వీడిన ఉత్కంఠ

0
5


వీడిన ఉత్కంఠ

జిల్లా పరిషత్‌ ఉద్యోగుల విభజన ఖరారు
న్యూస్‌టుడే-జిల్లా పరిషత్‌

పంచాయతీరాజ్‌ ఉద్యోగుల విభజన పూర్తయింది. కొన్ని రోజుల నుంచి ఉన్న ఉత్కంఠకు మంగళవారం రాత్రి తెర పడింది. ఉభయ జిల్లాల పాలనాధికారులు విభజనకు సంబంధించి దస్త్రాలపై పొద్దుపోయిన తర్వాత సంతకాలు చేశారు. నిజామాబాద్‌ జడ్పీకి 55, కామారెడ్డి జడ్పీకి 45 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయించారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు సైతం సిబ్బందిని ఇచ్చారు. ఉద్యోగుల పేర్లు మాత్రం బయట పెట్టకుండా గోప్యంగా ఉంచారు.

మండల పరిషత్‌ కొత్త పాలక వర్గాలు ఈ నెల 4న, జడ్పీలు ఈ నెల 5న కొలువు దీరనున్నాయి. ఆయా రోజుల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి జడ్పీ ఛైర్మన్‌, ఎంపీపీల ప్రమాణ స్వీకారానికి కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా పరిషత్‌కు నిజామాబాద్‌ జడ్పీ కార్యాలయంలో పని చేస్తున్న వారిని పంపిస్తున్నారు. కొత్త మండలాలకు పాత మండలం ఉద్యోగులను విభజించి ఇచ్చారు. మొత్తానికి సిబ్బంది కేటాయింపు పూర్తి కావడంతో ఫర్నిచర్‌ విభజన ప్రక్రియ బుధవారం చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

జిల్లా పరిషత్‌ ఇలా..
నిజామాబాద్‌ జడ్పీలోని అన్ని విభాగాల్లో కలిపి 59 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కామారెడ్డి జడ్పీకి 26, నిజామాబాద్‌కు 33 మందిని కేటాయించారు. విభజనలో సొంత జిల్లా, సీనియర్‌, జూనియర్లను పరిగణనలోకి తీసుకున్నారు.

మండలాల పరిస్థితి..
కొత్త ఏర్పడిన వాటిల్లో ఇందల్వాయి, మెండోరా, ముప్కాల్‌, ఏర్గట్ల, రుద్రూర్‌, మోస్రా, చందూర్‌, నస్రుల్లాబాద్‌, పెద్దకొడప్‌గల్‌, బీబీపేట, రాజంపేట, రామారెడ్డి మండలాలు ఉన్నాయి. వీటికి ఎంపీడీవో, సీనియర్‌, జూనియర్‌, అటెండర్లను ఒక్కొక్కరి చొప్పున కేటాయించారు. వాస్తవానికి పదోన్నతులు ఇచ్చిన తర్వాత మండలాధికారులను నియమించాలి. పదోన్నతులు లేక పోవడంతో కొత్తవాటికి పాత వాటిల్లో ఉండే ఈవోపీఆర్డీ, పర్యవేక్షకులకు ఇన్‌ఛార్జులుగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ నెల 4న కొత్త మండలాల్లో పాలన మొదలు కానుంది. ఇప్పటికే ఆయా చోట్ల భవనాల ఎంపిక పూర్తి చేశారు. కొత్త మండలాలకు కేటాయించిన ఉద్యోగుల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. బయట పడితే ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావొచ్చని గోప్యత పాటిస్తున్నారు.

సీఈవో, ఏవోలను కేటాయించలేదు
కామారెడ్డి జడ్పీకి సీఈవో, ఏవో పోస్టులు ఉండగా వాటిలో ఇంకా ఎవరిని నియమించలేదు. డిప్యూటీ సీఈవో పోస్టును ఇవ్వడం లేదు. ఏవో(గణాంక అధికారి) రెండింటిని చూసుకోవల్సి ఉంటుంది. నిజామాబాద్‌ జడ్పీ సీఈవో వేణు తన మాతృశాఖ అయిన రెవెన్యూ శాఖకు వెళ్లాలని చూస్తున్నారు. ఆయన వెళ్లితే కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. ఈ నెల 5న కొత్త జడ్పీల పాలక వర్గాలు కొలువు దీరనున్న నేపథ్యంలో అంత కంటే ముందుగానే సీఈవో, ఏవోల నియామకాలపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉండనుంది.

సామగ్రి కొనుగోలుకు
కామారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో అవసరమైన కుర్చీలు, బల్లలు, మైకులు, స్పీకర్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.6.14 లక్షల నిధులను మంజూరు చేసింది. జడ్పీ ఛైర్మన్‌, సీఈవో, ఏవో, సమావేశ మందిరంలో అవసరమైన వాటిని సమకూర్చుకోవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here