సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయాల్సిందే.. కేటీఆర్‌పై మండిపడ్డ దత్తన్న..!

0
1


సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయాల్సిందే.. కేటీఆర్‌పై మండిపడ్డ దత్తన్న..!

హైదరాబాద్‌ : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్ పార్టీకి దీటుగా బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీని మాటల తూటాలతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు గులాబీ నేతలు. అదే క్రమంలో కమలనాథులు సైతం రివర్స్ కౌంటర్ ఇస్తూ ఉనికి చాటుకుంటున్నారు. అయితే తెలంగాణ విమోచన దినం మరోసారి ఈ రెండు పార్టీల మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది.

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మండిపడ్డారు. జాతీయవాదాన్ని మతవాదంతో ఎలా ముడిపెడతారంటూ ఫైరయ్యారు. దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం తొత్తుగా మారిన టీఆర్ఎస్.. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడానికి భయపడుతోందన్నారు. ఆగస్టు 15వ తేదీన ఎలాగైతే జాతీయ జెండా ఎగురవేస్తారో.. సెప్టెంబర్ 17వ తేదీన కూడా అలాగే నేషనల్ ఫ్లాగ్ ఎగురవేయాలని సూచించారు.

ఇక పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకిపారేశారు దత్తన్న. చిదంబరం లాంటి పెద్దాయన ఆర్టికల్ 370 రద్దును మతంతో ముడిపెట్టి చూడటం సరికాదని హితవు పలికారు. అసలు ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం లేదని చెప్పుకొచ్చారు. ఒకరలా మరొకరు ఇలా మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీరు అందించని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కరువై పొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఫైరయ్యారు. అన్నదాత కన్నీళ్లు తుడిచే ప్రయత్నాలు చేయడం లేదని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీకి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here