సాగు నీటి పరవళ్లు

0
3


సాగు నీటి పరవళ్లు

సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే

నిజాంసాగర్‌ ప్రాజెక్టును నమ్ముకొని ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులను సింగీతం, కల్యాణి ప్రాజెక్టులు ఆదుకుంటున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో తగినన్ని నీళ్లు లేని సంగతి తెలిసిందే. ఖరీఫ్‌లో సాగర్‌ ఆయకట్టు కింద అలీసాగర్‌ వరకు 1.15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. రెండు ప్రాజెక్టులు నిండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరద మళ్లింపు కోసం..

1998 సంవత్సరంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా వరద నీటి మళ్లింపు కోసం వీటిని నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకున్నారు. వర్ని, పెద్దగుట్ట, గాంధారి ప్రాంతాల్లోని వరద నీరు వృథాగా మంజీరాలోకి ప్రవహించకుండా ఉండేందుకు సింగీతాన్ని నిర్మించి సాగర్‌ ప్రధాన కాలువకి అనుసంధానించారు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి, కల్యాణి, లింగంపేట ప్రాంతాల్లోని వరద నీటి కోసం కల్యాణి నిర్మించారు. ప్రస్తుతం సింగీతం 416.55 మీటర్లతో కల్యాణి 409.50 మీటర్లతో పూర్తిస్థాయిలో నిండింది. గత పది రోజులుగా నిజాంసాగర్‌ ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నారు.

కళ్యాణి వరద గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

నిండిన 145 చెరువులు

ప్రధాన కాలువ ఆయకట్టు కింద సాగర్‌ మొదటి డిస్ట్రిబ్యూటరీ నుంచి అలీసాగర్‌ వరకు 145 చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, కోటగిరి, వర్ని, రుద్రూర్‌, బోధన్‌, ఎడపల్లి మండలాల్లోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి.

సంతోషంగా ఉంది: బావుసింగ్‌, ఆయకట్టు రైతు, కొత్తాబాది

సాగర్‌ను నమ్ముకొని వరి వేయడానికి సిద్ధంగా ఉంటే చుక్క నీరు రాక నిరాశ చెందాను. తీరా సింగీతం, కల్యాణి ప్రాజెక్టుల ద్వారా నీరు విడుదల అవుతుండటంతో చాలా సంతోషంగా ఉంది. గ్రామంలోని చెరువు కూడా నిండినందున సాగుకు ఎటువంటి ఇబ్బందులు లేవు.

పంటలు గట్టెక్కినట్లే : బన్సీ, ఆయకట్టు రైతు, కోనతండా

కల్యాణి నుంచి పది రోజులుగా సాగు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో పంటల సాగులో నిమగ్నమయ్యాను. సాగు నీటికి ఇబ్బందులు లేకపోవడంతో ఈసారికి పంటలు గట్టెక్కినట్లే.


పోచారంలో 1.338 టీఎంసీల నీరు

పోచారం(నాగిరెడ్డిపేట): పోచారం ప్రాజెక్టులో శుక్రవారం 1.338 టీఎంసీల నీరు చేరినట్లు సాగునీటి పారుదల శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. జలాశయంలో గురువారం 16.3 అడుగుల నీరు ఉండగా, మరో 12 ఇంచుల నీరు పెరగడంతో 17.5 అడుగులకు నీరు చేరిందన్నారు. దీంతో ప్రాజెక్టులో 1338 ఎంసీఎఫ్‌టీలకు నీరు చేరుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ఎగువ నుంచి 1100 క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు పేర్కొన్నారు.


బెల్లాల్‌ జలపాతం

పారుతున్న బెల్లాల్‌ చెరువు

బోధన్‌పట్టణం: బెల్లాల్‌ చెరువు అలుగు వద్ద జల సవ్వడి సందడి చేస్తోంది. మత్తడి మీదుగా పరవళ్లు తొక్కుతున్న వరద జలపాతాన్ని తలపిస్తూ కనువిందు చేస్తోంది. గత ఏడాది తక్కువ కాలం అలుగు పారడంతో స్థానికులకు జల సందడిని ఆస్వాదించలేకపోయారు. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువు పూర్తిస్థాయిలో నిండింది. గురువారం రాత్రి నుంచి అలుగుపారుతోంది. ఈ దృశాన్ని చూడటానికి స్థానికులు చెరువు వద్దకు చేరుకొంటున్నారు. అలుగు దిగువ భాగంలో కొందరు చేపల వేట కొనసాగిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here