సాగేనా.. ఆగేనా..?●

0
4


సాగేనా.. ఆగేనా..?

పుర పోరుపై ఉత్కంఠ..!

ఆశావహుల నిరీక్షణ

నేడు హైకోర్టు తీర్పుతో తేలనున్న భవితవ్యం

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే:

కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం

అప్పుడు.. ఇప్పుడంటూ పురపాలక ఎన్నికల నిర్వహణపై మీమాంస నెలకొంది. ఇప్పటికి మూడు పర్యాయాలు హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కోర్టుకు తెలపడం.. ప్రక్రియ అంతా సవ్యంగా జరిగిందని నివేదిక ఇవ్వడంతో మంగళవారం కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. మొత్తం మీద పుర పోరు ఆగేనా.. సాగేనా అని సందిగ్ధం నెలకొంది. కామారెడ్డి పురపాలిక పరిధిలో ఆశావహులు తలపట్టుకుంటున్నారు. ఎన్నికలు త్వరగా ముగిస్తే ఊపిరి పీల్చుకోవచ్చని భావిస్తున్నారు.

పురపాలక ఎన్నికలను ఈ ఏడాది జూన్‌ నెలలోనే నిర్వహించాలని ప్రభుత్వం హడావుడి చేసింది. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ప్రకటన తదితర ప్రక్రియలను నిర్వహించింది. జులై నెలలో తుది జాబితాలను ప్రకటించారు. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి అన్న తరుణంలో వివిధ ప్రాంత వాసులు కోర్టుకెక్కారు. అప్పటి వరకు పురపాలికలో రాజకీయ వేడి నెలకొనగా ఒక్కసారిగా వాతావావరణం స్తబ్ధుగా మారింది. రిజర్వేషన్ల ఖరారుకు ముందే ఆశావహులు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. వార్డులో పోటీకి అనుకూలంగా రాకుంటే సతి లేదా పతిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. పునర్విభజన ఫలితంగా వార్డులు పెరిగాయి. ప్రతి వార్డు నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రకటన ఎప్పుడొచ్చినా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను సిద్ధం చేశారు. పోలింగ్‌ కేంద్రాల లెక్క తేల్చారు. ఓటర్ల జాబితా ప్రకటించారు. రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది.

ఎన్నికల జాప్యంతో తడిసి మోపెడు

పురపాలక ఎన్నికల జాప్యంతో ఆశావహులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. వార్డులో గత కౌన్సిల్‌లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సారి కూడా బరిలో నిలవాలని తహతహలాడుతున్నారు. ఈ పాటికే ఆషాఢ మాసంలో బోనాల పండగలకు విందులను ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా ఎద్దడి ప్రాంతాల్లో నీటిని సమకూరుస్తున్నారు. వివిధ పండగలకు వార్డుల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. వినాయక చవితికి చందాలపై ఆయా మండపాల నిర్వాహకులతో ముందస్తుగా సంప్రదింపులు జరుపుతున్నారు. విగ్రహ దాతలుగా ఉంటామని చెబుతున్నారు. మంగళవారం ఎన్నికల నిర్వహణపై తీర్పు వాయిదా పడితే ఆశావహులకు కష్టతరం కానుంది.

పుర పోరుకు సిద్ధంగా

లక్షకు పైగా జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణంలో ఎన్నికలెప్పుడొచ్చినా వివిధ రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల ప్రకటనకు ముందే వివిధ రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో మున్సిపల్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పరితపిస్తున్నాయి. పురపాలక ఎన్నికల్లో 50 శాతం స్థానాలను మహిళకు కేటాయించగా జిల్లా కేంద్రంలో 25 వార్డుల్లో అతివలు పోటీ చేయనున్నారు. గతంలో పరిధి ఎక్కువగా ఉన్న వార్డులను కుదించారు. 33 వార్డుల సంఖ్య 49 కి చేరింది. ఈ సారి అత్యధికంగా యువకులు పోటీ చేయాలని భావిస్తుండటంతో పోరు హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here