శక్కర్‌నగర్‌లో ఆరు ఇళ్లలో దొంగతనం

0
2


శక్కర్‌నగర్‌లో ఆరు ఇళ్లలో దొంగతనం

13 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరణ

బాధితుల్లో ఒక ఎస్సై, ఏఎస్సై


బీరువాను పరిశీలిస్తున్న ఎస్సై అంబురియా

బోధన్‌, న్యూస్‌టుడే: శక్కర్‌నగర్‌ కాలనీలో బుధవారం అర్ధరాత్రి వరుసగా ఆరు ఇళ్లలో దొంగతనం జరిగింది. తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని చోటు చేసుకున్న ఘటన పోలీసులను ఉలికిపాటుకు గురిచేసింది. ఇంటి తాళాలు ధ్వంసమైన బాధితుల్లో ఒక ఎస్సై, ఏఎస్సై ఉన్నారు. మొత్తం 13 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పక్క ఇళ్లలో ఉన్న వారికి అలకిడి వినబడినా వారు రాకుండా బయటి నుంచి గడియ పెట్టారు. మొదట నాలుగు ఇళ్లలో చోరీ జరిగిందని భావించగా మరో రెండు ఇళ్లలో కూడా జరిగినట్టు గురువారం సాయంత్రం నిర్ధరణ అయింది. శక్కర్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న యాకం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్యను తీసుకొని హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లారు. వారి కుమారుడు మోహన్‌ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ ల్యాబ్‌లో పనిచేస్తున్నారు. రాత్రి విధులకు ఆయన వెళ్లగా ఇంటికి తాళం ఉంది. దీనిని పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. సమీపంలో సత్యనారాయణగుప్తా అనే ఎస్సై ఇంట్లోకి వెళ్లారు. ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ట్రాఫిక్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. బీరువా తెరిచేందుకు విఫలయత్నం చేశారు. ఆయన సోదరుడు పట్టణ ఠాణాలో ఏఎస్‌ఐగా పనిచేసే రవికుమార్‌ భార్య వారి ఇంటి పక్క గదిలో చీరల దుకాణం నిర్వహిస్తున్నారు. లోనికి వెళ్లి గలాపెట్టెలో ఉన్న కొద్దిపాటి నగదు తీసుకెళ్లారు. పోస్టాఫీస్‌ వద్ద గల మరో ఇంటి తాళం పగులగొట్టి వెళ్లినా ఏమీ దొరకలేదు. నాలుగిళ్లలో దొంగతనం జరిగిందని భావించి ఎస్సై అంబురియా ఘటన స్థలాలను పరిశీలించారు. క్లూస్‌టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కాలనీలోని మరో రెండు ఇళ్ల తాళాలు పగిలి ఉన్నట్టు సాయంత్రం తెలియడంతో సీఐ నాగార్జున్‌గౌడ్‌ వెళ్లారు. లోకసాయి అనే వ్యక్తి తన కుటుంబీకులను తీసుకొని పది రోజుల కిందట బంధువుల ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి 8 తులాల బంగారం, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మల్లేశ్వరి ఇంట్లో చొరబడి చీరలు పట్టుకెళ్లారు.

వాహనాల తనిఖీ

ఒకే రాత్రి వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు గురువారం వాహనాల తనిఖీలు చేపట్టారు. కాలనీలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆధారాలు లభ్యం కాలేదు. ఘటన వెలుగు చూసిన వెంటనే ప్రధాన రహదారులపై వాహనాలు తనిఖీ చేశారు. పక్కా వ్యూహంతో తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. రెండు నెలల కిందట వెంకటేశ్వర కాలనీలో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. దొంగలు ఇంకా పట్టుబడలేదు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here