వీడియో: వరదల్లో సైన్యం సాహసం..దేవుడిలా వచ్చారంటూ జేజేలు పలుకుతున్న జనం

0
0


వీడియో: వరదల్లో సైన్యం సాహసం..దేవుడిలా వచ్చారంటూ జేజేలు పలుకుతున్న జనం

బెంగళూరు: దేవుడు ఎక్కడో ఉండడు. మనలోనే ఉంటాడు. అవసరానికి బయటికొస్తాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే- దైవం మానుష్య రూపేణా అంటారు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, సైనిక బలగాలు చేపట్టిన సహాయక చర్యలను బట్టి చూస్తోంటే..పెద్దలు చెప్పిన మాటలు నిజమేనని మరోసారి నిరూపితమౌతున్నాయి. ఒక్క రాష్ట్రం కాదు.. రెండు రాష్ట్రాలు కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాలు వరద పోటుకు గురయ్యాయి.

ఈశాన్యాన ఉన్న అసోం నుంచి పశ్చిమాన ఉన్న గుజరాత్ వరకు, ఉత్తరాన ఉన్న ఉత్తరాఖండ్ నుంచి దక్షిణాన ఉన్న కేరళ వరకూ అన్నీ వరద ముంపునకు గురైన రాష్ట్రాలే. ప్రత్యేకించి- మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ వరద తాకిడికి గురయ్యాయి. పలువరు మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావానికి గురై ఒక్క కేరళలోనే 50మందికి పైగా మరణించారు. ఈ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా విరిగి పడుతున్న కొండ చరియలు, మట్టి పెళ్లలతో కూరుకుపోయింది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బళ్లారి, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఏనాడూ భారీ వర్షాల ముఖమే చూడని బెళగావి జిల్లాను తాజాగా వరదలు ముంచెత్తుతున్నాయి.

ఇలాంటి స్థితిలో త్రివిధ దళాలు, జాతీయ విపత్తు నిర్వహక బలగాలు రంగంలోకి దిగాయి. మరణాల సంఖ్యను తగ్గించడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నాయి. శతృసైన్యం ఎలా కనికరం లేకుండా, దయాదాక్షిణ్యాలు చూపకుండా విరుచుకుపడే ఆర్మీ, నౌక, వాయు సేనకు చెందిన జవాన్లు..దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరదల్లో చిక్కుకుపోయి, సహాయం కోసం ఎదురు చూస్తోన్న బాధితులను సకాలంలో ఆదుకుంటున్నారు. ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. తాజాగా- వరద నీటిలో చిక్కుకుని పోయిన తన కుటుంబాన్ని కాపాడిన ఓ జవానుకు ఓ మహిళ పాద నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ మహిళ తన కుటుంబ సభ్యులతో సహా ఓ పడవలో ఎక్కి వెళ్తూ, తన పక్కనే నిల్చున్న ఓ ఆర్మీ జవాను పాదాలను భక్తితో పాద నమస్కారం చేశారు. ఆ సమయంలో ఆ జవాను ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెబుతున్న ఈ వీడియో మన దేశ జవాన్లలోని మానవీయ కోణానికి అద్దం పడుతోంది. 45 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియో ఎక్కడిదనేది స్పష్టంగా తెలియరానప్పటికీ..కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి సంబంధించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెళగావి జిల్లా వరద బీభత్సానికి కకావికలమైన విషయం తెలిసిందే. ఈ జిల్లాలో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వారి కోసం సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here