శ్రీరాముడి చెంతకు..కాళేశ్వర గంగ

0
5


శ్రీరాముడి చెంతకు..కాళేశ్వర గంగ

● వరద కాల్వలో జలకళ

● రైతులతో కలిసి మంత్రి ప్రశాంత్‌రెడ్డి పూజలు

ఈనాడు, నిజామాబాద్‌

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల వద్దకు మంగళవారం వచ్చిన కాళేశ్వరం నీళ్లకు పూజలు చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి,

నిజామాబాద్‌ జిల్లా పాలనాధికారి ఎం.ఆర్‌.ఎం.రావు తదితరులు

కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్‌ను చేరాయి. వరద కాలువలో నిండుగా ప్రవహిస్తూ ముప్కాల్‌ వద్ద ఉన్న గేట్లను ముద్దాడాయి. పునరుజ్జీవం పంపుహౌస్‌ మోటార్లకు మరోమారు వెట్‌ రన్‌ నిర్వహించటంతో నీరు ఎగువకు వరద కాలువ గుండా చేరింది. మూడు రోజుల కిందట వేంపల్లి వరకు రాగా.. ఈ సారి ఏకంగా ప్రాజెక్టు గేట్లను తాకాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రైతులతో కలిసి పూజలు చేశారు. కల సాకారమైందని భావోద్వేగానికి లోనయ్యారు. సందర్శకులతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు సైతం పూజలు చేశారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన పునరుజ్జీవ పథకం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. మూడు పంపుహౌసుల్లో రెండు చోట్ల నిర్మాణాలు పూర్తవడంతో మోటార్లను సిద్ధం చేసే పనిలో ఇంజినీర్లు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట జగిత్యాల జిల్లా రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంపుహౌస్‌ల్లోని నాలుగేసి మోటార్లతో వెట్‌ రన్‌ నిర్వహించగా వరద కాలువలోకి ఎత్తిపోసిన నీరు మన జిల్లాకు చేరింది. ఒక్కో పంపుహౌస్‌లో ఎనిమిదేసి మోటార్లు ఉండగా.. నాలుగింటితో ఎత్తిపోసేందుకు సిద్ధం చేసినట్లు ఆ సందర్భంలో అధికారులు చెప్పారు. రాజేశ్వర్‌రావుపేటలో రెండు మోటార్లలో సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించి ఇంజినీర్లు సోమవారం వాటికి మరమ్మతులు పూర్తిచేశారు. సోమవారం రాత్రి మరోమారు నీటిని ఎత్తిపోశారు. అవి ఎస్సారెస్పీ చెంతకు చేరాయి. రాంపూర్‌లో అయిదో మోటార్‌ వెట్‌ రన్‌ కూడా విజయవతం చేయడం విశేషం. మొత్తంగా ఎల్లంపల్లి నుంచి లక్ష్మి పంపుహౌస్‌కు చేరే నీటిని పంపింగ్‌ చేయటం ద్వారా వరద కాలువ గుండా రాంపూర్‌ వరకు చేరుతాయి. అక్కడి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎగువన శ్రీరాంసాగర్‌కు తెచ్చేందుకు రెండు పంపుహౌస్‌ల్లో మోటార్లను సిద్ధం చేసినట్లు పునరుజ్జీవ పథకం అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్టు లోపలికి ఇలా..

ముప్కాల్‌ పంపుహౌస్‌తో సంబంధం లేకుండా ప్రాజెక్టులోకి నీటిని పంపే అవకాశం ఉందని అధికారులు ఇదివరకే చెప్పారు. అయితే ఎస్సారెస్పీలో ప్రస్తుతం నీటిమట్టం 1071.30 అడుగుల వరకు ఉంది. గేట్ల వరకు వచ్చి నిలిచిన కాళేశ్వరం జలాలు 1076 అడుగుల మేర ఉంది. ప్రస్తుతం దిగువన వెట రన్‌ నిలిపేశారు. పంపింగ్‌ జరిగే వేళ గేట్లకు వెలుపల 1085 అడుగుల మేర ఉండేలా చూస్తారు. పంపింగ్‌ అలాగే కొనసాగిస్తూ గేట్లు తెరిస్తే నీరు ప్రాజెక్టులోకి చేరుంది. లేదంటే ప్రాజెక్టులోని నీరు బయటకు వస్తుంది. రెండేసి మోటార్లతో పంపింగ్‌ చేస్తే రోజులో 0.25 టీఎంసీలు, నాలుగేసి మోటార్లతో పంపింగ్‌ చేస్తే రోజులో 0.5 టీఎంసీలు తరలించొచ్చని అంచనా. పథకం ప్రారంభోత్సవం ఎప్పుడనేది ముఖ్యంత్రిని సంప్రదించాక తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది.

మంత్రి ఆధ్వర్యంలో సంబురాలు

పునరుజ్జీవం ఆలోచన కేసీఆర్‌దే అయినా.. ఆ పనుల్లో వేగం పెంచడంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఎన్నికల సందర్భంలోనూ ఆయన ఈ పథకాన్నే ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. కాళేశ్వరం జలాలు జిల్లాకు వచ్చిన సందర్భంలో మంత్రి రైతులు, పార్టీ నాయకులతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నారు. నీళ్లలోకి పూలు వదిలి పూజలు చేశారు. రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు.


స్సారెస్పీ నిల్వ సామర్థ్యం: 90.313 టీఎంసీలు

ప్రస్తుతం: 31.63 టీఎంసీలు, గత ఏడాది ఈ రోజున: 71 టీఎంసీలు

నీటిమట్టం: 1090 అడుగులు, ప్రస్తుతం: 1071.30 అడుగులు

ఇన్‌ఫ్లో: 9850 క్యూసెక్కులు ,అవుట్‌ ఫ్లో: 519 క్యూసెక్కులు (మిషన్‌ భగీరథకు: 142, ఆవిరి 377 కూసెక్కులు)

మంగళవారం కాకతీయ కాలువకు 2 వేల క్యూసెక్కులు విడిచారు


 

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here