సన్నరకం.. మద్దతు గగనం

0
4


సన్నరకం.. మద్దతు గగనం

దిక్కుతోచక దళారులకు విక్రయిస్తున్న రైతులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి న్యూస్‌టుడే, బీర్కూర్‌

సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు

ఆరుగాలం కష్టపడి పండించి దిగుబడి తీయడం.. గిట్టుబాటు ధర రాక.. గత్యంతరం లేక.. అప్పుల భయంతో.. నష్టానికి తెగనమ్ముకోవడం అన్నదాతకు షరామామూలైంది. పంటతోపాటే ఆశలనూ పెంచుకునే రైతుకు ఆఖరికి అప్పులే మిగులుతున్నాయి. పాలకులు, అధికారులు స్పందించి నలుగురికీ అన్నం పెట్టే సాగన్నను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

న్నరకం ధాన్యాన్ని పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు సిండికేటుగా మారి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నారు. అకాల వర్షాలు చేతికొచ్చిన పంటను నిలువునా ముంచాయి. సన్నరకం వరి నేలవాలింది. ఇన్ని కష్టాలను అధిగమించి పండించిన ధాన్యాన్ని దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారులకు పరోక్ష సహకారం

ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్‌శాఖ అధికారులు వ్యాపారులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారనే విమర్శలున్నాయి. వరికోతలు ప్రారంభం కాగానే విపణుల్లో బీట్‌ నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకం ధాన్యానికే మద్దతు ధర లభిస్తోంది. సన్నరకం ధాన్యాన్ని గ్రేడ్‌- 2 రకం కింద పరిగణిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి డిమాండ్‌ ఉండటంతో వ్యాపారులకు పరోక్షంగా తోడ్పాటు అందిస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌ యార్డుల్లో బీట్‌ నిర్వహిస్తే వ్యాపారుల మధ్య పోటీ పెరిగి అన్నదాతల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. మిర్యాలగూడ, హైదరాబాద్‌, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దళారుల ద్వారా సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. వర్ని, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లో దళారులు ప్రత్యేకంగా దుకాణాలు తెరిచి బహిరంగంగానే వ్యాపారం నిర్వహిస్తున్నా చర్యలు తీసుకునే నాథులే లేకుండా పోయారు.

గిట్టుబాటు గగనమే

బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, కోటగిరి, బీర్కూర్‌, వర్ని మండలాల్లో ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, గంగాకావేరి, బాపట్ల బీపీటీలతో పాటు నూతంగా బీపీటీ- 95 సన్నరకం వరిని సాగు చేశారు. గతంలో ఇవి సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.1900- రూ.2200 వరకు ధర రావడంతో లాభాలను ఆర్జించారు. ఈసారి కూడా అదే ఆశతో సాగు చేశారు. జోరుగా కురుస్తున్న వర్షాలతో పంటను ఇళ్లలో నిల్వ చేసుకోలేక, గిట్టుబాటు ధరకు కొనే నాథుడే లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక వేళ నిల్వ చేసుకుందామంటే పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయని వాపోతున్నారు.

అరకొరగా ఫలితం

ఎక్కువ మంది రైతులు అకాల వర్షాల భయంతో వరి పంటను కోసి ధాన్యాన్ని పొలాల వద్దే కుప్పలుగా పోసి ఉంచారు. రోజుల తరబడి అలాగే ఉంచలేక తప్పని పరిస్థితుల్లో దళారులకు విక్రయిస్తున్నారు. కోతల ప్రారంభంలో దళారులు సన్నరకం ధాన్యాన్ని రూ.1910 ధరకు కొనుగోలు చేయగా ఇప్పుడు రూ.1700 మాత్రమే ఇస్తామంటున్నారు. గిట్టుబాటు కాకపోయినాచేసేది లేక అన్నదాతలు వారికే విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా జీరో దందాగానే సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here