సరకెవరిది సారూ..?

0
1


సరకెవరిది సారూ..?

క్లోరోహైడ్రేడ్‌ అక్రమ రవాణా

తెప్పించిన వారిని తప్పించే ప్రయత్నాలు!

పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు

ఈనాడు, నిజామాబాద్‌

రసాయనాలతో తయారైన కల్లు నేటికీ ఉమ్మడి జిల్లాలో జోరుగా అమ్ముడవుతోంది. ప్రణాంతకమైన ఈ మత్తు పానీయం తయారీ కోసం విక్రయదారులు అక్రమ మార్గాల్లో క్లోరోహైడ్రేడ్‌ రసాయనాన్ని భారీగా దిగుమతి చేస్తూనే ఉన్నారు. రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తూ ఇందూరుకు రప్పిస్తున్నారు. ఈ అక్రమ దందా గుట్టు గురువారం రాత్రి స్థానికంగా పట్టుపడటంతో రట్టయింది. గుజరాత్‌ నుంచి తీసుకొచ్చిన యాభై బస్తాలు పట్టుబడిన విషయం తెలిసిందే. సరకు తెప్పించిన పెద్దలను తప్పించే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి.

దర్జాగా రవాణా..

కొన్ని నెలల కిందట మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సులో అల్ఫాజోలం పట్టుపడింది. ఇదీ కృత్రిమ కల్లు తయారీలో వినియోగించేదే. క్లోరోహైడ్రేడ్‌(సీహెచ్‌) కంటే ఖరీదైనదిగా చెబుతారు. సీహెచ్‌ సరఫరా లేని సందర్భంలో అక్రమ విక్రయదారులు అల్ఫాజోలంను పక్క రాష్ట్రం నుంచి తెప్పించి మరీ కల్తీ కల్లు తయారు చేసి విక్రయాలు సాగించినట్లు అప్పట్లో ఆధారాలు బయటపడ్డాయి. కాగా సీహెచ్‌ రవాణాను జిల్లాలో కట్టడి చేశామని ఇంతకాలంగా చెబుతూ వస్తున్న ఆబ్కారీ అధికారులు, గురువారం పెద్దఎత్తున పట్టుపడటంతో అవాక్కయ్యారు. ఇది మన జిల్లాకు సంబంధించినది కాదంటున్నారు. నిజామాబాద్‌ నగర శివారులో సరకు దింపుతుండగా పోలీసులు పట్టుకొంటే మన జిల్లాది కాదని, మన ప్రాంతంలో సీహెచ్‌ను కల్లు తయారీలో వాడటం లేదని చెబుతుండటం విడ్డూరం.

పైరవీలు షురూ..!

పెద్దమొత్తంలో పట్టుపడిన రసాయనాలను గుజరాత్‌ నుంచి తెప్పించింది ఎవరనే ప్రశ్నకు సమాధానం ఇంకా బయటకు రావటం లేదు. సరకు తరలించిన డ్రైవరు, చిన్నాచితక వ్యక్తులను ప్రస్తుతానికి కేసులో చూపించారు. ఖరీదైన మాల్‌ సుదూర ప్రాంతం నుంచి తెప్పించిన వ్యాపారులు, అది కాస్త పట్టుపడటంతో అప్రమత్తమయ్యారు. ఫోన్లు గురువారం రాత్రి నుంచే స్విచ్ఛాఫ్‌ చేసినట్లు తెలుస్తోంది.

పక్కా సమాచారంతో..

క్లోరోహైడ్రేట్‌ అక్రమ రవాణాకు సంబంధించి మాదకద్రవ్యాల నిరోధక విభాగం, సీఐ సెల్‌ అధికారులకు పక్కా సమాచారం ఉంది. వీరు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. నిజామాబాద్‌ పోలీసులకూ సమాచారం ఉండటంతో అంతా కలిసి గురువారం రాత్రి మాధవనగర్‌ సమీపంలో దాడి చేసి 1,250 కిలోల క్లోరోహైడ్రేట్‌ పట్టుకొన్నారు. దీని విలువ రూ.కోట్లల్లోనే ఉంటుందన్నది అనధికారిక సమాచారం. ఇంత పెద్దమొత్తంలో దొరికిన సరకును ఉభయ జిల్లాల్లోని కల్లు వ్యాపారులకు సరఫరా చేసేందుకు తెచ్చినట్లుగా తెలుస్తోంది.

నలుగురి రిమాండు

న్యూస్‌టుడే – నిజామాబాద్‌ నేరవార్తలు :నగర శివారులో భారీ మొత్తంలో క్లోరోహైడ్రేట్‌ పట్టుబడిన ఘటనలో అసలు సూత్రధారులెవరన్నది చర్చనీయంగా మారింది. ఓ ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు వారి కోసం వేట సాగిస్తున్నారు. మరోవైపు గురువారం రాత్రి సంఘటన స్థలంలో పట్టుబడిన నలుగురు నిందితులను శుక్రవారం రిమాండుకి తరలించారు.

అసలు వ్యక్తులెవరు..?

సంఘటన స్థలంలో లారీతో పాటు ఓ ఎర్టీగా కారు, ద్విచక్ర వాహనాలను నిందితులు వదిలేసి వెళ్లారు. లారీ బోధన్‌కు చెందినదిగా.. సీహెచ్‌ బస్తాలతో ఉన్న ఆటో వినాయక్‌నగర్‌కు చెందినదిగా గుర్తించారు. ● పట్టుబడిన లారీ, ఆటో డ్రైవర్లు అతీక్‌, నసీరుద్దిన్‌, ఇబ్రహీం, కరుణాకర్‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.

మిగిలిన ప్రధాన నిందితులు ఎవరనే విషయమై దర్యాప్తు కొనసాగుతోంది. వీరిలో ఒకరు కామారెడ్డికి చెందిన వ్యక్తి కాగా.. మరో ఇద్దరు బాల్కొండ నియోజకవర్గ వాసులుగా తెలిసింది. మాధవనగర్‌ వద్ద వదిలేసి వెళ్లిన వాహనాల ఆధారంగా వీరిని పట్టుకొనేందుకు వేట కొనసాగుతోంది. త్వరలోనే అరెస్టు చేస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం.

గతంలోను ఇదే తరహాలో ఓ లారీలో రహస్యంగా సీహెచ్‌ను ఇక్కడికి అక్రమ రవాణా చేసినట్లుగా తేలింది. దీనిని ఎక్కడెక్కడికి తరలించారు? ఏయే డిపోలకు విక్రయించారన్నది తేలాల్సి ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here