వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

0
1


వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

మృతి చెందిన సెంటుమియా

బ్రహ్మాజివాడి(తాడ్వాయి), న్యూస్‌టుడే: బ్రహ్మాజివాడిలో 33/11 కేవీ విద్యుత్తు తీగల ఎత్తు పెంచేందుకు రహదారి పక్కన స్తంభం ఏర్పాటు చేస్తుండగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన సెంటుమియా(21) అనే కూలీ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లైన్‌మెన్‌ బాబు కృష్ణాజివాడి, తాడ్వాయి గ్రామాల మధ్య ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగల మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మాజివాడిలో సెంటుమియా ట్రాక్టరుతో స్తంభం ఏర్పాటు పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న సదాశివనగర్‌ సీఐ వెంకట్‌రెడ్డి, తాడ్వాయి ఎస్సై ప్రకాశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు విద్యుత్తుశాఖలో ఓ గుత్తేదారుడి వద్ద కూలీగా చేస్తున్నాడన్నారు. గ్రామంలో పని నిమిత్తం లైన్‌మెన్‌ బాబు పిలవడంతో వచ్చినట్లు పేర్కొన్నారు. లైన్‌మెన్‌ బాబు చరవాణి కాల్‌ రికార్డు ఆధారంగా ఎల్‌సీ తీసుకున్నది లేనిది పరిశీలిస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కేసుపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన పేర్కొన్నారు.

లారీ ఢీకొని..

అమ్దాపూర్‌(బోధన్‌ గ్రామీణం): బోధన్‌ మండలం రాజీవ్‌నగర్‌తండాకు చెందిన రమావత్‌ చందర్‌(37) ఆదివారం లారీ ఢీకొట్టిన ఘటనలో మృతిచెందినట్లు గ్రామీణ ఎస్సై సయ్యద్‌అహ్మద్‌ తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందర్‌ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం అమ్దాపూర్‌ వద్ద ఆటో నిలిపి ప్రయాణికుల కోసం రోడ్డు పక్కన నిలబడ్డాడు. ఇదే సమయంలో ఆటో వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ చందర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలైన చందర్‌ అక్కడికక్కడే మృతిచెందగా లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

లారీపై నుంచి పడి..

కాలూరు(ఇందూరు గ్రామీణం): కాలూరు శివారులో ప్రమాదవశాత్తు లారీపై నుంచి కిందపడి క్లీనర్‌ మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో ప్రభాకర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్‌ జిల్లాకు చెందిన పీరాజీ(34) లారీలో ధాన్యం బస్తాలు సరి చేస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఏఎస్సై బాల్‌రెడ్డి

కాల్వలో పడి..

మంచిప్ప(మోపాల్‌): మోపాల్‌ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన గంగాప్రసాద్‌(37) అనే వ్యక్తి కాల్వలో పడి మృతి చెందాడు. ఏఎస్సై బాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం అతను ఇంటి నుంచి బయటికెళ్లాడు. ఆదివారం ఉదయమైనా తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలో మంచిప్ప కొండెం చెరువు వెనక వైపు ఉన్న దామరకుంట సమీపంలోని కాల్వలో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here