం బయటపడింది.

చోరీ పథకం బెడిసికొట్టిందిగా

చోరీ పథకం బెడిసికొట్టిందిగా

కంపెనీ సొమ్ముపై కన్నేసిన శ్రీనివాస్ రావు 20 లక్షలు కాజేసేందుకు స్కెచ్ వేశాడు. ఆ క్రమంలో భారీ దోపిడీ జరిగినట్లు బిల్డప్ ఇచ్చి బొక్కాబొర్లా పడ్డాడు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా తనపై దుండగులు దాడి చేశారని నమ్మించేందుకు ఒంటిపై గాయాలు కూడా చేసుకున్నాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. పనిచేస్తున్న సంస్థకు కన్నం పెట్టాలనుకున్న క్యాషియర్ శ్రీనివాస్ రావే నిందితుడని పోలీసులు తేల్చారు. ఆ మేరకు శ్రీనివాస్ రావును అరెస్ట్ చేశారు.

దోపిడీ జరిగిన తర్వాత శ్రీనివాస్ రావు చెప్పిన వివరాలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరు దుండగులు 25 సంవత్సరాల లోపు ఉండొచ్చని పోలీసులకు తెలిపిన శ్రీనివాస్ రావు.. వారు ఏ వాహనం మీద వచ్చారో మాత్రం చెప్పలేకపోయాడు. అక్కడే అతడు అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఆ టెన్షన్‌లో వారు ఎలా వచ్చారో గుర్తించలేదని వివరించాడు. దాంతో పోలీసులకు బాధితుడిపై అనుమానం వచ్చింది. ఆ మేరకు దర్యాప్తు చేయగా అతడే నిందితుడని తేలింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here