శ్రీరాంసాగర్‌ కళకళ.. నిజాంసాగర్‌ వెలవెల

0
3


శ్రీరాంసాగర్‌ కళకళ.. నిజాంసాగర్‌ వెలవెల

ఉమ్మడి జిల్లా జలాశయాల్లో భిన్న పరిస్థితులు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు జీవనాధారమైన జలాశయాల్లో భిన్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానికంగా సాధారణ వర్షాలు కురిసినా ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. జిల్లాలో పూర్తి స్థాయిలో నీరందించే నిజాంసాగర్‌ ప్రాజెక్టు వెలవెల పోతుండడంతో ఖరీఫ్‌లో చుక్క నీరందలేదు. యాసంగి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. శ్రీరాంసాగర్‌ మన వద్దే ఉన్నప్పటికీ స్థానిక రైతుల కంటే జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల రైతులకే ఎక్కువగా ప్రయోజనముంటుంది. వర్షాకాలం ముగుస్తున్న నేపథ్యంలో మరో పది రోజులే అల్పపీడనం, రుతుపవనాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆ పుణ్యకాలం గడిస్తే జలాశయాల పరిస్థితి ఎలా ఉండబోతుందనేది రైతులో ఆందోళన రేకెత్తిస్తోంది.
భయ జిల్లాల రైతులకు ఆయువుపట్టుగా ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా కనీసం 2.30 లక్షల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. వాస్తవానికి కామారెడ్డి జిల్ల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న సింగూరు నిండాలి. సంగారెడ్డి, మెదక్‌, జహీరాబాద్‌, కర్ణాటక రాష్ట్రం బీదర్‌ తదిరత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే వచ్చే వరదపైనే ఈ జలాశయం మనుగడ ఆధారపడి ఉంది. ఇప్పటివరకు పదో వంతు కూడా రాలేదు. యాసంగిలో పంటలు వేసే ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారనుంది. కామారెడ్డి జిల్లాలో ఈ వార్షిక సగటు వర్షపాతం ఎక్కువగా నమోదైన ప్రాజెక్టులోకి నీరు రాలేదు.

ఎస్సారెస్పీకి ఇప్పుడిప్పుడే.. నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలకు తాగు, సాగు నీరందించే ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా చెప్పుకునే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇప్పుడిప్పుడే జలకళ ఉట్టిపడుతోంది. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటూ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో జలాశయం నిండుతోంది. నిత్యం 35-70 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. ఇప్పటికే సగం ప్రాజెక్టు నిండి యాసంగి సాగుకు ఊతమిచ్చింది. 9 లక్షల ఎకరాలకు భరోసా కలిగింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here