సీఎం కేసీఆర్ కు నగరిలో రోజా ఆతిధ్యం : ఆయనతో కలిసి కంచీపురానికి : ఫైర్ బ్రాండ్ అసలు లక్ష్యం ఇదేనా..!

0
0


సీఎం కేసీఆర్ కు నగరిలో రోజా ఆతిధ్యం : ఆయనతో కలిసి కంచీపురానికి : ఫైర్ బ్రాండ్ అసలు లక్ష్యం ఇదేనా..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. నగరిలోని తన ఇంట కేసీఆర్ కు విందు అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కంచి పురం వెళ్లే క్రమంలో హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత కంచీ పురం వెళ్లే సమయంలోనే రోజా నివాసానికి వెళ్లాలని భావించినా సమయాభావం వలన సాధ్యపడలేదు. దీంతో.. రోజా నగరి లో కేసీఆర్ కు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌ కుటుంబంతో పాటు ఎమ్మెల్యే రోజా కాంచీపురం వెళ్లారు. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో కేసీఆర్ నగరిలో రోజా నివాసానికి వెళ్లారు. అక్కడ రోజా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటుగా కుటుంబ సభ్యులకు తేనేటి విందు ఇచ్చారు. దీని ద్వారా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన అసలు లక్ష్యం ఏంటో చెప్పే ప్రయత్నం చేసారు.

నగరిలో కేసీఆర్ కు రోజా ఆతిథ్యం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైసీపీ నేత రోజా అతిధ్యం ఇచ్చారు. కంచి పర్యటన కోసం హైదరాబాద్ నుండి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. అక్కడ సీఎంకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి దర్శనార్థం కేసీఆర్ రోడ్డు మార్గాన కంచికి బయలుదేరి వెళ్లారు. కంచికి వెళ్లేదారిలోని నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంటికి చేరుకుని తేనీటి విందు స్వీకరిస్తారని తొలుత అనుకున్నారు. అయితే సమయాభావం వల్ల షెడ్యూల్‌లో చిన్నపాటి మార్పులు చేశారు. దీంతో..నగరి మీదుగా వెళ్తున్న సమయంలో తన ఇంటి వద్ద కేసీఆర్ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా స్వాగతం పలికారు. తన ఇంటి లోపలకు రావాలని ఆహ్వానించారు. అయితే, తిరుగు ప్రయాణంలో వస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ కుటుంబంతో పాటు ఎమ్మెల్యే రోజా కాంచీపురం వెళ్లారు. కాంచీపురంలో కేసీఆర్ అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు.కేసీఆర్ రాక సందర్భంగా నగరిలో ఏపీ సీఎం జగన్..రోజా ఫొటోలతో కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటయ్యాయి. రోజా కేసీఆర్ కు స్వాగతం పలకటంతో పాటుగా తన కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి పరిచయం చేసారు. ఆ తరువాత కేసీఆర్ నేరుగా కంచి వెళ్లారు.

రోజా నివాసంలో కేసీఆర్ కుటుంబం..

రోజా నివాసంలో కేసీఆర్ కుటుంబం..

తిరుగు ప్రయాణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఇచ్చిన మాట ప్రకారం నగరిలో రోజా నివాసానికి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ తో పాటుగా కవిత సైతం రోజా ఇంటికి చేరుకున్నారు. అక్కడ రోజా తేనేటి విందు ఏర్పాటు చేసారు. రాజకీయంగా అక్కడి పరిస్థితులను.. ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజాను పరిశ్రమల గురించి కేసీఆర్ ఆరా తీసారు. ఏపీలో పారిశ్రామికంగా ఎదగటానికి ఉన్న అవకాశాలను ప్రస్తావించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఏపీ.. తెలంగాణ లోని రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరిందని..పది సంవత్సరాల తరువాత ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల క్రితం 35 దేశాల రాయబారులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన భేటీ పైనా వారిద్దరూ చర్చించినట్లుగా సమాచారం. ఆ తరువాత కేసీఆర్..కవితకు ఎమ్మెల్యే రోజా శాలువాతో సత్కరించారు. రోజా చూపించిన ఆతిధ్యానికి కేసీఆర్ సైతం సంతోషించారు.

ఫైర్ బ్రాండ్ అసలు లక్ష్యం ఇదేనా...!

ఫైర్ బ్రాండ్ అసలు లక్ష్యం ఇదేనా…!

చిత్తూరు జిల్లాలో సొంత పార్టీకి చెందిన ఒక ప్రముఖుడు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారనేది తొలి నుండి రోజా భావన. తన జిల్లా నుండే తన సామాజిక వర్గానికి చెందిన ఆ నేత తొలి నుండి కాంట్రాక్టులు చస్తుంటారు. తెలంగాణలోనూ అనేక కాంట్రాక్టులు దక్కించుకున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటం పైన రోజా ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ బుజ్జగించి నామినేటెడ్ పదవి ఇస్తానని చెబుతూ..నగరి నియోజకవర్గంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోరని హామీ ఇచ్చారు. రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి అప్పగించారు. క్యాబినెట్ రాంక్ పదవి జగన్ వద్ద దక్కించుకున్న రోజా.. ఇక, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద సైతం తన ఇమేజ్ ప్రదర్శించేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అంతే, తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన వివరాలు తెలుసుకున్న వెంటనే తన ఇంటికి విందుకు రావాలని ఆహ్వానించారు. గతంలో తిరుపతి వచ్చిన సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్..ఇప్పుడు రోజా ఇంటికి వెళ్లటం ద్వారా తనను గౌరవించే వారి వద్దకు తానే వెళ్తాననే సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ తో పాటుగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..మంత్రి పెద్దిరెడ్డి సైతం రోజా ఇంటికి వచ్చారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here